బిల్లుపై ఓటింగ్ కోసం పట్టుబడతాం: వైఎస్ విజయమ్మ
హైదరాబాద్: విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇలా తరలించడం అప్రజాస్వామికమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోరుతూ బిల్లుపై ఓటింగ్ కోసం పట్టుబడతామని వైఎస్ విజయమ్మ చెప్పారు. బిల్లుపై చర్చ గడువు ముగుస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమైక్య తీర్మానం గుర్తుకొచ్చిందని విజయమ్మ ఎద్దెవా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యతీర్మానం చేయాలని డిమాండ్ చేస్తోందని అన్నారు. అయినా తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని విజయమ్మ ఆవేధన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం ప్రజాపోరాటాలకు తాము సిద్ధమని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సమైక్యాంధ్ర కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని విజయమ్మ తెలిపారు.
కాగా, శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి లోటస్ పాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే.