సభలో ‘ఫీజు’ సమరం! | Congress, TDP, CPM movement in assembly | Sakshi
Sakshi News home page

సభలో ‘ఫీజు’ సమరం!

Published Thu, Jan 5 2017 2:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

బుధవారం అసెంబ్లీలో భైఠాయించిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు - Sakshi

బుధవారం అసెంబ్లీలో భైఠాయించిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు

అసెంబ్లీలోనే బైఠాయించిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం
రీయింబర్స్‌మెంట్‌పై సీఎం సమాధానం సరిగా లేదంటూ నిరసన
• బకాయిలు విడుదల చేసేదాకా కదలబోమంటూ ఆందోళన
బలవంతంగా పార్టీ కార్యాలయాలకు తరలించిన పోలీసులు
విద్యార్థులను అవమానిస్తున్న టీఆర్‌ఎస్‌: ఉత్తమ్‌
కేసీఆర్‌ అన్నీ అబద్ధాలు చెబుతున్నారని మండిపాటు
సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్లు వెల్లడి
నేడు విద్యాసంస్థల బంద్‌కు ఎన్‌ఎస్‌యూఐ పిలుపు


సాక్షి, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బుధవారం శాసనసభ దద్దరిల్లింది. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందంటూ విపక్షాలు సభను స్తంభింపజేశాయి. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ సమాధానం అస్పష్టం గా ఉందని మండిపడ్డాయి. ఫీజు బకాయిలు ఎన్ని ఉన్నాయో, వాటిని ఎప్పటిలోగా చెల్లిస్తా రో అడిగే అవకాశమివ్వకుండా సభను వాయి దా వేశారంటూ నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సహా టీడీపీ, ఎంఐఎం, బీజేపీ, సీపీఎం సభ్యులంతా సభలోనే బైఠాయించా రు. దీంతో అసెంబ్లీ మార్షల్స్‌ విపక్షాల సభ్యు లను బలవంతంగా బయటకు తీసుకురాగా.. పోలీసులు ఆయా పార్టీ కార్యాలయాలకు తరలించారు. మరోవైపు అధికార పక్షం  తీరును నిరసిస్తూ.. ఎన్‌ఎస్‌యూఐ గురువారం రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది.

సభ వాయిదాపై ఆగ్రహం..
బుధవారం శాసనసభలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తొలుత పలువురు అధికార, విపక్షాల సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్‌ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్‌ సమాధానం అస్పష్టంగా ఉందని, వివరణ కోరే అవకాశం లేకుండానే సభను వాయిదా వేయడం సరికాదని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేశాయి. ఫీజు బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే దాకా సభలోనే ఉంటామంటూ కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, బీజేపీ, సీపీఎం సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద బైఠాయించారు. సుమా రు అరగంట తర్వాత ఎంఐఎం, బీజేపీ సభ్యు లు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోయారు.

కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం సభ్యులు మాత్రం చీకటి పడేదాకా సభలోనే ఉన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకా యిల చెల్లింపుపై ప్రభుత్వ తీరు దారుణ మని నినాదాలు చేశారు. అసెంబ్లీ మార్షల్స్, పోలీసు లు చీకటిపడుతున్న సమయంలో విçపక్ష సభ్యులను బలవంతంగా బయటకి తీసుకొ చ్చారు. అనంతరం ఆయా పార్టీల కార్యాల యాలకు తరలించారు. సభలో బైఠాయించిన వారిలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత కె.జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, పద్మావతీరెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్‌.కృష్ణయ్య, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య ఉన్నారు.


విద్యార్థులను అవమానిస్తున్న టీఆర్‌ఎస్‌ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకుండా, అసెంబ్లీలో అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ నుంచి పోలీసు వాహనాల్లో తరలించిన అనంతరం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీజు బకాయిలు మొత్తం చెల్లిస్తామంటూ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. శాసనసభలో చర్చ సందర్భంగా బుధవారం అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్‌ వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ఫీజు బకాయిలు ఎన్ని? వాటిని ఎప్పుడు చెల్లిస్తారో చెప్పకుండా కేసీఆర్‌ విద్యార్థులను చులకన చేసేవిధంగా మాట్లాడారని మండిపడ్డారు.

ఫీజులు చెల్లించకపోవడానికి నోట్ల రద్దు పరిణామాలే కారణమంటున్న కేసీఆర్‌.. అంతకుముందు నోట్ల రద్దుతో లాభం జరుగుతుందన్నారని ఉత్తమ్‌ గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫీజుల నిధులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ దిగిపోయే నాటికి 1,100 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 4,400 కోట్లకు పెరిగాయని విమర్శించారు.

కేసీఆర్‌ అబద్ధాల కోరు: ఉత్తమ్‌
తెలంగాణ ఉద్యమం సందర్భంగా నారాయణ, చైతన్య కాలేజీలను విమర్శించిన కేసీఆర్‌కు.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిపై ప్రేమ ఎందుకు పుట్టిందని ఉత్తమ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు, పరస్పర విరుద్ధ మాటలతో శాసనసభను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ముఖ్యమంత్రి సమాధానంపై వివరణలను అడగడానికి, నిరసనను చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా సభను అర్ధంతరంగా వాయిదా వేశారని... ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచేవిధంగా వ్యవహరించారని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా సభను నడపాల్సిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లే ప్రతిపక్షాలను అవమానిస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని చెప్పారు. ఫీజులను చెల్లించేదాకా పోరాడుతామని ప్రకటించారు.

నేడు విద్యా సంస్థల బంద్‌
విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుం డా, అసెంబ్లీలో సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నం దుకు నిరసనగా ఈ నెల 5న (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు కాం గ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌ యూఐ పిలుపు ఇచ్చింది. విద్యార్థులకు ఫీజుల బకాయిలను చెల్లించకుండా, దీనిపై ప్రశ్నించిన ప్రతిపక్షాలను ప్రభుత్వం అవమానించిందని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బి.వెంకట్‌ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement