సాక్షి, అమరావతి: వచ్చే నెలలో జరగనున్న శాసనసభ శీతాకాల సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక వైఖరి వల్ల రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఇతర అన్ని వర్గాలు ఇక్కట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాను చేపట్టనున్న పాదయాత్రపై చర్చించేందుకు సోమవారం అందుబాటులో ఉన్న సీనియర్ నాయకులతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ ముఖ్యనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పీడిక రాజన్న దొర, షేక్ అంజాద్ బాషా, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.
ప్రలోభపెట్టి ఫిరాయింపులు: జగన్ పాదయాత్రతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఇతర పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాలపై చర్చ సందర్భంగా వీటికి హాజరుకాకుండా బహిష్కరించాలన్న అభిప్రాయం నేతల నుంచి వ్యక్తమైనట్లు తెలిసింది. ఈచర్చలో సభ్యులు పలు అంశాలు ప్రస్తావించారు. వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి రాజ్యాంగ విలువలను కాలరాస్తూ టీడీపీలోకి చేర్చుకున్నారని నేతలు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం ఉంటే ఫిరాయింపుదారులతో రాజీనామాలు చేయించాలని వైఎస్సార్ సీపీ పలుమార్లు సవాల్ విసిరినా అధికార టీడీపీ కిమ్మనలేదని గుర్తు చేశారు. ఒకపార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీవైపు కూర్చునేలా వారికి ఏర్పాట్లు చేయించారన్నారు.
26న చర్చించాక తుది నిర్ణయం: పెద్దిరెడ్డి
అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటానికి సంబంధించి ఈనెల 26న పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నట్లు వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష డిప్యూటీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ నేతలు, కార్యకర్తలంతా అన్ని వర్గాలకు అండగా సమాంతరంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో వైఎస్ జగన్ సూచించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment