ఉద్యమాన్ని కిరణ్ నీరుగారుస్తున్నారంటూ ధ్వజం
సమైక్య తీర్మానం కోసం స్పీకర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ నోటీసిచ్చిందని పార్టీ శాసనసభా పక్ష ఉప నేత భూమా శోభానాగిరెడ్డి తెలిపారు. ప్రైవేట్ బిల్లు కింద ఇచ్చిన ఈ తీర్మానానికి విభజనతో నష్టపోయే ప్రాంతాలకు చెందిన అన్ని పార్టీల సభ్యులూ మద్దతివ్వాలని కోరారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడ్డాక పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారంటూ దుయ్యబట్టారు. వారానికోసారి పత్రికల్లో ప్రకటనలు తప్పితే సమైక్యం కోసం ఆయన ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. సభలో విభజన బిల్లును ఓడిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టేలా కిరణ్ ప్రకటనలు చేస్తున్నారంటూ శోభ దుమ్మెత్తిపోశారు. ‘‘బిల్లు వచ్చినప్పుడు కేవలం అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారు.
ఓటింగ్ ఉండదు. అదే తీర్మానం విషయంలో అయితే ఓటింగ్ ఉంటుంది. కాబట్టి సభ సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పార్లమెంటులో అదొక ఆయుధంలా పని చేస్తుంది’’ అని శోభ వివరించారు. కానీ కిరణ్ మాత్రం కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో విభజన దిశగా ముందుకెళ్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుకు తానేం మాట్లాడుతున్నదీ తనకైనా అర్థమవుతోందా అని ప్రశ్నించారు. సమైక్యానికి మద్దతివ్వకపోతే బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.