
‘తెలంగాణ’తో ముందస్తు ఎన్నికలు: శరద్ పవార్
తెలంగాణ అంశంపై తాజాగా తలెత్తుతున్న పరిణామాల కారణంగా రానున్న రోజుల్లో పలువురు లోక్‌సభ ఎంపీలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని, ఫలితంగా పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అన్నారు.
ముంబై: తెలంగాణ అంశంపై తాజాగా తలెత్తుతున్న పరిణామాల కారణంగా రానున్న రోజుల్లో పలువురు లోక్‌సభ ఎంపీలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని, ఫలితంగా పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అన్నారు. ‘ఎకనామిక్ టైమ్స్’ దినపత్రికతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, 2014 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో పోటీచేసి, రాజ్యసభకు వెళతానని అన్నారు. తెలంగాణ అంశం రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపగలదని, తనకు తెలిసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నారని చెప్పారు. వారు రాజీనామాలు చేసినట్లయితే, లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.