parliament bill
-
‘చిరు’ భరోసా..!
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘చిరు వ్యాపారుల’ బిల్లుతో జిల్లాలో సుమారు 8వేలమందికి పైగా మేలు చేకూరనుంది. వారి హక్కులకు రక్షణ లభించనుంది. కొత్త పథకాలు అందుబాటులోకి వచ్చి బతుకుకు భరోసా లభించనుంది. ఈ దిశగా జిల్లాలో చర్యలు ప్రారంభం కావడంతో ఫలితాలకోసం ఆ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. పాలమూరు, న్యూస్‌లైన్ : పట్టణాలు, మున్సిపాలిటీ వీధుల్లో పొద్దంతా తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తూ, కుటుంబాలను పోషించుకునే చిరు వ్యాపారులకు బాసటగా నిలిచే ప్రత్యేక బిల్లుకు పార్లమెంటు అమోదించడంతో జిల్లాలో ఉన్న సుమారు 8వేలమందికి పైగా ఉన్న వారు లబ్దిపొందనున్నారు . పట్టణంలో ఎక్కడ బండి పెట్టినా స్థానిక పోలీసులు, పురపాలక సంఘ అధికారులు,సమీపంలోని భవన యజమానులతో వారికి ఇబ్బందులు ఉండేవి. వీరందరినీ నిత్యం అభద్రతాభావం వెంటాడుతోంది. వీరిలో చాలా వరకు పండ్లు అమ్ముకునే బండ్లు, కూరగాయలు, ఇడ్లీ, ఫాస్ట్‌ఫుడ్, ఇతరాలు, ఆయా సామాగ్రిని తోపుడు బళ్లతో విక్రయిస్తుంటారు. వీరంతా పురపాలక సంస్థలకు నిర్ణీత రుసుము రోజువారీ లెక్కన చెల్లిస్తున్నా వారికి సరైన రక్షణ లేదు. ఎప్పుడైనా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైనప్పుడు పోలీసుల ప్రతాపానికి చిరు వ్యాపారులు అవస్థ పడేవారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి వీధి వ్యాపారులకు సౌకర్యాలు కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరికోసం ఉద్దేశించిన బిల్లు కారణంగా దశాబ్దాల కాలంగా ఒకే ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు యంత్రాంగం చర్యలు చే పట్టింది. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూలన విభాగం చర్యలు ప్రారంభించింది. మహబూబ్‌నగర్‌తోపాటు నారాయణపేట, గద్వాల, వనపర్తి, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, జడ్చర్ల, కొల్లాపూర్, అచ్చంపేట, అయిజ మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల్లోని వీధి వ్యాపారుల వివరాలను సేకరించి.. వారి వ్యాపారాలకు భరోసా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్హులను గుర్తించి, వీరికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులతో చర్చించి అనుమతి పొందుతారు. స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం చేసి వీరి పురోగతి కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టనున్నారు. ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో .. పురపాలక సంస్థ పరిధిలో ఉన్న వీధి వ్యాపారులు రేషన్, వాటర్, ఆధార్ వంటి గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. దశాబ్దాల కాలానికి మించి ఒకే చోట వ్యాపారం చేస్తున్న వారిని స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేస్తారు. వారికి బీమా సౌకర్యం కల్పిస్తారు. లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో 10 మంది, 1.50 లక్షలలోపు జనాభా ఉన్న చోట 15 మంది, మూడు లక్షలు జనాభా ఉంటే 20 మందితో ప్రత్యేక కమిటీలు వేస్తారు. ఈ బందాలు వీధి వ్యాపారుల హక్కులు, వారి వ్యాపారానికి ఆధారం కల్పించడానికి కషి చేస్తాయి. మెప్మా పర్యవేక్షణలో.. మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను సిద్ధం చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే ఈ సర్వేను చేపట్టి వీధి వ్యాపారులను లెక్కించారు. వీరంతా ఎన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు. తదితర వివరాలను సేకరించారు. గతంతో పోలిస్తే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర వివరాలను సేకరించేందుకు ఆయా శాఖలు సిద్ధమవుతున్నాయి. కొత్త బిల్లు ప్రకారం..! పట్టణ వ్యాపార సంఘం నుంచి ప్రతీ వీధి వ్యాపారి ఒక ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఈ పత్రం ఉన్న వారిని తొలగించడానికి వీలుండదు. గుర్తించిన వారిని సమూహాలుగా ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమాలు వ్యక్తిగత సహాయక సమూహం (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) మాదిరిగా నిర్వహణ చేపడతారు. వీరికి ప్రభుత్వం తరఫున వివిధ పథకాలను వర్తింప చేస్తారు. ఇళ్ల నిర్మాణం, స్థలాల కేటాయింపు, రుణాలు, ఇతర సౌకర్యాల కల్పన తదితర చర్యలుంటాయి. వ్యాపారుల నేపథ్యాలను అనుసరించి సీఆర్పీల ద్వారా సర్వే చేయించి కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగానే వారికి రుణాలు మంజూరు చేస్తారు. -
స్వామి కార్యం.. స్వకార్యం.. !
విభజన బిల్లుపై హైకమాండ్ వ్యూహం అమలు చేసిన సీఎం కిరణ్ * సమైక్య తీర్మానం చేయకుండా.. బిల్లుపై కానీ, సవరణలపై కానీ ఓటింగే లేకుండా.. విభజన బిల్లును గండం గట్టెక్కించిన సీఎం * బిల్లుపై చర్చను ముందే పూర్తిచేయించి.. శాసనసభను వాయిదా వేయటానికి ముందుగా.. చిట్టచివర్లో తిరస్కరణ పేరుతో తీర్మానం * కనీసం విభజన బిల్లుపై చర్చకన్నా ముందే ఓటింగ్ పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ కోరినా.. సహకరించని సీఎం, అధికార కాంగ్రెస్ * సమైక్య తీర్మానం, ఓటింగ్‌ల వల్ల బిల్లుకు ఇబ్బందులు వస్తాయనే పట్టించుకోని సీఎం.. విభజనపై హైకమాండ్‌కు పూర్తి సహకారం * సీడబ్ల్యూసీ భేటీ నుంచి.. అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని తిప్పి పంపేవరకూ కాంగ్రెస్ అధిష్టానం ‘రోడ్ మ్యాప్’ను అమలుచేసిన కిరణ్ * చర్చకు మరింత గడువు కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసినా.. అక్కడి నుంచి సమాచారం రాకముందే హడావుడిగా చర్చకు ముగింపు సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లు శాసనసభకు రాకముందే సభలో సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే.. రేపటి రోజున పార్లమెంటులో బిల్లుకు ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించి.. అలాంటి తీర్మానం రాకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తొలి నుంచీ జాగ్రత్తగా వ్యవహరించారు. విభజన బిల్లు చర్చ జరపడానికంటే ముందే సమైక్య తీర్మానం చేసినా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని, ఓటింగ్‌లో దాన్ని ఓడిస్తామని చెప్తూవచ్చారు. సీఎం చెప్తున్న ఆ మాటలనే సీమాంధ్ర నేతలు నమ్ముతూ వచ్చారు. తీరా బిల్లుపై తాను మాట్లాడదలుచుకున్నదంతా మాట్లాడి.. ఆ తర్వాత తీరికగా దాన్ని తిరస్కరించా లంటూ నోటీసు ఇవ్వటం ద్వారా.. బిల్లుపై ఓటింగ్ జరక్కుండా పకడ్బందీగా వ్యవహరించారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చర్చ పూర్చిచేసి.. తిరస్కరణ తీర్మానం..! బిల్లు అసమగ్రంగా ఉందని, దాన్ని తిరస్కరిస్తున్నామని సీఎం తీర్మానం ప్రవేశపెట్టదల్చుకుంటే.. ఆ అంశాన్ని బిల్లుపై చర్చలో పాల్గొనకముందే చెప్పి దానిపై నోటీసు ఇవ్వాల్సి ఉండగా అలా చేయలేదు. పైగా.. బిల్లుపై తన అభిప్రాయాన్ని శాసనసభలో మూడు రోజుల పాటు మూడు దఫాలుగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. చివరి రోజు సభ వాయిదా పడిన తర్వాత నోటీసు ఇచ్చారు. ముందే నోటీసు ఇస్తే సభలో మిగిలిన వారంతా దానిపైనే పట్టుపట్టే అవకాశాలు ఉంటాయని.. దానివల్ల బిల్లుపై తదనంతర ప్రక్రియ పూర్తికాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుందని తెలిసే.. అలా జరగకుండా ఉండేందుకు సీఎం ముందస్తుగా నోటీసు ఇవ్వలేదని జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బిల్లు అసమగ్రంగా ఉందని చెప్పిన సీఎం దాన్ని పరిశీలించటానికి ఇంతకాలం సమయం దొరకలేదని.. తాను నోటీసు ఇచ్చిన మూడు రోజుల తర్వాత మీడియాతో చెప్పడాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. శాసనసభలో ఒకవైపు, మండలిలో మరోవైపు ప్రతి రోజూ విభజన బిల్లుపై చర్చ, నిరసనలు, ఆందోళనలు సాగుతుంటే.. తనకు బిల్లును పరిశీలించటానికే సమయం దొరకలేదని పేర్కొనడాన్ని బట్టి సీఎం ఆంతర్యమేంటో తేలిపోతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. విభజన బిల్లుపై చర్చ పూర్తయిందని, అభిప్రాయాలన్నింటినీ రాష్ట్రపతికి పంపిస్తున్నామని శాసనసభలో స్పీకర్ ప్రకటించటం పూర్తి చేసిన తర్వాత.. అంటే బిల్లుకు సంబంధించిన చర్చ, అభిప్రాయాల ఘట్టం ముగిసిన తర్వాత.. సీఎం ఇచ్చిన తిరస్కరణ నోటీసును చేపట్టారు. చర్చ పూర్తయిన తర్వాత తీర్మానం చేపట్టటమంటే రెండూ వేరువేరు అంశాలుగానే పరిగణిస్తారని రాజ్యాంగ నిపుణులు తేల్చిచెప్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ గురువారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. పైగా గతంలో రాష్ట్రాల విభజన జరిగిన చోట కూడా అసెంబ్లీలు ఇలాంటి తీర్మానం చేయగా.. వాటిని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం ముఖ్యమంత్రికి బాగా తెలుసునని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అడ్డుపడుతుందనే సమైక్య తీర్మానం వద్దన్న వైనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లు అసెంబ్లీలో బిల్లు రావటానికి ముందుగానే సమైక్య తీర్మానం చేసి ఉంటే.. అసలు బిల్లుపై చర్చకు అవకాశముండేదే కాదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కనీసం బిల్లు వచ్చాక చర్చ ప్రారంభమయ్యే సమయంలోనైనా.. ముందుగా బిల్లుపై ఓటింగ్‌ను నిర్వహించి ఆ తరువాత చర్చిద్దామని వైఎస్సార్ సీపీ ప్రతిపాదించినా అధికార పార్టీ నేతలు సహకరించలేదు. అలా ముందే బిల్లుపై ఓటింగ్ జరిగి ఉంటే మెజారిటీ సభ్యులు వ్యతిరేకించటం ద్వారా కేంద్రం ఈ బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు వెనకడుగు వేసే ఆస్కారముండేది. ఈ రెండింటికీ అవకాశం ఉండకుండా చివరి వరకూ నాన్చిన సీఎం కిరణ్.. తిరస్కరణ తీర్మానం నోటీసుతో బిల్లుపై అసలు ఓటింగే జరగకుండా విజయవంతంగా అడ్డుకున్నారని సమైక్యవాదుల్లో బలంగా వినిపించింది. గడువుకోరి.. సభను ముగించారు అసెంబ్లీలో చర్చలో 86 మందే పాల్గొన్నారని, అందరికీ అవకాశం దక్కేందుకు మూడు వారాల అదనపు గడువు ఇవ్వాలని కోరుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రాష్ట్రపతికి లేఖ రాశారు. సీమాంధ్ర మంత్రులతోనూ లేఖలు రాయించారు. అంతకుముందు ఆయన ఒక్కరే లేఖ రాయగా అసెంబ్లీ చివరి రోజున అంటే 23వ తేదీన చివరి నిమిషంలో వారం పాటు గడువు పొడిగిస్తూ రాష్ట్రపతి నుంచి లేఖ వచ్చింది. మరింత గడువుకోసం తాజాగా లేఖ రాసిన సీఎం.. రాష్ట్రపతి నుంచి సమాచారం కోసం కూడా ఎదురుచూడలేదు. గడువు కోసం ఢిల్లీ పెద్దలతో, రాష్ట్రపతి కార్యాలయ వర్గాలతో కూడా సంప్రదింపులూ జరపలేదు. పైగా శాసనసభను గురువారం సాయంత్రం వరకు కొనసాగింపచేసే అవకాశమున్నా మధ్యాహ్నానికే ముగించే లా చూశారు. ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభమయ్యాక కొద్దిసేపటికే బిల్లుపై చర్చకు గడువు పొడిగింపు అంశంపై ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్లు ఢిల్లీ వర్గాలను ఆరాతీశారు. ఢిల్లీలో పరిణామాలు మారుతున్నాయన్న సంకేతాలు ఇక్కడి నేతలకు అందాయి. మధ్యాహ్నానికి గడువు పొడిగింపుపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉందని లగడపాటి అసెంబ్లీ లాబీల్లో మీడియాకు చెప్పారు. అయితే ఈలోగానే బిల్లుపై చర్చ ముగించి శాసనసభను నిరవధికంగా వాయిదా వేయించారు. సభ వాయిదా అనంతరం సీఎం తన చాంబర్ వైపు వస్తూ ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేశారని సీఎంఓ వర్గాలు లీకులు ఇచ్చాయి. అయితే ఇదే విషయాన్ని మంత్రుల వద్ద ప్రస్తావిస్తే ఆయనేమీ నినాదాలు చేయలేదని స్పష్టంచేశారు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోతున్న సమయంలో సీఎం కిరణ్ తనను పలకరించిన మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ‘‘ఇంకేముంది. అంతా అయిపోయిందిగా..!’’ అని వ్యాఖ్యానిస్తూ ముందుకు వెళ్లడం గమనార్హం. ‘రోడ్‌మ్యాప్’ పక్కాగా పూర్తి రాష్ట్ర విభజనకు సంబంధించి గత ఏడాది జూలై 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసేవరకు కాంగ్రెస్ అధిష్టానం జరిపిన ప్రతి కసరత్తులోనూ భాగస్వామిగా ఉన్న సీఎం కిరణ్.. అప్పటి నుంచీ తాజాగా బిల్లుపై అసెంబ్లీలో ‘చర్చను పూర్తిచేసి’ కేంద్రానికి తిప్పిపంపే వరకూ కాంగ్రెస్ రూపొందించిన ‘రోడ్ మ్యాప్’ను అమలు చేయటంలో కీలక పాత్ర పోషించారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు పార్టీ కోర్ కమిటీ భేటీలో విభజనకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను అధిష్టానం కిరణ్‌కుమార్‌రెడ్డికి అందించింది. సీడబ్ల్యూసీ తీర్మానం తరువాత సీమాంధ్రలో సమైక్య ఉద్యమం పార్టీలకతీతంగా ఒక్కుదుటన పైకి లేచింది. ఊరూవాడా ఏకమై 2 నెలల పాటు ఉద్యమం ఉధృతంగా సాగింది. ఏపీఎన్జీఓలు రెండు నెలలకు పైగా సమ్మెను కొనసాగించారు. సమ్మె కారణంగా కోట్లాది రూపాయల వేతనాలు కూడా వదులుకున్నారు. ఉద్యోగుల సమ్మెను సీఎం అర్థంతరంగా ముగింపచేశారు. ఈ ఉద్యమ వేడిని చూసి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయటానికి సిద్ధపడగా తొంద రపాటు వద్దంటూ సీఎం వారిని వారించారు. శాసనసభ తీర్మానం లేకుండా అసలు బిల్లు తయారే కాదంటూ కొన్నాళ్లు.. బిల్లు రూపొందించినా కేంద్రం ఒక్క అడుగూ ముందుకు వేయలేదంటూ మరికొన్ని రోజులు నెట్టుకొచ్చారు. అసెంబ్లీలో తీర్మానం చేయాల్సివచ్చినప్పుడు.. తీర్మానం అవసరం లేదు, బిల్లును ఓడిద్దామని మరి కొంత కాలం చెప్పుకొచ్చారు. చివరకు కేంద్ర కేబినెట్ విభజన నిర్ణయాన్ని ఆమోదించడం.. మంత్రుల కమిటీ ముసాయిదా బిల్లును రూపొందించడం, కేంద్రం దాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపటం జరిగిపోయాక కూడా సీఎం ‘ఏమీ కాద’ంటూ ఎమ్మెల్యేల ఆవేశంపై నీళ్లు చల్లారు. విభజన నిర్ణయానికి నిరసనగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా వాటిని ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకొని ఇతర నేతలు రాజీనామాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరకు అసెంబ్లీలో తీర్మానం ఉండదని, బిల్లుపై చర్చ మాత్రమే ఉంటుందని ఢిల్లీ పెద్దలు పదే పదే ప్రక టించాక కూడా.. బిల్లుపై ఓటింగ్ ఉంటుందని, దాన్ని ఓడించడం ద్వారా విభజనను అడ్డుకుందామని సీఎం కొత్త పాట మొదలుపెట్టారు. ఇలా అన్ని దశల్లోనూ సీఎం అధిష్టానం చర్యలకు పార్టీ రాష్ట్ర నేతల నుంచి, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యవహరించారు. చివరకు అసెంబ్లీ సమావేశాల తేదీలను కూడా విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగానే కేబినెట్ భేటీలో నిర్ణయించారు. పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏ రోజున రాష్ట్ర అసెంబ్లీకి వస్తుందో చూసుకొని అప్పటి నుంచే శాసనసభ సమావేశాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. బిల్లు రాష్ట్రానికి వచ్చిన తరువాత అసెంబ్లీకి సమర్పించడం, సభలో చర్చను చేపట్టించడంతో సహా అన్నీ సాఫీగా ముందుకు తీసుకువెళ్లేలా చేశారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందని, బిల్లుకు సవరణలు ప్రతిపాదించడం, వాటిపై కూడా చర్చ, ఓటింగ్ ఉంటుందని చెప్తూ.. చర్చలో అందరి అభిప్రాయాలకు వీలుకల్పించారు. ఇలా బిల్లుపై చర్చను ముందుకు సాగించి అందరి నుంచి వ్యతిరేకాభిప్రాయాలు వస్తున్న తరుణంలో మూడుసార్లు తానుకూడా చర్చలో పాల్గొన్నారు. సభ ఇంకా నాలుగు రోజుల పాటు కొనసాగి అందరి అభిప్రాయాలు ఉంటాయని, మెజారిటీ సభ్యుల వ్యతిరేకాభిప్రాయం.. వాటిపై ఓటింగ్‌తో విభజన బిల్లును ఓడించి రాష్ట్రపతికి పంపించడానికి వీలుంటుందని సీమాంధ్ర నేతలు భావించారు. కానీ.. అందుకు అవకాశం లేకుండా సీఎం స్వయంగా తిరస్కరణ తీర్మానానికి నోటీసు ఇచ్చారు. దీంతో చివరి నాలుగు రోజులు సభలో గందరగోళం తలెత్తి సభ్యులు అభిప్రాయాలు చెప్పటానికి అవకాశం లేకుండాపోయింది. ఇదంతా సీఎం, డిల్లీ పెద్దలు ముందు నుంచీ రూపొందించిన ‘రోడ్ మ్యాప్’ ప్రకారమే సాగిందన ్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. -
విభజనను అడ్డుకుంటాం: టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ ఆమోదించిన విభజన బిల్లును అడ్డుకోవడానికి పార్లమెంటులో సోమవారం నుంచి పోరాటాన్ని కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు చెప్పారు. టీడీపీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కె.నారాయణరావు, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, సీఎం రమేష్ శుక్రవారం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. సెంటిమెంటులేని ఇటలీ సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని దుయ్యబట్టారు. -
