సకలజనభేరీకి కరీంనగర్ కదిలివెళ్తోంది. వారం రోజుల నుంచి ఇందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విభాగమైన సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి రెండు నెలలయినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తెలంగాణవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సాక్షి, కరీంనగర్ : సకలజనభేరీకి కరీంనగర్ కదిలివెళ్తోంది. వారం రోజుల నుంచి ఇందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విభాగమైన సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి రెండు నెలలయినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తెలంగాణవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పార్లమెంటులో బిల్లు పెట్టేవరకు ఉద్యమం కొనసాగుతుందని జూలై 29న సీడబ్ల్యూసీ ప్రకటన వచ్చినప్పుడే స్పష్టం చేసిన టీజేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగం గా సకలజనభేరీ నిర్వహస్తోంది. హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో ఆదివారం జరుగుతున్న ఈ సభకు తెలంగాణవాదులు భారీగా తరలివెళ్లేందుకు తయారవుతున్నారు.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణ యం తీసుకున్న తరువాత సీమాంధ్ర నేతలు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగావాదుల్లో వ్యక్తవుతున్న అనుమానాలను తీర్చేందుకు ఈ సభ వేదిక అవుతుందని జేఏసీ నేతలు చెప్తున్నారు. సకలజనభేరికి ఇంటికొకరు చొప్పున తరలివచ్చి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. భేరీని విజయవంతం చేసేందుకు తెలంగాణవ్యాప్తంగా అన్ని సంఘాలు, అన్ని వర్గాలు స్వచ్చం దంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. టీజేఏసీ భాగస్వామ్య పక్షాలయిన టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమాక్రసీ తమ శ్రేణులను భారీగా తరలించేందుకు సిద్ధమయ్యాయి. టీఆర్‌ఎస్ ఈసభను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ జనసమీకరణ అంశాన్ని పార్టీ నేతలతో సమీక్షించారు. జిల్లానుంచి వీలైనంత ఎక్కువ సంఖ్యలో తెలంగాణవాదులను తరలించేందుకు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేసింది.
పార్టీ జిల్లా ఇన్‌చార్జి బి.వినోద్‌కుమార్, ఎంపీ జి.వివేకానంద, టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, అనుంబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. జనసమీకరణకు కార్యాచరణ రూపొందించి బాధ్యతలు అప్పగించారు. శాసనసభ్యులున్న నియోజకవర్గాల నుంచి ఐదు వేలకు తగ్గకుండా, మిగతా నియోజకవర్గాల నుంచి మూడువేల చొప్పున జనాన్ని తరలించాలని నిర్ణయించారు. జిల్లానుంచి 50వేల మందిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జేఏసీతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి సంఘాలు సకలజనుల భేరీకి తమ సభ్యులు వీలైనంత ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. కుల సంఘాలు, వాణిజ్య వర్గాలు, న్యాయవాదులు, పెన్షనర్లు కూడా ఈ సన్నాహాల్లో ఉన్నారు. 42 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులతో టీఆర్‌ఎస్ నేతలు ఈటెల రాజేందర్, వినోద్‌కుమార్, ఈద శంకర్‌రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని నిర్ణయించారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు భేరీకి సిద్ధమయ్యాయి.
ఎవరికి వారే సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యాచరణను తయారు చేసుకున్నారు. సకలజనభేరీ ఉద్దేశాలు, ఆవశ్యకతలను ప్రచారం చేసేందుకు వారం రోజుల నుంచి వివిధ సంఘాలు డప్పుచాటింపు, ర్యాలీలు, సదస్సులు, సన్నాహక సమావేశాలు నిర్వహించా యి. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే లక్ష్యంతో సాగుతున్న ప్రయత్నాలు, వాటిని తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం చేపట్టవలసిన కార్యాచరణ ఈ వేదిక మీద ఖరారు కానుంది. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను టీజేఏసీ ఇక్కడ నుంచి ప్రకటించే అవకాశముండడంతో తెలంగాణవాదులు ఈసభలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.