‘నోట్’పై నాటకం | Cm kiran kumar reddy to be know proposals of telangana Note | Sakshi
Sakshi News home page

‘నోట్’పై నాటకం

Published Fri, Sep 27 2013 2:24 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Cm kiran kumar reddy to be know proposals of telangana Note

 కేబినెట్ నోట్‌లోని కీలకాంశాలన్నీ రాష్ట్ర ముఖ్యులకు ముందే తెలుసు
 వారికి పూర్తిగా వివరించిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు
 విభజన ప్రక్రియను సాఫీగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కిరణ్‌కే
 అందుకే... రాజీనామాలొద్దంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు ‘హితవు’
 తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు
 విభజనకు అనుకూలంగానే ఓటేయనున్న బొత్స వర్గీయులు, మరికొందరు!
 పలువురు సీమాంధ్ర ఎమ్మెల్యేలతో ఈ దిశగా కిరణ్ తదితరుల మంతనాలు
 అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోసంగతంలోనే తీర్మానించిన వైఎస్సార్‌సీపీ

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోం శాఖ రూపొందిస్తున్న కేబినెట్ నోట్‌లో పొందుపరిచిన కీలకాంశాలన్నీ రాష్ట్ర ముఖ్య నేతలకు ముందే తెలుసు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారికి ఇప్పటికే పూర్తి సమాచారం ఇచ్చారు. అయినా రాష్ట్ర నేతలంతా తమకేమీ తెలియదన్నట్టుగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. పైగా విభజన ప్రక్రియలో అధిష్టానానికి పూర్తిగా సహకరిస్తున్నారు! ప్రక్రియను సాఫీగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను పెద్దలు కిరణ్ భుజస్కంధాలపైనే పెట్టారు. అందుకే... విభజన ప్రక్రియ అసెంబ్లీ తీర్మానం వరకూ వచ్చేదాకా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుండా ఎలాగోలా నిలువరించడమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారు.
 
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ నోట్ ముసాయిదా సిద్ధమైందని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే కొద్దిరోజుల కిందట ప్రకటించడం తెలిసిందే. అందులోని అంశాలన్నింటినీ రాష్ట్ర ముఖ్యులకు ఇప్పటికే తెలియజేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అంతేగాక సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతతో పాటు, ‘విభజన ప్రక్రియను మీరే ముందుకు తీసుకెళ్లాలి’ అన్న అధిష్టానం ఆదేశాల వల్లే సదరు నేతలు తమకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అంతేగాక, తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు పీసీసీ చీఫ్ బొత్స వర్గీయులు పలువురు విభజనకు అనుకూలంగానే ఓటేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మరికొందరు సీమాంధ్ర ఎమ్మెల్యేలను కూడా అందుకు ఒప్పించేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం!
 
తెలంగాణ అంశంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జూలై 7న రోడ్‌మ్యాప్‌లతో ఢిల్లీకి వెళ్లడం, సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన కోర్‌కమిటీ భేటీలో పాల్గొనడం తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర హోం శాఖ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆ ముగ్గురు నేతలకు అదే రోజున పెద్దలు అందజేశారని తెలుస్తోంది. అనంతరం జూలై 30 వ తేదీన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదముద్ర వేస్తూ తీర్మానం చేసింది. తర్వాత కొత్త రాష్ట్ర ఏర్పాటు కోసం తీసుకోవలసిన చర్యలకు సంబంధించి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో కేంద్ర హోం శాఖ కొన్ని మార్పులు చేసి మొత్తం ప్రక్రియకు పట్టే గడువును కుదించింది.
 
కొత్త గడువుతో రూపొందించిన ప్రణాళిక కూడా అప్పట్లో మీడియాలో విస్తృతంగా రావడం తెలిసిందే. ‘‘తెలంగాణ విషయంలో తీసుకుంటూ వచ్చిన నిర్ణయాలన్నింటినీ మొదటి నుంచీ ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని ముఖ్య నేతలకు చెబుతూ వస్తున్నాం. తెలంగాణపై అధిష్టానం వైఖరేమిటి, ఎలాంటి నిర్ణయాలు చేయబోతున్నాం, విభజన ప్రక్రియ ఎప్పట్లోగా ముగుస్తుంది వంటి అన్ని వివరాలనూ అధిష్టానం పెద్దలు వారికి ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు’’ అని ఏఐసీసీలోని అత్యున్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఏ నిర్ణయానికైనా కట్ట్టుబడి ఉంటామని అప్పుడు వారంతా చెప్పారు. వారే గనుక ఆ రోజే వద్దని చెప్పి ఉంటే విభజన నిర్ణయం జరిగేదే కాదు. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు తలెత్తాయని ఇప్పుడు పార్టీ పెద్దలను నిందించి ప్రయోజనం లేదు’’ అని పేర్కొన్నాయి.
 
 తీర్మానాన్ని అడ్డుకుంటామంటూ...
 నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందాలన్న నిబంధనేమీ లేదు. ఈ నేపథ్యంలో తీర్మానం వీగేలా చేద్దామన్న కాంగ్రెస్ ముఖ్యుల మాటలన్నీ కాలయాపన ఎత్తుగడలేనన్న వాదన పార్టీలోనే గట్టిగా విన్పిస్తోంది. సరిగ్గా దీన్నే సాకుగా చూపుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా కిరణ్ ఇంతకాలంగా వారిస్తూ వస్తున్నారు. వారు రాజీనామాలు చేస్తే మొత్తం వ్యవహారం గందరగోళంలో పడటంతో పాటు రాష్ట్రపతి పాలన అనివార్యమవుతుందని, సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలా జరిగితే కాంగ్రెస్ ప్రతిష్ట జాతీయ స్థాయిలో దెబ్బ తింటుందని, సీడబ్ల్యూసీ తీర్మానానికి ఆ పార్టీ నేతలే కట్టుబడిలేరన్న అప్రతిష్ట వస్తుందని, దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని ఏఐసీసీ పెద్దల్లో ఆందోళన నెలకొంది.
 
 అందుకే విభజనపై అసెంబ్లీ అభిప్రాయ సేకరణ ప్రక్రియను సాఫీగా కొనసాగించాల్సిన బాధ్యతను వారు కిరణ్‌పైనే పెట్టారు. ఆయన మొదట్లో కొంత బెట్టు చేసినా తర్వాత అందుకు అంగీకరించినట్టు సమాచారం. కేబినెట్ నోట్ రూపొందకముందే సమైక్య రాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ విసృ్తత స్థాయి సమావేశం గత శుక్రవారం (20వ తేదీ) తీర్మానాన్ని కూడా ఆమోదించడం తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా అధిష్టానం గేమ్ ప్లాన్‌కు అనుగుణంగా నడుస్తున్న కారణంగానే దానిపై వారెవరూ స్పందించలేదు.
 
 3వ అధికరణ ఏం చెబుతోందంటే...
 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్రాల్లో ప్రాంతాల, సరిహద్దు, పేర్ల మార్పు చేయాలంటే పార్లమెంట్ చట్టం ద్వారానే చేయాలి...
 ఎ. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం, ఉన్న రెండు, మూడు రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని చేయడం, రాష్ట్రంలోని ప్రాంతాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం.
 బి. రాష్ట్రం విస్తీర్ణం పెంచడం
 సి. రాష్ట్రం విస్తీర్ణం తగ్గించడం
 డి. రాష్ట్రం సరిహద్దులు మార్చడం
 ఈ. రాష్ట్రం పేరు మార్చడం చేయాలంటే... రాష్ట్రపతి సిఫార్సు ఆధారంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. బిల్లు ప్రభావం రాష్ట్రాల్లోని ఏదైనా ప్రాంతం, సరిహద్దులు, పేరు మార్పులపై ఉంటే బిల్లును ఆ రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతి పంపి, నిర్దిష్ట గడువు లోపు అభిప్రాయాలు కోరవచ్చు. సదరు గడువును రాష్ట్రపతి పొడిగించవచ్చు.
 
నోట్‌పై నోరు మెదపని నేతలు
విభజనపై కేబినెట్ ముసాయిదా నోట్‌లోని కీలకాంశాలన్నీ రాష్ట్ర ముఖ్యులు పలువురికి తెలిసినా మౌనం పాటిస్తుండటానికి పలు కారణాలున్నాయి. తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయడం, అందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేయడం, ప్రజాప్రతినిధులెవరూ రాజీనామా చేసి ఆటంకం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివన్నీ అందులో భాగం. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తే ప్రక్రియను ముందుకు తీసుకుపోవడంలో ఆటంకాలు కలుగుతాయన్న ఆలోచనతో అధిష్టానం ఆదేశాలను వారు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.
 
 విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేశాక రాష్ట్రపతి దాన్ని అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపుతారు. అయితే అభిప్రాయం కోరడమే తప్ప తీర్మానం ఆమోదం పొందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాకపోతే దానికి వ్యతిరేకంగానో, అనుకూలంగానో అసెంబ్లీ అభిప్రాయం మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అలా అసెంబ్లీ అభిప్రాయం కోరిన సమయంలో అసలు అసెంబ్లీయే లేని పరిస్థితి (కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం పడిపోతుంది గనుక) ఉంటే మొత్తం పరిస్థితి మొదటికొస్తుంది. కాబట్టి ఎలాగైనా విభజన ప్రక్రియను సాఫీగా ముందుకు తీసుకెళ్లడమే ముఖ్యమని రాష్ట్ర ముఖ్యులకు అధిష్టానం స్పష్టంగా చెప్పింది.
 
సీమాంధ్ర ఎమ్మెల్యేలతోనూ ‘తెలంగానం’!
మరోవైపు తెలంగాణపై అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ సమయంలో విభజనకు అనుకూలంగా ఉండేలా కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కిరణ్, ఇతర పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని అనుసరించి విభజన ప్రక్రియను సాఫీగా కొనసాగించాల్సిన బాధ్యతను అధిష్టానం తనపై పెట్టినందున కిరణ్ ఆ దిశగా ముందుకు కదులుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్రియ సాఫీగా సాగేట్టు చూస్తే భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయనకు చెప్పినట్టు కూడా కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది.
 
‘‘విభజనకు అనుగుణంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం వైపు నిల్చేలా సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కిరణ్ తదితరులు చర్చలు సాగిస్తుండటం నిజమే. బొత్స ఇప్పటికే తాను విభజనకు అనుకూలమని ప్రకటించారు. ఆయన వర్గంగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలు విభజనకే ఓటు వేస్తారు. వారితో పాటు మరికొందరు సీమాంధ్ర ఎమ్మెల్యేలను కూడా ఆ దిశగా పార్టీ నేతలు అంగీకరింపజేస్తున్నారు. దాదాపు 30 మంది దాకా విభజన కు అనుకూలంగా ఉండనున్నారు’’అని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు జిల్లాలవారీగా విశ్లేషణ చేస్తూ వివరించారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement