టీ బిల్లుపై ఓటింగ్‌కు స్పీకర్‌కు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని, ఓటింగ్ ద్వారా విభజన బిల్లును తిరస్కరించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ 77వ నిబంధన కింద నోటీసులు ఇచ్చింది. సమైక్య తీర్మానం విషయంలో ఇంతకాలం వైఎస్సార్ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న టీడీపీ చివరకు ఇదే నిబంధన కింద శుక్రవారం స్పీకర్‌కు నోటీసులు అందజేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఓటింగ్ ద్వారా తిరస్కరించని పక్షంలో నష్టం జరుగుతుందని, స్పీకర్ వెంటనే స్పందించాలని టీడీపీ నేతలు కోరారు.
రాజ్యాంగ సంప్రదాయాలకు భిన్నంగా బిల్లును ప్రవేశపెట్టారని, బిల్లును యధాతథంగా అమలు చేస్తే రాష్ట్రంలోని అన్ని రంగాలతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. బిల్లులోని అంశాలను సభ తిరస్కరించటంతో పాటు రాష్ట్రపతి, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వాలు కూడా బిల్లు విషయంలో తదుపరి చర్యలను నిలిపి వేసేలా కోరాలని పేర్కొన్నారు. ఈ మేరకు గాలి ముద్దుకృష్ణమనాయుడు, పి.అశోక్ గజపతిరాజు, యరపతినేని శ్రీనివాసరావు, కేఈ ప్రభాకర్, కె.మీనాక్షి నాయుడు, కందుల నారాయణరెడ్డి, మల్లేల లింగారెడ్డి, కె.రామకృష్ణలు స్పీకర్‌కు రెండు లేఖలు రాశారు.
30 రోజుల గడువు కావాలి: బిల్లుపై చర్చించడానికి మరో 30 రోజుల గడువు కావాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని పట్టుబట్టింది. శుక్రవారం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు ముద్దుకృష్ణమనాయుడుతోపాటు మరికొందరు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సభలో మాట్లాడేందుకు కొంత మందికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా సమయం ఇస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మంత్రులకు, టీడీపీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడే వారికి ఎక్కువ సమయం ఇస్తున్నారని, అందులో భాగంగానే మంత్రి సునీతా లకా్ష్మరెడ్డికి ఎక్కువ సమయం కేటాయించారని అన్నారు. ఈ నేపథ్యంలో కొంత సేపు సభను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. చివరకు మంత్రి మాణిక్యవరప్రసాద్, చీప్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తదితరుల జోక్యంతో శాంతించారు.
సమైక్య తీర్మానానికి టీడీపీ నోటీసులు!
Published Sat, Jan 25 2014 2:56 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement