అనధికార తీర్మానాలను అడ్మిట్ చేశాం: స్పీకర్
హైదరాబాద్: బీఏసీ సమావేశంలో అనధికార తీర్మానాలను అడ్మిట్ చేశామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ తీర్మానానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో ప్రాంతాల వారీగా సభ్యులు తమ వాదనలు వినిపించారు. సమావేశం ముగిసిన అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడారు. అనధికార తీర్మానాలను అడ్మిట్ చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. కాగా, ఎలాంటి తీర్మానాలను అనుమంతిచేది లేదని టి.ప్రాంత ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు.
విభజన బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపాల్సిన సమయం మరింత దగ్గరకు రావడంతో ప్రాంతాలవారీగా నేతలు గళం విప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ తప్పకుండా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ పట్టుబట్టింది.. 77,78 నిబంధనల కింద తామిచ్చిన తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ మరోసారి విజ్ఞప్తి చేసింది. కాగా, విభజన బిల్లుపై సీఎం తిరస్కార తీర్మాన నోటీసును ఇవ్వడాన్ని డిప్యూటీ సీఎం, టి.టిడిపి, టి.కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు తప్పుబట్టాయి. సీఎం ఇచ్చిన నోటీసును పరిశీలించవద్దని టి.కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాలు మాత్రమే తీసుకోవాలని టి.నేతలు డిమాండ్ చేస్తున్నారు.