' చిరంజీవికి అంత సీన్ లేదు'
ఉద్యోగులు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని చెప్పే అర్హత కేంద్రమంత్రి చిరంజీవికి లేదని ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు చెప్పారు. ‘‘నియోజకవర్గం అంటూ లేని నేత చిరంజీవి. అలాంటి వ్యక్తికి మా రాజీనామాల గురించి అడిగే అర్హత ఎక్కడిది?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎన్జీవో భవన్‌లో ఆయన మీడియూతో వూట్లాడుతూ.. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన రెండో రోజే లక్షల మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని, అవసరమైతే చలో ఢిల్లీ, రాష్ట్ర దిగ్బంధం కార్యక్రమాలను కూడా నిర్వహించే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ నెల 7న గుంటూరులో అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.
అఖిలపక్షాన్ని నిర్వహించి రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. 5న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా శిబిరాలు, డిసెంబర్ 9న తెలుగుజాతి విద్రోహ దినం పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర విభజనపై అవసరమైతే టీఆర్‌ఎస్ పార్టీతో కూడా భేటీ అవుతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకే తాము వ్యతిరేకమైనందున రాయల తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించే ప్రసక్తే లేదని అశోక్‌బాబు చెప్పారు.