మా తీర్మానాలన్నీ అడ్మిట్ అయ్యాయి:శోభా నాగిరెడ్డి
హైదరాబాద్: బీఏసీ సమావేశంలో తామిచ్చిన తీర్మానాలన్నీ అడ్మిట్ అయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని స్పీకర్ తెలిపినట్లు ఆమె స్పష్టం చేశారు. రూల్ 77 కింద ఎవరి తీర్మానాన్ని టేకప్ చేసిన తమ పార్టీకి అభ్యంతరం లేదని స్పీకర్ కు తెలిపినట్లు శోభా తెలిపారు. బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీఏసీ రాకుండా రెండు ప్రాంతాల వ్యక్తులను పంపించి రెండు విధానాలను చెప్పించారని శోభా నాగిరెడ్డి మండిపడ్డారు.
విభజన బిల్లుపై అసెంబ్లీలో అంత ఆవేశంగా మాట్లాడిన చంద్రబాబు బీఏసీ ఎందుకు హాజరు కాలేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని పార్టీలు ఒక్కటై పోరాడుతున్నాయని కాని సీమాంధ్ర పార్టీలు మాత్రం తలోరకంగా వ్యవరించడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ తప్పకుండా నిర్వహించాలని ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టుబట్టింది. 77,78 నిబంధనల కింద తామిచ్చిన తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ మరోసారి విజ్ఞప్తి చేసింది.