స్వామి కార్యం.. స్వకార్యం.. ! | Kiran kumar reddy follows congress high command gameplan | Sakshi
Sakshi News home page

స్వామి కార్యం.. స్వకార్యం.. !

Published Fri, Jan 31 2014 1:32 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

స్వామి కార్యం.. స్వకార్యం.. ! - Sakshi

స్వామి కార్యం.. స్వకార్యం.. !

విభజన బిల్లుపై హైకమాండ్ వ్యూహం అమలు చేసిన సీఎం కిరణ్
 * సమైక్య తీర్మానం చేయకుండా.. బిల్లుపై కానీ, సవరణలపై కానీ ఓటింగే లేకుండా..  విభజన బిల్లును గండం గట్టెక్కించిన సీఎం
* బిల్లుపై చర్చను ముందే పూర్తిచేయించి.. శాసనసభను వాయిదా వేయటానికి ముందుగా.. చిట్టచివర్లో తిరస్కరణ పేరుతో తీర్మానం
* కనీసం విభజన బిల్లుపై చర్చకన్నా ముందే ఓటింగ్ పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ కోరినా.. సహకరించని సీఎం, అధికార కాంగ్రెస్
* సమైక్య తీర్మానం, ఓటింగ్‌ల వల్ల బిల్లుకు ఇబ్బందులు వస్తాయనే పట్టించుకోని సీఎం.. విభజనపై హైకమాండ్‌కు పూర్తి సహకారం
* సీడబ్ల్యూసీ భేటీ నుంచి.. అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని తిప్పి పంపేవరకూ కాంగ్రెస్ అధిష్టానం ‘రోడ్ మ్యాప్’ను అమలుచేసిన కిరణ్
* చర్చకు మరింత గడువు కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసినా.. అక్కడి నుంచి సమాచారం రాకముందే హడావుడిగా చర్చకు ముగింపు
 
 సాక్షి, హైదరాబాద్:  విభజన బిల్లు శాసనసభకు రాకముందే సభలో సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే.. రేపటి రోజున పార్లమెంటులో బిల్లుకు ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించి.. అలాంటి తీర్మానం రాకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తొలి నుంచీ జాగ్రత్తగా వ్యవహరించారు. విభజన బిల్లు చర్చ జరపడానికంటే ముందే సమైక్య తీర్మానం చేసినా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని, ఓటింగ్‌లో దాన్ని ఓడిస్తామని చెప్తూవచ్చారు. సీఎం చెప్తున్న ఆ మాటలనే సీమాంధ్ర నేతలు నమ్ముతూ వచ్చారు. తీరా బిల్లుపై తాను మాట్లాడదలుచుకున్నదంతా మాట్లాడి.. ఆ తర్వాత తీరికగా దాన్ని తిరస్కరించా లంటూ నోటీసు ఇవ్వటం ద్వారా.. బిల్లుపై ఓటింగ్ జరక్కుండా పకడ్బందీగా వ్యవహరించారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
 
 చర్చ పూర్చిచేసి.. తిరస్కరణ తీర్మానం..!
 బిల్లు అసమగ్రంగా ఉందని, దాన్ని తిరస్కరిస్తున్నామని సీఎం తీర్మానం ప్రవేశపెట్టదల్చుకుంటే.. ఆ అంశాన్ని బిల్లుపై చర్చలో పాల్గొనకముందే చెప్పి దానిపై నోటీసు ఇవ్వాల్సి ఉండగా అలా చేయలేదు. పైగా.. బిల్లుపై తన అభిప్రాయాన్ని శాసనసభలో మూడు రోజుల పాటు మూడు దఫాలుగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. చివరి రోజు సభ వాయిదా పడిన తర్వాత నోటీసు ఇచ్చారు. ముందే నోటీసు ఇస్తే సభలో మిగిలిన వారంతా దానిపైనే పట్టుపట్టే అవకాశాలు ఉంటాయని.. దానివల్ల బిల్లుపై తదనంతర ప్రక్రియ పూర్తికాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుందని తెలిసే.. అలా జరగకుండా ఉండేందుకు సీఎం ముందస్తుగా నోటీసు ఇవ్వలేదని జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
 
 బిల్లు అసమగ్రంగా ఉందని చెప్పిన సీఎం దాన్ని పరిశీలించటానికి ఇంతకాలం సమయం దొరకలేదని.. తాను నోటీసు ఇచ్చిన మూడు రోజుల తర్వాత మీడియాతో చెప్పడాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. శాసనసభలో ఒకవైపు, మండలిలో మరోవైపు ప్రతి రోజూ విభజన బిల్లుపై చర్చ, నిరసనలు, ఆందోళనలు సాగుతుంటే.. తనకు బిల్లును పరిశీలించటానికే సమయం దొరకలేదని పేర్కొనడాన్ని బట్టి సీఎం ఆంతర్యమేంటో తేలిపోతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
 
  విభజన బిల్లుపై చర్చ పూర్తయిందని, అభిప్రాయాలన్నింటినీ రాష్ట్రపతికి పంపిస్తున్నామని శాసనసభలో స్పీకర్ ప్రకటించటం పూర్తి చేసిన తర్వాత.. అంటే బిల్లుకు సంబంధించిన చర్చ, అభిప్రాయాల ఘట్టం ముగిసిన తర్వాత.. సీఎం ఇచ్చిన తిరస్కరణ నోటీసును చేపట్టారు. చర్చ పూర్తయిన తర్వాత తీర్మానం చేపట్టటమంటే రెండూ వేరువేరు అంశాలుగానే పరిగణిస్తారని రాజ్యాంగ నిపుణులు తేల్చిచెప్తున్నారు.
  ఇదే విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ గురువారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. పైగా గతంలో రాష్ట్రాల విభజన జరిగిన చోట కూడా అసెంబ్లీలు ఇలాంటి తీర్మానం చేయగా.. వాటిని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం ముఖ్యమంత్రికి బాగా తెలుసునని ఆ పార్టీ నేతలే అంటున్నారు.
 
 అడ్డుపడుతుందనే సమైక్య తీర్మానం వద్దన్న వైనం
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లు అసెంబ్లీలో బిల్లు రావటానికి ముందుగానే సమైక్య తీర్మానం చేసి ఉంటే.. అసలు బిల్లుపై చర్చకు అవకాశముండేదే కాదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కనీసం బిల్లు వచ్చాక చర్చ ప్రారంభమయ్యే సమయంలోనైనా.. ముందుగా బిల్లుపై ఓటింగ్‌ను నిర్వహించి ఆ తరువాత చర్చిద్దామని వైఎస్సార్ సీపీ ప్రతిపాదించినా అధికార పార్టీ నేతలు సహకరించలేదు. అలా ముందే బిల్లుపై ఓటింగ్ జరిగి ఉంటే మెజారిటీ సభ్యులు వ్యతిరేకించటం ద్వారా కేంద్రం ఈ బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు వెనకడుగు వేసే ఆస్కారముండేది. ఈ రెండింటికీ అవకాశం ఉండకుండా చివరి వరకూ నాన్చిన సీఎం కిరణ్.. తిరస్కరణ తీర్మానం నోటీసుతో బిల్లుపై అసలు ఓటింగే జరగకుండా విజయవంతంగా అడ్డుకున్నారని సమైక్యవాదుల్లో బలంగా వినిపించింది.
 
 గడువుకోరి.. సభను ముగించారు
 అసెంబ్లీలో చర్చలో 86 మందే పాల్గొన్నారని, అందరికీ అవకాశం దక్కేందుకు మూడు వారాల అదనపు గడువు ఇవ్వాలని కోరుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రాష్ట్రపతికి లేఖ రాశారు. సీమాంధ్ర మంత్రులతోనూ లేఖలు రాయించారు. అంతకుముందు ఆయన ఒక్కరే లేఖ రాయగా అసెంబ్లీ చివరి రోజున అంటే 23వ తేదీన చివరి నిమిషంలో వారం పాటు గడువు పొడిగిస్తూ రాష్ట్రపతి నుంచి లేఖ వచ్చింది. మరింత గడువుకోసం తాజాగా లేఖ రాసిన సీఎం.. రాష్ట్రపతి నుంచి సమాచారం కోసం కూడా ఎదురుచూడలేదు. గడువు కోసం ఢిల్లీ పెద్దలతో, రాష్ట్రపతి కార్యాలయ వర్గాలతో కూడా సంప్రదింపులూ జరపలేదు. పైగా శాసనసభను గురువారం సాయంత్రం వరకు కొనసాగింపచేసే అవకాశమున్నా మధ్యాహ్నానికే ముగించే లా చూశారు. ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభమయ్యాక కొద్దిసేపటికే బిల్లుపై చర్చకు గడువు పొడిగింపు అంశంపై ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్‌లు ఢిల్లీ వర్గాలను ఆరాతీశారు. ఢిల్లీలో పరిణామాలు మారుతున్నాయన్న సంకేతాలు ఇక్కడి నేతలకు అందాయి. మధ్యాహ్నానికి గడువు పొడిగింపుపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉందని లగడపాటి అసెంబ్లీ లాబీల్లో మీడియాకు చెప్పారు.
 
 అయితే ఈలోగానే బిల్లుపై చర్చ ముగించి శాసనసభను నిరవధికంగా వాయిదా వేయించారు. సభ వాయిదా అనంతరం సీఎం తన చాంబర్ వైపు వస్తూ ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేశారని సీఎంఓ వర్గాలు లీకులు ఇచ్చాయి. అయితే ఇదే విషయాన్ని మంత్రుల వద్ద ప్రస్తావిస్తే ఆయనేమీ నినాదాలు చేయలేదని స్పష్టంచేశారు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోతున్న సమయంలో సీఎం కిరణ్ తనను పలకరించిన మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ‘‘ఇంకేముంది. అంతా అయిపోయిందిగా..!’’ అని వ్యాఖ్యానిస్తూ ముందుకు వెళ్లడం గమనార్హం.
 
 ‘రోడ్‌మ్యాప్’  పక్కాగా పూర్తి
 రాష్ట్ర విభజనకు సంబంధించి గత ఏడాది జూలై 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసేవరకు కాంగ్రెస్ అధిష్టానం జరిపిన ప్రతి కసరత్తులోనూ భాగస్వామిగా ఉన్న సీఎం కిరణ్.. అప్పటి నుంచీ తాజాగా బిల్లుపై అసెంబ్లీలో ‘చర్చను పూర్తిచేసి’ కేంద్రానికి తిప్పిపంపే వరకూ కాంగ్రెస్ రూపొందించిన ‘రోడ్ మ్యాప్’ను అమలు చేయటంలో కీలక పాత్ర పోషించారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు పార్టీ కోర్ కమిటీ భేటీలో విభజనకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను అధిష్టానం కిరణ్‌కుమార్‌రెడ్డికి  అందించింది.
 