మెరుపు సమ్మెకు రెడీ
కాకినాడసిటీ, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే, మరుక్షణం మెరుపు సమ్మెకు దిగేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులే కాకుండా సకలజనులు సమ్మెబాట పట్టేలా కార్యాచరణ రూపొందించాలని సంఘాల నేతలు భావిస్తున్నారు. అన్ని సెక్టార్లలో దశలవారీగా పాలనా కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చేపట్టే ఈ రెండో దఫా నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం నుంచి ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు ప్రారంభిస్తున్నారు. ఏడో తేదీన గుంటూరులో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ, ప్రత్యక్ష పోరాట స్వరూపం నిర్ణయించనున్నారు. ఉద్యమ కార్యచరణపై సమైక్యరాష్ర్ట పరిరక్షణ వేదిక జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరం వద్ద సమైక్యవాదుల సమావేశం జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో సమైక్యవాదులందరూ భావితరాల శ్రేయస్సు కోసం మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ పిలుపునిచ్చింది. పాలకుల తీరుపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర రక్షణకు మెరుపు సమ్మెకు వెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. జేఏసీ జిల్లా చైర్మన్ బూరి గ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథ్ మాట్లాడుతూ సమైక్యవాదులు, సకలజనులు చిత్తశుద్ధితో ఈ ఉద్యమానికి కలసిరావాలన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే సమైక్యరాష్ర్ట పరిరక్షణ వేదిక రాష్ట్ర చైర్మన్ అశోక్‌బాబు రాజీనామా చేస్తానన్నారని, అలాగే జిల్లా నుంచి తాను కూడా రాజీనామా చేస్తానని ఆశీర్వాదం ప్రకటించారు. జేఏసీ నాయకులు గ్రంధి బాబ్జి, దంటు సూర్యారావు, జవహర్‌ఆలీ, అనిల్ జాన్సన్, టి.మాధవి, రామ్మెహన్, జియావుద్దీన్, మురళి, వివిధ సెక్టార్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ’తో ముందస్తు ఎన్నికలు: శరద్ పవార్
ముంబై: తెలంగాణ అంశంపై తాజాగా తలెత్తుతున్న పరిణామాల కారణంగా రానున్న రోజుల్లో పలువురు లోక్‌సభ ఎంపీలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని, ఫలితంగా పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అన్నారు. ‘ఎకనామిక్ టైమ్స్’ దినపత్రికతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, 2014 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో పోటీచేసి, రాజ్యసభకు వెళతానని అన్నారు. తెలంగాణ అంశం రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపగలదని, తనకు తెలిసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నారని చెప్పారు. వారు రాజీనామాలు చేసినట్లయితే, లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. -
పోదాం పద జనభేరికి..
సాక్షి, కరీంనగర్ : సకలజనభేరీకి కరీంనగర్ కదిలివెళ్తోంది. వారం రోజుల నుంచి ఇందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విభాగమైన సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి రెండు నెలలయినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తెలంగాణవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పార్లమెంటులో బిల్లు పెట్టేవరకు ఉద్యమం కొనసాగుతుందని జూలై 29న సీడబ్ల్యూసీ ప్రకటన వచ్చినప్పుడే స్పష్టం చేసిన టీజేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగం గా సకలజనభేరీ నిర్వహస్తోంది. హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో ఆదివారం జరుగుతున్న ఈ సభకు తెలంగాణవాదులు భారీగా తరలివెళ్లేందుకు తయారవుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణ యం తీసుకున్న తరువాత సీమాంధ్ర నేతలు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగావాదుల్లో వ్యక్తవుతున్న అనుమానాలను తీర్చేందుకు ఈ సభ వేదిక అవుతుందని జేఏసీ నేతలు చెప్తున్నారు. సకలజనభేరికి ఇంటికొకరు చొప్పున తరలివచ్చి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. భేరీని విజయవంతం చేసేందుకు తెలంగాణవ్యాప్తంగా అన్ని సంఘాలు, అన్ని వర్గాలు స్వచ్చం దంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. టీజేఏసీ భాగస్వామ్య పక్షాలయిన టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమాక్రసీ తమ శ్రేణులను భారీగా తరలించేందుకు సిద్ధమయ్యాయి. టీఆర్ఎస్ ఈసభను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ జనసమీకరణ అంశాన్ని పార్టీ నేతలతో సమీక్షించారు. జిల్లానుంచి వీలైనంత ఎక్కువ సంఖ్యలో తెలంగాణవాదులను తరలించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. పార్టీ జిల్లా ఇన్చార్జి బి.వినోద్‌కుమార్, ఎంపీ జి.వివేకానంద, టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, అనుంబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. జనసమీకరణకు కార్యాచరణ రూపొందించి బాధ్యతలు అప్పగించారు. శాసనసభ్యులున్న నియోజకవర్గాల నుంచి ఐదు వేలకు తగ్గకుండా, మిగతా నియోజకవర్గాల నుంచి మూడువేల చొప్పున జనాన్ని తరలించాలని నిర్ణయించారు. జిల్లానుంచి 50వేల మందిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జేఏసీతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి సంఘాలు సకలజనుల భేరీకి తమ సభ్యులు వీలైనంత ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. కుల సంఘాలు, వాణిజ్య వర్గాలు, న్యాయవాదులు, పెన్షనర్లు కూడా ఈ సన్నాహాల్లో ఉన్నారు. 42 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులతో టీఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్, వినోద్‌కుమార్, ఈద శంకర్‌రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని నిర్ణయించారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు భేరీకి సిద్ధమయ్యాయి. ఎవరికి వారే సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యాచరణను తయారు చేసుకున్నారు. సకలజనభేరీ ఉద్దేశాలు, ఆవశ్యకతలను ప్రచారం చేసేందుకు వారం రోజుల నుంచి వివిధ సంఘాలు డప్పుచాటింపు, ర్యాలీలు, సదస్సులు, సన్నాహక సమావేశాలు నిర్వహించా యి. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే లక్ష్యంతో సాగుతున్న ప్రయత్నాలు, వాటిని తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం చేపట్టవలసిన కార్యాచరణ ఈ వేదిక మీద ఖరారు కానుంది. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను టీజేఏసీ ఇక్కడ నుంచి ప్రకటించే అవకాశముండడంతో తెలంగాణవాదులు ఈసభలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
హెచ్ఐవీ బాధితుల రక్షణకు బిల్లు
HIV/AIDS Bill in next Parliament session: Oscar Fernandes బెంగళూరు, న్యూస్‌లైన్: హెచ్ఐవీ బాధితుల రక్షణకు త్వరలో పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెడతామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ తెలిపారు. కర్ణాటకలో హెచ్ఐవీ నియంత్రణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నగరంలోని వికాససౌధలో మంగళవారం ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఫెర్నాండెజ్ ప్రసంగించారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్లు, ఆరోగ్య శాఖల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. దీనిపై సెక్స్ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలతో హైదరాబాద్‌లో సమావేశాన్ని కూడా నిర్వహించాలనుకున్నామని, అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా దానిని కర్ణాటకలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అక్టోబరు లేదా నవంబరులో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. -
‘ఆహార భద్రత’కు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. దేశంలోని మూడింట రెండొంతుల జనాభాకు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లును సోమవారం రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. దాదాపు 82 కోట్ల జనాభాకు లబ్ధి చేకూర్చే ఈ బిల్లు చట్టంగా మారేందుకు ఇక రాష్ట్రపతి ఆమోదం మాత్రమే పొందాల్సి ఉంది. ఆహార భద్రత కోసం జూలై 5న ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఆర్డినెన్స్ రద్దు కోసం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. అయితే, విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను గతవారం లోక్‌సభ ఆమోదించగా, రాజ్యసభ ఆ సవరణలను తిరస్కరించింది.