నిరంకుశ విభజనను అడ్డుకోండి
సీపీఎం, డీఎంకే పార్టీ నేతలను కోరిన విజయమ్మ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ బృందం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని జాతీయ పార్టీలు వ్యతిరేకించాలని, విభజన జరగకుండా అడ్డుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలోని బృందం మంగళవారమిక్కడ సీపీఎం, డీఎంకే పార్టీల ప్రధాన నేతలను కలిసి కోరింది. కేవలం తెలంగాణలో కొన్ని ఎంపీ సీట్లు దక్కుతాయన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ నిరంకుశంగా విభజన నిర్ణయం చేసిందని పార్టీల నేతల దృష్టికి తెచ్చింది. విభజనపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడానికి ముందు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తీసుకోవాలన్న సంప్రదాయాన్ని కేంద్రం తుంగలో తొక్కి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని వివరించింది. రెండు పర్యాయాలు యూపీఏ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన రాష్ట్ర ప్రజల ఆందోళనలను, 70 రోజులుగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు పోతోందని ఆవేదన వ్యక్తంచేసింది. రాష్ట్ర సమైక్యత కోసం తమ పార్టీ పోరాడుతోందని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారని ఈ బృందం వారి దృష్టికి తెచ్చింది. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీలు నిలవాలని సీపీఎం, డీఎంకేలను కోరింది. ఈ అభ్యర్థనకు ఆ రెండు పార్టీల నుంచి సానుకూల మద్దతు లభించింది. తామెప్పటికీ సమైక్యానికే అండగా ఉంటామని సీపీఎం తెలుపగా, పార్లమెంట్‌లో విభజనపై చర్చ సమయంలో అన్ని అంశాలనూ గట్టిగా ప్రస్తావిస్తామని డీఎంకే హామీ ఇచ్చింది.
కరత్, ఏచూరి, కనిమొళిలతో భేటీ...
సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీకి వచ్చిన విజయమ్మ నేతృత్వంలోని బృందం మంగళవారం సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, సీతారాం ఏచూరితోను, డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళితోను విడివిడిగా భేటీ అయింది. ఈ బృందంలో పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ ఉన్నారు. ఈ భేటీల సందర్భంగా బృందం రాష్ట్ర విభజనపై పార్టీ వైఖరిని తెలపడంతో పాటు పలు సందర్భాల్లో సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని, 2009లో రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విభజనపై చెప్పిన అంశాలను, 2004లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు సమయంలో జరిగిన నిర్ణయం, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ వెల్లడించిన వైఖరులను తెలుపుతూ నివేదనలను సమర్పించింది. ఈ సందర్భంగా 70 రోజులుగా సీమాంధ్రలో ఆందోళనలను విజయమ్మ బృందం నేతల దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర సమైక్యతకు జాతీయ పార్టీలుగా మద్దతు అందించాలని ఆ రెండు పార్టీలకు విజ్ఞప్తి చేసింది. దీనికి ఆ రెండు పార్టీలు అంగీకారం తెలిపాయి. అన్ని అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళతామని, పార్లమెంట్ లో విభజన బిల్లు పెడితే సమైక్యాంధ్రకు మద్దతుగా నిలుస్తామని పార్టీ నేతలు హామీ ఇచ్చారు.
మంత్రుల కమిటీ ఓ సైమన్ కమిషన్: విజయమ్మ
ఈ భేటీల అనంతరం వైఎస్ విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. ‘‘70 రోజులుగా 50 శాతం జనాభా రోడ్డుమీదకొస్తున్నారు. ఏ ఒక్క వ్యవస్థా పనిచేయడం లేదు. విద్యుత్ రావట్లేదు. గ్రిడ్ పడిపోయే స్థితిలో ఉంది. తాగు నీరు ఇబ్బందిగా ఉంది. బస్సులు పనిచేయడం లేదు. పాఠశాలలు పనిచేయడం లేదు. రాష్ట్రం పడుతున్న బాధను అందరికీ తెలిపేందుకు ఇక్కడకు వచ్చాం’’ అని విజయమ్మ తెలిపారు. పార్లమెంట్‌లో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు సమైక్య ఉద్యమం గురించి, కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విధానం గురించి మాట్లాడతానని డీఎంకే ఎంపీ కనిమొళి హామీ ఇచ్చినట్లు తెలిపారు. సీపీఎం నేతలు ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి సైతం సీపీఎం ముందు నుంచీ సమైక్యానికే మద్దతు ఇస్తోందని తెలిపారన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం పెట్టకుండా కేబినెట్ నోట్ సైతం తెచ్చిందని విమర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, రోశయ్య కమిటీ, ఆంటోనీ కమిటీ వేసిందని, ఇప్పుడు కేబినెట్ నోట్ తర్వాత ఈ సైమన్ కమిషన్‌ను(మంత్రుల బృందాన్ని ఉద్దేశించి) పంపే ప్రయత్నం చేస్తోందన్నారు. 2001లో సీడబ్ల్యూసీ రెండో ఎస్సార్సీనే తమ విధానమని తీర్మానం చేసిందని, దివంగత వైఎస్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఉన్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి రెండో ఎస్సార్సీనే తమ విధానమని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రీకృష్ణ కమిటీ చెప్పినదాన్ని సైతం పట్టించుకోలేదని విమర్శించారు.
బాబు దీక్ష ఎందుకో ప్రజలకు చెప్పాలి..
ఇక ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షను విజయమ్మ తప్పుపట్టారు. ‘చంద్రబాబు 2008 నుంచి విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు దీక్ష చేస్తున్నారో బాబుకే తెలియాలి’ అని అన్నారు. ఎవరి కోసం, ఎందుకోసం దీక్ష చేస్తున్నారో చంద్రబాబు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
నేడు రాష్ట్రపతిని కలవనున్న వైఎస్ విజయమ్మ, వైఎస్సార్సీపీ బృందం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలోని పార్టీ బృందం కలవనుంది. విజయమ్మతోపాటు రాష్ట్రపతిని కలిసేవారిలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శోభా నాగిరెడ్డి, హెచ్‌ఏ రెహమాన్ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రపతిని కలిసేందుకు వైఎస్సార్సీపీ బృందానికి రాష్ట్రపతి భవన్ వర్గాలు అపాయిట్‌మెంట్ ఇచ్చినట్లు ఈ మేరకు వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి.
--------------
గిరిజనుల గురించి మాట్లాడరెందుకు?
Why don't you talk on tribals, asks balaraju
Balaraju, tribals, telangana, samaikyandhra, బాలరాజు, గిరిజనులు, తెలంగాణ, సమైక్యాంధ్ర
తెలంగాణ, సమైక్యాంధ్ర వాదులకు మంత్రి బాలరాజు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించాలనుకునేవారు, సమైక్యంగా ఉంచాలని కోరుకునేవారు గిరిపుత్రుల గురించి, వారి సంక్షేమం గురించి ఒక్కమాటైనా ఎందుకు మాట్లాడటం లేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలోని భూభాగంలో మూడొంతులు గిరిజన ప్రాంతమైనప్పటికీ విభజన, సమైక్యవాదులు ఈ ప్రాంతాన్ని విస్మరించి వ్యవహరించడం తగదన్నారు. మంగళవారం మంత్రుల క్వార్టర్లలో గిరిజన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించినప్పటికీ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేందుకు కేంద్రం చొరవ చూపాలని తమ సమావేశం అభిప్రాయపడినట్లు చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులోనే వీటన్నింటినీ పొందుపర్చాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు.