ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: వైఎస్ జగన్‌ | Ys jagan mohan reddy takes on union government | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: వైఎస్ జగన్‌

Published Thu, Feb 6 2014 3:15 AM | Last Updated on Fri, Nov 9 2018 5:41 PM

Ys jagan mohan reddy takes on union government

* అసెంబ్లీ తిరస్కరించినా కేంద్రం మొండిగా ముందుకెళ్తోంది..
* రాష్ట్రపతికి జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు  
* దేశ ప్రథమ పౌరుడిగా మీరైనా అడ్డుకోండి..
* దేశంలో మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం రాష్ట్ర విభజన చేస్తోంది..
* రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది
* గతంలో అసెంబ్లీ ఆమోదంతోనే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి
* ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది
* బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి
* బిల్లును బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ  వ్యతిరేకిస్తాయని ధీమా
* కేంద్రంపై అవిశ్వాసం ఎవరు పెట్టినా ముందు తామే లేచి నిలబడతామని వెల్లడి
 

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీ తిరస్కరించినా కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందని, దేశ ప్రథమ పౌరుడిగా మీరైనా ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. గతంలో రాష్ట్రాల విభజన ఆయా రాష్ట్ర అసెంబ్లీల ఆమోదంతో జరగ్గా ఆంధ్రప్రదేశ్ విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని వివరించారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వైఎస్ జగన్, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల బృందం రాష్ట్రపతితో భేటీ అయింది. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పార్టీ తరఫున జగన్ నాలుగు పేజీల వినతిప్రతాన్ని అందించారు.
 
 అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా తమ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తూ అఫిడవిట్లు సమర్పించిన విషయాన్ని, సభా నిబంధనల కింద పలుమార్లు బిల్లును వెనక్కి పంపాలంటూ కోరిన విషయాన్ని వినతి పత్రంలో గుర్తు చేశారు. బిల్లును తిప్పి పంపాలని అసెంబ్లీ తీర్మానం చేసిందని వివరించారు. గతంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆయా మాతృ రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన అంశాలను రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.
 
  శ్రీకృష్ణ కమిటీ సైతం విభజనను వ్యతిరేకించినా, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు వెళుతూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని వివరించారు. ఈ దృష్ట్యా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా చూడాలని విజ్ఞపి చేశారు. తాము చెప్పిన విషయాలన్నీ విన్న రాష్ట్రపతి.. విభజన విల్లు విషయంలో ఏది మంచిదో అది చేస్తామని, తాను చేయగలిగిందంతా చేస్తానని హామీ ఇచ్చినట్లు జగన్ వివరించారు. రాష్ట్రపతితో సమావేశం అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.
 
 దేశంలో ఎక్కడా లేని అన్యాయం..
 రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తీరును రాష్ట్రపతికి వివరించామని జగన్ చెప్పారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా కేంద్రం రాష్ట్ర విభజనకు దిగుతోందని విమర్శించారు. ‘‘రాష్ట్రపతితో సుదీర్ఘంగా అన్ని అంశాలపై చర్చించాం. దేశంలో కనీవినీఎరుగని రీతిలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. గతంలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన తర్వాతే కేంద్రం రాష్ట్రాలను విడగొట్టింది. కానీ ఇప్పుడు మొదటిసారి విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించినా, దాన్ని తిప్పిపంపినా కేంద్రం అన్యాయంగా విభజన చేసేందుకు ముందుకు వెళుతోంది. ఈ అన్యాయాన్ని ఆపాలి. దీనిపై రాష్ట్రపతి సావధానంగా విన్నారు. ఈ విషయంలో ఏది మంచో అది చేస్తానని చెప్పారు. మాకైతే దేవుడిపై నమ్మకం ఉంది. విభజన జరగదనే విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
 
 అన్ని పార్టీలు విభజనను వ్యతిరేకిస్తాయి: పార్లమెంట్‌లో విభజన బిల్లును ప్రవేశపెడితే అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తాయని తమకు గట్టి నమ్మకం ఉందని జగన్ చెప్పారు. ‘‘ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో తిరిగి జాతీయ పార్టీల అధ్యక్షులను కలిశాం. చూస్తూ ఊరుకుంటే.. ఈ అన్యాయం మీకు కూడా జరుగుతుందని చెప్పాం. కాంగ్రెస్ అడ్డగోలుగా బిల్లు తేవాలని ప్రయత్నిస్తే ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలిచి బిల్లును వ్యతిరేకిస్తాయనే నమ్మకం ఉంది. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని మాకు విశ్వాసం ఉంది..’’ అని వివరించారు. తాము మద్దతిస్తామని బీజేపీ కచ్చితంగా చెబుతున్నప్పుడు బిల్లు ఆగుతుందని ఎలా చెప్పగలరని విలేకరులు అడగ్గా.. ‘‘గతంలో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ను కలిశాం. ఈ రోజున పార్లమెంట్‌లో అరుణ్‌జైట్లీని కలిశాం. ప్రతి ముఖ్య నేతను కలుస్తున్నాం. మరోసారి కూడా అందరినీ కలుస్తాం. బిల్లును అడ్డుకోవాలని కోరతాం. బీజేపీ అయితే బిల్లుకు మద్దతు ఇస్తుందని అనుకోం’’ అని వ్యాఖ్యానించారు.
 
 అవిశ్వాసం ఎవరు పెట్టినా ముందు లేచి నిలబడతాం
 పార్లమెంట్‌లో పార్టీ తరఫున అవిశ్వాసం పెడతారా అని విలేకరులు ప్రశ్నించగా ‘‘20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంటిదారి పట్టక తప్పదు. ఎన్నికలు వస్తున్న తరుణంలో అవిశ్వాసానికి అర్థం లేదు. ఎన్నికల తరుణంలో లబ్ధి పొందేందుకు టీడీపీ అవిశ్వాసం ఇచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు అవిశ్వాసం పెట్టినా మా పార్టీ తరఫున ముగ్గురం ఎంపీలం ముందు లేచి నిలబడతాం’’ అని జగన్ స్పష్టంచేశారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, సుచరిత, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, కృష్ణదాస్, విశ్వరూప్, ఆది నారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి తదితరులు ఉన్నారు.
 
 రాష్ట్రపతికి వైఎస్సార్‌సీపీ సమర్పించిన వినతి పత్రం సారాంశం..
 రాజ్యాంగ నిబంధనలను, సంప్రదాయాలను కాలదన్నుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 2013, డిసెంబర్ 26న హైదరాబాద్‌లో మా పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు మీకు అఫిడవిట్లను సమర్పించాం. గతంలో ఏర్పాటు చేసిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలోనూ.. ఆయా అసెంబ్లీలు విభజనకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాలు చేసిన తరువాతే ఆయా రాష్ట్రాలను విభజించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం.
 
  మిగతా రాష్ట్రాల ఏర్పాటు కూడా సంబంధిత కమిషన్ లేదా కమిటీ సిఫారసుల ఆధారంగానే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ కూడా విభజనను వ్యతిరేకించింది. విభజన కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ నుంచి కూడా ఎలాంటి తీర్మానం రాలేదు. అయినప్పటికీ, రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా.. పదేళ్ల పాలన ముగుస్తున్న ఘడియల్లో రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం తొందరపడుతోంది. భాషాప్రాతిపదికన ఏర్పడిన 57 ఏళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రాన్ని విభజించడానికి సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని టేబుల్ ఐటమ్‌గా తీసుకుని కేంద్ర కేబినెట్ చర్చించింది. ఇది కేబినెట్ సమిష్టి బాధ్యతను అగౌరవపర్చడమే అవుతుంది.
 
     ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించిన బిల్లులోనూ అత్యంత ముఖ్యమైన అంశాలైన.. లక్ష్యాలు, కారణాలు.. ఆర్థిక మెమొరాండం, విభజన అనంతర పరిణామాలు.. మొదలైనవి లేకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఇది కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనం.
 
     మా పార్టీ అసెంబ్లీ నిబంధన 77, 78 కింద రెండు తీర్మానాలను ప్రతిపాదించింది. అవి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ఒకటి, బిల్లును వెనక్కి పంపించాలని కోరుతూ మరొకటి. అలాగే, అసెంబ్లీలోనూ బిల్లుకు వ్యతిరేకంగా మా పార్టీ సభ్యులు తమ లిఖితపూర్వక అభిప్రాయాలను తెలిపారు. అలాగే, బిల్లులోని మొత్తం 108 క్లాజులను, 13 షెడ్యూళ్లను తొలగించాలని కోరుతూ సవరణలు ప్రతిపాదించారు. అసెంబ్లీలోని మొత్తం 279 సభ్యుల్లో 157 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ అభిప్రాయాలు తెలిపినట్లు మాకు తెలిసింది.
 
     అలాగే, బిల్లును తిరిగి పంపించడానికి చివరి రోజైన జనవరి 30, 2014 నాడు దాదాపు అందరు సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపినట్లు ప్రకటించారు. అదే రోజు మేము ప్రతిపాదించిన అనధికార తీర్మానాలే కాకుండా.. రాష్ట్ర  సీఎం కిరణ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తున్నట్లుగా తీర్మానం ఇచ్చారు. అలాగే, ఎలాంటి కారణం, ప్రాతిపదిక లేకుండా, ఏకాభిప్రాయం కుదరకుండానే రాష్ట్రాన్ని విభజిస్తున్నందున ఆ బిల్లును పార్లమెంటుకు పంపవద్దని కూడా రాష్ట్రపతిని కోరుతూ తీర్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానం మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందిందని స్పీకర్ ప్రకటించారు. అందువల్ల పూర్తి మెజారిటీతో అసెంబ్లీ, శాసనమండలి తిరస్కరించిన బిల్లును పార్లమెంటుకు సిఫారసు చేయకూడదని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము.
 
 అరెరెరె.. 4 గంటలు దీక్ష చేశాడా?
 విభజనను వ్యతిరేకిస్తూ సీఎం కిరణ్ దీక్ష చేశారు, దీన్ని ఎలా చూస్తారు? అని విలేకరులు అడగ్గా అందుకు జగన్ స్పందిస్తూ... ‘‘ఎంతసేపు దీక్ష చేశాడు.. అబ్బ.. నాలుగు గంటల సేపు దీక్ష చేశాడా? చాలా గొప్పోడు కదయ్యా..! అరెరెరె.. నాలుగు గంటలు చేశాడా? చాలా చాలా గొప్ప.. అరెరెరె.. ఎప్పుడైనా నిరాహార దీక్ష 8 రోజులు చేశాడో ఒక్కసారి ఆయనను అడగండి.. కడుపు మాడ్చుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం 8 రోజులు తిండి తినకుండా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి అడిగి కనుక్కోండి.. నాలుగు గంటలు చేశాడట! ఎన్నికలకు కరెక్టుగా మూడు వారాల్లో షెడ్యూల్ వస్తోంది.
 
  ఎట్లాగూ ఎన్నికలకు పోక తప్పదని చెప్పి.. 4 గంటలసేపు 200 మందితో దీక్ష చేశాడట! దానికో పబ్లిసిటీ.. దానికో బిల్డప్పు..’’ అని అన్నారు. కేసీఆర్ 9 రోజులు దీక్ష చేసిన విషయాన్ని ప్రస్తావించగా.. ‘‘నాకు బీపీ లేదు.. షుగర్ లేదు.. ఎటువంటి రోగాలు లేవు. కేసీఆర్‌కు షుగర్ ఉంది.. చంద్రబాబుకు షుగర్ ఉంది.. కిరణ్ కుమార్‌రెడ్డి దీక్ష చేయలేదు. నేను రాసిస్తా.. 36 గంటలు కూర్చోమని చెప్పండి.. తినకుండా.. తాగకుండా.. ఏమీ చేయకుండా.. షుగర్ పేషెంట్లు ఎలా తట్టుకుంటారో చూడనైనా చూస్తా..!’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement