
సాక్షి, హైదరాబాద్: జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మాజీ ఎంపీ మల్లురవి స్పష్టం చేశారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. టీపీసీసీ ప్రతినిధి చరణ్‌కౌశిక్ యాదవ్‌తో కలసి మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేంద్రంలో, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తేవాలన్న సంకల్పంతోనే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారని, ఈ పాదయాత్ర ద్వారా దేశంలో చెలరేగుతున్న హింస, బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలపై ఆయన సమరశంఖం పూరించారని చెప్పారు. తెలంగాణలో జరిగిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మల్లు రవి వెల్లడించారు.