
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో పది పన్నెండు స్థానాలు వస్తే అదే గొప్ప అని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. అసెంబ్లీ రద్దు అనంతరం టీఆర్‌ఎస్ గ్రాఫ్ పతనం దిశగా పయనిస్తోందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నేరవేర్చకుండా 9 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో టీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైందన్నారు. సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల పాలనలో జరిగిన ప్రగతి అంకెల గారడీ అని అభివర్ణించారు.
ప్రగతి నివేదన సభకు లక్ష ట్రాక్టర్లలో జన సమీకరణ చేపట్టగా.. సగం ఖాళీ ట్రాక్టర్లే వచ్చాయని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు చేసిన వాగ్దానాలను నేరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఓటమి భయంతో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను టీఆర్‌ఎస్ నేతలు వేధిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ కక్ష సాధింపులను వడ్డీతో సహా వసూలు చేయడం ఖాయమని మల్లు రవి హెచ్చరించారు.