మూడు వారాల్లో తెలంగాణ: జైపాల్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడతాయి: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి
గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది
వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనే
సమయం చాలుతుంది.. బీజేపీ మద్దతిస్తుంది
కిరణ్‌ది పనికిరాని తొండి తీర్మానం
దానిపై స్పీకర్‌ది తప్పుడు నిర్ణయం
పార్లమెంటుకు కళ్లు కూడా ఉన్నాయ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... ఈ రెండూ ఫిబ్రవరి మూడో వారాంతానికల్లా ఏర్పడడం ఖాయమని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపాలన్న సీఎం కిరణ్ తీర్మానాన్ని తొండి తీర్మానంగా అభివర్ణించారు. దాన్ని ఒక ప్రహసనంగా కొట్టిపారేశారు. ఈ విషయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ప్రిసైడింగ్ అధికారులకు దురుద్దేశాలు ఆపాదించను. వాళ్లూ మానవమాత్రులే. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు’ అని అన్నారు. ‘‘ఆ తీర్మానాన్ని అసలు సభ ఏకగ్రీవంగా ఆమోదించిందా? మన లోకంలో మనం నివసిస్తున్నాం.
భారత పార్లమెంటుకు చెవులు మాత్రమే కాదు, కళ్లు కూడా ఉన్నాయి’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘తాము నిరోధించామంటూ కొందరు గొప్పలు చెప్పుకునేందుకు తప్ప అసెంబ్లీ తీర్మానం దేనికీ ఉపయోగపడదు. బిల్లులో భాగంగా ఆమోదిస్తే ఆ తీర్మానానికి రాజ్యాంగ విలువ ఉండకపోయినా రాజకీయ విలువైనా ఉండేది’’ అన్నారు. జైపాల్ శుక్రవారం సాయంత్రం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తామంతా ఉన్నామని, తెలంగాణ ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడిన అంశాలు ఆయన మాటల్లోనే...
తీర్మానం.. ఓ ప్రహసనం: ‘‘తీర్మానం పేరుతో రాష్ట్ర అసెంబ్లీలో జరిగినదంతా ఒక ప్రహసనంలా ఉంది తప్ప తెలుగు ప్రజల ప్రతిష్టను, అసెంబ్లీ సంప్రదాయాన్ని పెంచేలా లేదు. అంత వివాదగ్రస్తమైన తీర్మానాన్ని ఏకపక్షంగా మూజువాణితో సెకన్ల వ్యవధిలో ఆమోదించడం అవాంఛనీయం, తప్పుడు విధానం. మండలిలో, అసెంబ్లీలో జరిగిన పరిణామాలు నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. పార్లమెంటు సర్వసత్తాక అధికారాన్ని ఈ తప్పుడు తీర్మానం ద్వారా తగ్గించామనే భ్రమ సృష్టిస్తున్నారు. దాంట్లో ఏ మాత్రం పస లేదు. పార్లమెంటు అధికారం వీసమంతా కూడా తగ్గదు. బిల్లును రాష్ట్రపతి పంపింది శాసనసభ అభిప్రాయాలు తెలుసుకునేందుకే తప్ప 77వ నిబంధన కింద అభిప్రాయం తెలపాలనో, తీర్మానం చేయాలనో కాదు. పైగా 77వ నిబంధన కింద ఏ తీర్మానాన్ని రూపొందించినా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే పంపిస్తారు. అంతే తప్ప రాష్ట్రపతికి పంపే అధికారం శాసనసభకు లేదు. ఆ తీర్మానాన్ని చూసి సీమాంధ్ర మిత్రుల్లో భ్రమలు పెరగకూడదు. తెలంగాణలో భయాలుండాల్సిన అవసరమూ లేదు’’
సభ ఆమోదం ఖాయం
‘‘కావాల్సిన సవరణలతో పార్లమెంటులో బిల్లు యథావిధిగా ఆమోదం పొందుతుంది. ఫిబ్రవరి మూడో వారం చివరికల్లా తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడతాయి. ఇది నిస్సందేహం. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రెండు రాష్ట్రాలు ఏర్పడతాయి. నాకున్న అవగాహన ప్రకారం అందుకు సమయం కూడా సరిపోతుంది. బిల్లు పాసవడమే కాదు.. గెజిట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. రాష్ట్రం ఏర్పడుతుంది. అందుకు ఇంత సమయం పడుతుందంటూ ఎక్కడా లేదు. గత దృష్టాంతాలను బట్టి 6 నుంచి 85 రోజుల వరకు నోటిఫికేషన్ పీరియడ్ ఉంది. గుజరాత్‌కు 6 రోజులుంది. వాళ్లు సిటీ మార్చారు. ఇక్కడ ఆ అవసరం కూడా లేదు. ఆఫీసులు మార్చాల్సిన పనిలేదు. వాటిలో రూములు మార్చితే సరిపోతుంది. తెలంగాణ బిల్లును పార్లమెంటులో వెంటనే పెడతారని నా వ్యక్తిగత అంచనా. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడతాయని అనుకుంటున్నా. తెలంగాణ ఏర్పాటు కేవలం కాంగ్రెస్ నిర్ణయం కాదు. ముందు బీజేపీ, తరవాత బీఎస్సీ తీసుకున్న నిర్ణయం. తుదకు మాత్రమే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణను సమర్థించిన చంద్రబాబుకు, వైఎస్సార్‌సీపీకి బాధ్యత లేదా?’’
పార్లమెంటే సుప్రీం
మూడో అధికరణం ప్రకారం పార్లమెంటుకు సర్వసత్తాక అధికారముంది. రాష్ట్రాల అధికారాలివీ, కేంద్రం అధికారాలివీ, ఉమ్మడి అధికారాలివీ అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అయితే ఆ జాబితాలను కూడా కాదని చట్టం చేసే అధికారాన్ని పార్లమెంటుకు 3వ అధికరణం ఇచ్చింది. బిల్లుపై బీజేపీ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 3వ అధికరణ కింద ఉభయ సభలు ఒక బిల్లు రూపొందించాక అందులో కోర్టులు అంత సులువుగా జోక్యం చేసుకుంటాయనుకోను. సాంకేతిక కారణాలతో బిల్లును ఆపరు (ఆర్థిక ప్రతిపాదన పంపలేదనే వాదనపై స్పందిస్తూ)’’
సీమాంధ్రులవి ఏకపక్ష భావనలు
‘‘సీమాంధ్ర నేతలు ఒక్క విషయం ఆలోచించుకోవాలి. తెలుగు జాతి సమైక్యతను కాపాడతామంటున్నారు. తెలుగు జాతి తమిళనాడులో 25-35 శాతం ఉంది. బెంగళూరు నగరంలో 35-45 శాతం ఉంది. బళ్లారిలో 90 శాతం ఉంది. ఒడిషాలో జిల్లాలకు జిల్లాలే తెలుగు వారున్నారు. సీమాంధ్ర మిత్రులు ఏకపక్షంగా ఐక్యత కోరడంలోని అసహజత్వాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు. ఇది అస్వభావికం. ఇంత విభజన తర్వాత ఈ దశలో ఎలా కలిసుంటారు?