ముంబై : అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అజిత్ పవార్ వర్గంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 20 మంది నేతలు (అందులో 15మంది ఎమ్మెల్యేలు).. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి నేతృత్వం వహిస్తున్న అజిత్ పవార్‌కు గట్టి షాక్ తగిలింది. అజిత్ పవార్‌కు నేతృత్వంలోని ఎన్సీపీకి నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. త్వరలోనే శరద్ పవార్‌తో జతకట్టనున్నారు.
పింప్రి చించ్వాడ్ ఎన్సీపీ యూనిట్ అధ్యక్షుడు అజిత్ గవానే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను అజిత్ పవార్‌కు పంపించారు. గవానేతో పాటు స్టూడెండ్ వింగ్ అధ్యక్షుడు యష్ సానే,మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే,పంకజ్ భలేకర్ ఎన్సీపీకి గుడ్‌బై చెప్పారు.
అజిత్ పవార్ వర్గంలో అలజడి
పింప్రి చించ్వాడ్‌కు చెందిన నలుగురు కీలక నేతలు రాజీనామా చేయడంతో అజిత్ పవార్ వర్గంలో అలజడి మొదలైంది. మరికొందరు నేతలు సైతం అజిత్‌ను కాదని శరద్ పవార్‌తో టచ్‌లోకి వెళ్లారంటూ మహరాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
అందుకు ఊతం ఇచ్చేలా శరద్ పవార్ గత నెలలో ‘తన పార్టీ నాశనాన్ని కోరుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వారిని ఆహ్వానించం. కానీ పార్టీ పరువును దెబ్బతీయకుండా బలోపేతం చేసేందుకు కృషి చేసే నాయకుల్ని తిరిగి చేర్చుకుంటాం’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో పింప్రి చించ్వాడ్ అజిత్ పవార్ వర్గంలోని ఎన్సీపీ నేతలు తన రాజీనామాలు చేయడం మహా రాజకీయాలు మరోసారి చర్చకు దారి తీశాయి.
షాక్‌లోకి అజిత్ పవార్ వర్గం
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్ర అజిత్ పవార్ వర్గం 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ ఊహించని ఫలితాలు తనని షాక్‌కి గురి చేశాయని, ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు
కాగా, ఈ ఏడాది నవంబర్‌లో మహరాష్ట్రలో 288 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ఉద్దవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన 115 నుంచి 125 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండగా.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ సైతం మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుండగా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలో డీలా పడ్డ అజిత్ పవార్ వర్గంలోని 15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్‌కు టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం.
శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్
గతేడాది మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ ఉద్ధండుడు శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిట్టనిలువునా చీలింది. పార్టీ సీనియర్ నేత, పవార్‌కు స్వయానా అన్న కుమారుడైన అజిత్ పవారే పార్టీని చీల్చారు. ఎన్సీపీలో తనకు, తనకుమారుడు పార్థ్‌కు రాజకీయ భవిష్యత్ ఉండదనే ఆందోళనతో పార్టీని చీల్చి శరద్ పవార్ వర్గంలో నేతల్ని తనవైపుకు తిప్పుకున్నారు. వెంటనే ప్రభుత్వంలో చేరారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. మహరాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment