తీర్పు ఎలా ఉన్నా.. సమ్మె మరింత ఉధృతం
తీర్పు ఎలా ఉన్నా.. సమ్మె మరింత ఉధృతం
Published Mon, Sep 16 2013 1:48 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సమ్మెపై సోమవారం హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా, సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించి తీరాలని ఏపీఎన్జీవోలు నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశం ఆదివారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగింది. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగర శాఖ నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల నాయకుల సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. హైకోర్టు తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా వచ్చినా, సమ్మె కొనసాగించాల్సిందేనని సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయడ్డారు. తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై సమావేశంలో చర్చించారు. ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో మాట్లాడేందుకు తమకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబును ఏపీఎన్జీవో జిల్లా నేతలు నిలదీశారు.
నేడు జేఏసీ భేటీ కీలకం: ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’లో భాగస్వామ్య సంఘాలతో కూడిన జేఏసీ సమావేశం సోమవారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరగనుంది. సమ్మె కొనసాగింపుపై భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు.
సమ్మె కొనసాగిస్తాం: ఆర్టీసీ ఈయూ సీమాంధ్ర పోరాట కమిటీ
నిరవధిక సమ్మెను కొనసాగించాలని ఆర్టీసీ ఈయూ సీమాంధ్ర పోరాట కమిటీ నిర్ణయించింది. కమిటీ కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. కమిటీ చైర్మన్ సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, కన్వీనర్లు దామోదరావు, రాజేంద్రప్రసాద్, 13 జిల్లాలకు చెందిన కార్యవర్గ సభ్యులు భేటీలో పాల్గొన్నారు. సోమవారం జరగనున్న ఉద్యోగులు, కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు.
వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు: ఎన్‌ఎంయూ
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకొనే వరకు సమ్మె నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఎన్‌ఎంయూ సీమాంధ్ర నేతలు ప్రకటించారు. ఎన్‌ఎంయూ జోనల్ కార్యదర్శులు రమణారెడ్డి, చంద్రయ్య, మోహన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులకు ప్రస్తుతం ఉన్న అదనపు ప్రయోజనాలను కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీన ప్రతిపాదనపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement