తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది: ఎస్.జైపాల్‌రెడ్డి
నిర్మల్ సభలో కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి
మునగాల, భద్రాచలంలు తెలంగాణవే..
సమన్యాయం నిర్వచనం ఏంటీ.. బాబూ..
విలీనంపై కేసీఆర్‌స్పష్టత ఇవ్వాలి
సాక్షి ప్రతినిది, ఆదిలాబాద్ : దేశంలో 29వ రాష్ర్టంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా రాష్ట్ర విభజన ఆగదని కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. 2014 నూతన సంవత్సరం వేడుకలు కొత్త రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు. 1950 నుంచి 2013 వరకు సుదీర్ఘ ఉద్యమాలు జరిగాయని, అయితే దేశంలో 29 రాష్ట్రం గా తెలంగాణ ఏర్పడటం చరిత్రాత్మక ఘటన అని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో బుధవారం సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సభ జరిగింది. అఖిలభారత కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రామచంద్ర కుంతియా పరిశీలకులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘దేశానికి స్వరాజ్యం వచ్చి 60 యేళ్లు గడుస్తుంది. అనేక రాష్ట్రాలు వాటి ఏర్పాటుకు ఉద్యమాలు జరిగాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1953నుంచి 2013 వరకు ఉద్యమం జరుగుతూనే ఉంది’ అని చెప్పారు. దేశస్వాంత్య్రం కోసం ఎంతటి ఉద్యమం జరిగిందో అదే మాదిరిగా ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరగడం చరిత్రలో నిలుస్తుందన్నారు. ఆనాటి కొండా వెంకట్‌రెడ్డి నుంచి కొండా లక్ష్మణ్‌బాపూజీ వరకు అనేక మంది తెలంగాణ కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారి త్యాగాలు మరువలేమన్నారు. సంకీర్ణయుగంలో తెలంగాణ పై సోనియాగాంధీ సాహసోపేత నిర్ణయం తీసుకు న్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు.
సోనియా మనస్సు వెన్నలాంటిదని, నిర్ణయం మాత్రం వజ్రసంకల్పం వంటిదని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు పెట్టండి సమర్ధిస్తామంటూ చంద్రబాబు అసెంబ్లీలో అవహేళన చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అడుగుతున్న సమన్యాయం అనే బ్రహ్మపదార్థానికి నిర్వచనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని, అసెంబ్లీ వ్యతిరేకించినా పార్లమెంట్‌కు ఉన్న విశేషాధికారంతో బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నదీ జలాలపై మాట్లాడుతున్నారని, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయం కంటే ముందే నది ఉందా.. లేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నది ఏర్పడిందో తెలుపాల న్నారు. హైదరాబాద్‌పై స్పష్టత అడుగుతున్నట్లే, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విలీనంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు కొమురంభీం ఆదిలాబాద్ జిల్లాగా పేరు పెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.భద్రాచలం, మునగాల ప్రాంతాలు తెలంగాణలో అంతర్భాగమన్నారు.
సీఎం నివేదికను ఎవరూ పట్టించుకోరూ..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కిరణ్ నివేదిక పంపడం శోచనీయమని, ఆనివేదికను ఎవరూ పట్టించుకోరని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటో లేకుండా నిర్వహించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్రుల భద్రతకు ఎక్కడ ఇబ్బంది కలిగిందో చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు సవాల్ విసిరారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని తీర్మానం
సీడబ్ల్యుసీ, యూపీఏ సమన్వయకమిటీ తీర్మానించిన విధంగా కేంద్ర కేబినేట్ ఆమోదించిన ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని ప్రధానికి, సోనియాకు విన్నవించాలని సభ తీర్మానించింది. సమావేశంలో మంత్రులు రాంరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, సారయ్య, సుదర్శన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌అనిల్, ఎంపీలు మధుయాష్కీ, రాజయ్య, ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్ రెడ్డి, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, సీనియర్ నేతలు పాల్వాయి గోవర్దన్, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినమ్రంగా ప్రార్థిస్తున్నా.. బిల్లుకు సహకరించండి
‘ఈ నెల 26న అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వసుంది.. సీమాంధ్ర నేతలారా మీకు వినమ్రంగా నమస్కరిస్తున్నా బిల్లుకు సహకరించండి.. ’ అంటూ కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కృతజ్ఞత సభలో జైపాల్‌రెడ్డిని ఎమ్మెల్యే మహెశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించి కత్తిని బహుకరించినప్పుడు ‘ నేను కత్తులు దూసే వాడిని కాదు... గాంధేయవాదిని, సీమాంధ్ర నేతలు సుహృద్భావ వాతావరణంలో విడిపోయేందుకు సహకరించాలి’ అని కోరారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్లే నేడు జాతీయ పార్టీలన్నీ తెలంగాణను సమర్ధిస్తున్నాయని చెప్పారు. సీపీఐ తన నిర్ణయాన్ని వెల్లడించడం అభినందనీయమని, హైదరాబాద్‌పై ఎంఐఎం తీసుకున్న అభిప్రాయాన్ని అభినందిస్తున్నామన్నారు.