     సీడబ్ల్యూసీ తీర్మానం తరువాత సీమాంధ్రలో సమైక్య ఉద్యమం పార్టీలకతీతంగా ఒక్కుదుటన పైకి లేచింది. ఊరూవాడా ఏకమై 2 నెలల పాటు ఉద్యమం ఉధృతంగా సాగింది. ఏపీఎన్‌జీఓలు రెండు నెలలకు పైగా సమ్మెను కొనసాగించారు. సమ్మె కారణంగా కోట్లాది రూపాయల వేతనాలు కూడా వదులుకున్నారు. ఉద్యోగుల సమ్మెను సీఎం అర్థంతరంగా ముగింపచేశారు.
     ఈ ఉద్యమ వేడిని చూసి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయటానికి సిద్ధపడగా తొంద రపాటు వద్దంటూ సీఎం వారిని వారించారు. శాసనసభ తీర్మానం లేకుండా అసలు బిల్లు తయారే కాదంటూ కొన్నాళ్లు.. బిల్లు రూపొందించినా కేంద్రం ఒక్క అడుగూ ముందుకు వేయలేదంటూ మరికొన్ని రోజులు నెట్టుకొచ్చారు. అసెంబ్లీలో తీర్మానం చేయాల్సివచ్చినప్పుడు.. తీర్మానం అవసరం లేదు, బిల్లును ఓడిద్దామని మరి కొంత కాలం చెప్పుకొచ్చారు.     చివరకు కేంద్ర కేబినెట్ విభజన నిర్ణయాన్ని ఆమోదించడం.. మంత్రుల కమిటీ ముసాయిదా బిల్లును రూపొందించడం, కేంద్రం దాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపటం జరిగిపోయాక కూడా సీఎం ‘ఏమీ కాద’ంటూ ఎమ్మెల్యేల ఆవేశంపై నీళ్లు చల్లారు. విభజన నిర్ణయానికి నిరసనగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా వాటిని ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకొని ఇతర నేతలు రాజీనామాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
     చివరకు అసెంబ్లీలో తీర్మానం ఉండదని, బిల్లుపై చర్చ మాత్రమే ఉంటుందని ఢిల్లీ పెద్దలు పదే పదే ప్రక టించాక కూడా.. బిల్లుపై ఓటింగ్ ఉంటుందని, దాన్ని ఓడించడం ద్వారా విభజనను అడ్డుకుందామని సీఎం కొత్త పాట మొదలుపెట్టారు. ఇలా అన్ని దశల్లోనూ సీఎం అధిష్టానం చర్యలకు పార్టీ రాష్ట్ర నేతల నుంచి, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యవహరించారు.
     చివరకు అసెంబ్లీ సమావేశాల తేదీలను కూడా విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగానే కేబినెట్ భేటీలో నిర్ణయించారు. పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఏ రోజున రాష్ట్ర అసెంబ్లీకి వస్తుందో చూసుకొని అప్పటి నుంచే శాసనసభ సమావేశాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. బిల్లు రాష్ట్రానికి వచ్చిన తరువాత అసెంబ్లీకి సమర్పించడం, సభలో చర్చను చేపట్టించడంతో సహా అన్నీ సాఫీగా ముందుకు తీసుకువెళ్లేలా చేశారు.
     బిల్లుపై ఓటింగ్ ఉంటుందని, బిల్లుకు సవరణలు ప్రతిపాదించడం, వాటిపై కూడా చర్చ, ఓటింగ్ ఉంటుందని చెప్తూ.. చర్చలో అందరి అభిప్రాయాలకు వీలుకల్పించారు. ఇలా బిల్లుపై చర్చను ముందుకు సాగించి అందరి నుంచి వ్యతిరేకాభిప్రాయాలు వస్తున్న తరుణంలో మూడుసార్లు తానుకూడా చర్చలో పాల్గొన్నారు. సభ ఇంకా నాలుగు రోజుల పాటు కొనసాగి అందరి అభిప్రాయాలు ఉంటాయని, మెజారిటీ సభ్యుల వ్యతిరేకాభిప్రాయం.. వాటిపై ఓటింగ్‌తో విభజన బిల్లును ఓడించి రాష్ట్రపతికి పంపించడానికి వీలుంటుందని సీమాంధ్ర నేతలు భావించారు.
     కానీ.. అందుకు అవకాశం లేకుండా సీఎం స్వయంగా తిరస్కరణ తీర్మానానికి నోటీసు ఇచ్చారు. దీంతో చివరి నాలుగు రోజులు సభలో గందరగోళం తలెత్తి సభ్యులు అభిప్రాయాలు చెప్పటానికి అవకాశం లేకుండాపోయింది. ఇదంతా సీఎం, డిల్లీ పెద్దలు ముందు నుంచీ రూపొందించిన ‘రోడ్ మ్యాప్’ ప్రకారమే సాగిందన ్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement