అసెంబ్లీ భేటీకి భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం, రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు రానున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బందోబస్తుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు శాసనసభలో విభజన బిల్లుపై సభ్యులు మాట్లాడే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశమున్నందున సభా ప్రాంగణంలో మార్షల్స్ సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది.
తాజాగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, డీజీపీ ప్రసాదరావు, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ, అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాం సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సుమారు గంటపాటు కొనసాగిన సమావేశంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేపడుతున్న చర్యలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు.
ఈసారి గత సమావేశాలకు భిన్నమైన వాతావరణంలో సమావేశాలు జరగనున్నందున బందోబస్తును పెంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గత సమావేశాల సందర్భంగా 25 ప్లటూన్ల పోలీసులను బందోబస్తుకు వినియోగించిన అధికారులు ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఇక మార్షల్స్‌ను గతంతో పోలిస్తే రెండింతలు అధికంగా నియమించనున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పాస్‌లున్న విలేకరులు, ఫొటోగ్రాఫర్లు మినహా మరే ఇతర సిబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. సమావేశానంతరం అనురాగ్‌శర్మ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థారుులో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. గతంతో పోలిస్తే ఈసారి బలగాలను పెంచుతున్నామని తెలిపారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, జూబ్లీహాల్ వ ంటి ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
బీఏసీ సమావేశం రేపు: అసెంబ్లీ ఎజెండాను ఖరారు చేసేందుకు శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) ఈనెల 11న సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. స్పీకర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు, మంత్రులను డి.శ్రీధర్‌బాబు, ఆనం రామనారాయణరెడ్డిసహా అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లు హాజరు కానున్నారు. శాసనసభను ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలోనే స్పష్టత రానుంది. సీఎం అతి తక్కువ రోజులు సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఒకవేళ సమావేశాలు జరుగుతున్న సమయంలో విభజన బిల్లు రాష్ట్రపతి నుంచి వస్తే సమావేశాలు పొడిగించాలని యోచిస్తున్నారు. ఏదేమైనా వారం రోజుల్లోపే శాసనసభ సమావేశాలను ముగించాలని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచారం. బీఏసీ భేటీ నాటికి విభజన బిల్లు రాష్ట్రానికి రాని పక్షంలో శాసనసభ సమావేశాల తొలిరోజు ఇటీవల కురిసిన వర్షాలవల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై చర్చ జరపాలని అధికారపక్షం భావిస్తోంది. చంద్రబాబు సైతం అందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. శాసనమండలి బీఏసీ సమావేశం కూడా బుధవారం సాయంత్రం 5.30 గంటలకు చైర్మన్ చక్రపాణి అధ్యక్షత జరగనుంది.