బిల్లును పార్లమెంటుకు పంపొద్దు!: వైఎస్సార్ సీఎల్పీ | Do not send Bifurcation bill to Parliament: YSRCP | Sakshi
Sakshi News home page

బిల్లును పార్లమెంటుకు పంపొద్దు!: వైఎస్సార్ సీఎల్పీ

Published Fri, Jan 31 2014 1:52 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

Do not send Bifurcation bill to Parliament: YSRCP

* రాష్ట్రపతిని కోరుతామన్న వైఎస్సార్ సీఎల్పీ నేత విజయమ్మ
* జగన్ నేతృత్వంలో త్వరలో అంతా ఢిల్లీ వెళ్తామని వెల్లడి
* సమైక్యం కోసం ప్రతీ అవకాశం వాడుకుంటామని ప్రతిన
* కిరణ్, చంద్రబాబుల కుట్ర ఫలితమే ప్రస్తుత పరిస్థితని వ్యాఖ్య 

 రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరపాలని, బిల్లును తిరస్కరించి తిప్పిపంపాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు విజయమ్మ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఉదయం తెలుగుతల్లి విగ్రహం వద్ద నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర చేశారు. విజయమ్మతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సచివాలయం, రవీంద్రభారతి, గన్‌పార్క్ మీదుగా అసెంబ్లీ ఆవరణకు చేరుకున్నారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచే వెళ్లే విభజన బిల్లును పార్లమెంట్‌కు పంపొద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి విజ్ఞప్తి చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు విజయమ్మ తెలిపారు. త్వరలో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం ఢిల్లీకి వెళ్లి రాష్ర్టపతిని కలుసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శాసనసభ వేదికగా తాము శక్తి వంచన లేకుండా పోరాడామని, ఇపుడిక బిల్లు కేంద్రానికి వెళుతుంది కనుక ఢిల్లీకి వెళ్లి విభజనను అడ్డుకునేందుకు గల ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటామని చెప్పారు.
 
  శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన తరువాత సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వైఎస్సార్ సీఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో విజయమ్మ మాట్లాడారు. విభజన బిల్లు రాష్ట్రానికి రావడానికి, ఇప్పుడిలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. యుద్ధ విమానంలో ఆగమేఘాల మీద రాష్ట్రానికి వచ్చిన బిల్లును.. ముఖ్యమంత్రి 17 గంటల వ్యవధిలోనే అసెంబ్లీకి వచ్చేలా చేశారని గుర్తుచేశారు. బిల్లును అసెంబ్లీకి పంపేటపుడు ముఖ్యమంత్రికి అందులో లోపాలున్నాయనే సంగతి తెలియదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతటి ముఖ్యమైన విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే రోజున సీఎం తనకు ఆరోగ్యం బాగాలేక సభకు రాలేకపోయానని చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇక చంద్రబాబు అయితే వరుసగా వారం రోజుల పాటు మీడియా ముందు బిల్లులో లోపాలున్నాయని చెప్పానని అన్నారని, మరి శాసనసభ వేదికగా ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారని విజయమ్మ ప్రశ్నించారు. ఈ బిల్లుపై చర్చ వద్దని ఎందుకు డిమాండ్ చేయలేకపోయారని సూటిగా ప్రశ్నించారు.
 
 నిజంగా ఇలాంటి నేతలు ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, దురదృష్టం అని వ్యాఖ్యానించారు. వీరిద్దరి కుమ్మక్కు, కుట్ర ఫలితంగానే రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి దాపురించిందన్నారు. బిల్లుపై చర్చించడం అంటే విభజనకు అంగీకరించినట్లేనని తొలినుంచీ తమ పార్టీ నెత్తీ నోరూ బాదుకుని చెప్పినా పట్టించుకోకపోగా తమదే తప్పన్నట్లుగా నిందించారన్నారు. విలేకరుల సమావేశంలో ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, తెల్లం బాలరాజు, కొరుముట్ల శ్రీనివాసులు, భూమా శోభానాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కె.చెన్నకేశవరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పినిపె విశ్వరూప్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, చదిపిరాళ్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు.
 
 ముఖ్యమంత్రి కిరణ్‌ది విజయహాసం కాదు అపహాస్యం: భూమన
 సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇద్దరూ సమైక్యద్రోహులని, వీరిద్దరూ కుమ్మక్కై విభజనకు సహకరించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, సీజీసీ సభ్యుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..  తన పదవిని కాపాడుకోవడానికి కిరణ్, తనపై సీబీఐ కేసులు రాకుండా చేసుకోవడానికి చంద్రబాబు రాష్ట్ర విభజన బిల్లును మనస్ఫూర్తిగా శాసనసభకు ఆహ్వానించి సగర్వంగా సాగనంపారని విమర్శించారు. బిల్లును అసెంబ్లీలో తిరస్కరించామంటూ కిరణ్ చేస్తున్న విజయదరహాసం అపహాస్యం తప్ప మరొకటి కాదన్నారు. ఈ తీర్మానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement