Save Andhra Paradesh
-
ఉద్యమాన్ని నీరుగార్చేందుకే.. : ‘సేవ్ ఆంధ్రప్రదేశ్... సేవ్ కాంగ్రెస్’
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఆంతర్యమదే కాంగ్రెస్ వర్గాల స్పష్టీకరణ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ విభజన అనుకూల చర్చకు యత్నం అధిష్టానం వద్ద క్రెడిట్ కొట్టేయడానికి ఆధిపత్య పోరు షురూ సీఎం కిరణ్‌కు చెక్ పెట్టేందుకు తెరపైకి చిరంజీవిని తెచ్చారు! సాక్షి, హైదరాబాద్: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్... సేవ్ కాంగ్రెస్’ - కాంగ్రెస్ కొత్తగా ఎత్తుకుంటున్న నినాదమిది. సమైక్య ఉద్యమం తీవ్రంగా సాగుతున్న తరుణంలో దాన్ని చల్లార్చి ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ రచిస్తున్న వ్యూహంలో భాగంగా ఈ కొత్త నినాదంతో ముందుకొస్తున్నారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీ పెద్దలు తెరవెనుక మరో కొత్త నాటకానికి తెరతీస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైక్యాంధ్రప్రదేశ్ అని కాకుండా ప్రజల్లోకి వెళ్లేందుకు వారు ఎంచుకున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంలోనే సమైక్య వ్యతిరేక భావన దాగి ఉందని చెప్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా సీమాంధ్రను ఆంధ్రప్రదేశ్‌గానే పరిగణిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానించిందని, అక్కడి సమస్యలను తీర్చి దాన్ని పరిరక్షించాలన్నదే కాంగ్రెస్ నేతల కొత్త నినాదం ఆంతర్యమని తేలుతోంది. మంగళవారం ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో జరిగిన సీమాంధ్ర మంత్రుల సమావేశం పలురకాల చర్చలకు తావిస్తోంది. సీఎం తీరుపై ఇతర నేతల్లో ఆగ్రహం... రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం తరువాత సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో కాంగ్రెస్ నేతలెవ్వరూ ఆ ప్రాంతంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. పది రోజుల తరువాత… సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదిగా తెరపైకి వచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ కోర్ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాలకు ముందు మౌనంగా ఉండి విభజన వల్ల తలెత్తే సమస్యలంటూ మీడియా ముందు ఏకరువుపెట్టారు. అయితే సీమాంధ్రలో పరిస్థితులు చేజారిపోతుండడంతో అధిష్టానమే ఇలా సీఎంతో మాట్లాడించిందన్న అనుమానాలు ఏర్పడ్డాయి. సమైక్య ఉద్యమం ప్రారంభమై అరవై రోజుల తరువాత కొద్ది రోజుల ముందు సీఎం మళ్లీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కాంగ్రెస్ అధినాయకత్వం వ్యూహాత్మకంగానే సీమాంధ్ర నేతలందరినీ కలుపుకుని ఆ రకంగా మాట్లాడాలని చెప్తే సీఎం ఒక్కరే తానే చాంపియన్ అన్న రీతిలో మాట్లాడటంపై మిగిలిన నేతల్లో ఆగ్రహం తెప్పించింది. వ్యూహాత్మకంగా వ్యవహరించి సీమాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చే విధంగా చూస్తానని అధిష్టానం ముందు చెప్పిన సీఎం ఒక్కడే అధిష్టానం దృష్టిలో పడుతున్నారని గమనించిన నేతలు ఆధిపత్య పోరులో అప్రమత్తమయ్యారు. ఆనం రామనారాయణరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీమాంధ్ర మంత్రులతో గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సమావేశాలు కాంగ్రెస్ పెద్దల తాజా ఆలోచనల మేరకేనని తెలుస్తోంది. చిరంజీవిని ఈ సమావేశాల ద్వారా తెరపైకి తెచ్చి సీఎం కిరణ్‌కు చెక్ పెట్టించడంతో పాటు ‘సేవ్ ఆంధ్రప్రదే శ్ - సేవ్ కాంగ్రెస్’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చన్న ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. సమైక్య ఉద్యమాన్ని చల్లార్చి విభజనకు అనుకూలంగా ఉద్యమకారుల ఆలోచనలు మారేలా కాంగ్రెస్ నేతలు వ్యూహాన్ని అమల్లో పెట్టాలని భావిస్తున్నారు. తమ భేటీ కిరణ్‌కు వ్యతిరేకంగా కాదన్న ఆనం సీఎం కిరణ్‌కు వ్యతిరేకంగా ఈ సమావేశాన్ని పెట్టినట్లు బయట ప్రచారం జరగ్గా మంత్రి ఆనం దాన్ని ఖండించారు. సీఎం ఆలోచనల మేరకే తాము వివిధ సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూపించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో చర్చించే బాధ్యతలను కేంద్రమంత్రి చిరంజీవికి, పీసీసీ అధ్యక్షుడు బొత్సకు అప్పగించినట్లు ఆనం విలేకరులకు చెప్పారు. సీమాంధ్ర మంత్రుల్లో చీలిక... రాష్ట్ర విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయడానికి అధిష్టానం వ్యూహం అమలుచేయటంలో ఆధిపత్య పోరుతో మంత్రుల్లో విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్టు చెప్తున్నారు. మరోవైపు విభజన సమస్యలను లేవనెత్తి వాటిని పరిష్కరించాకనే కేంద్రం ముందుకు వెళ్లాలంటూ అధిష్టానాన్ని ప్రశ్నించిన మాదిరిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో అధిష్టానమే చీలికను ప్రోత్సహిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సీనియర్ మంత్రులను కూడా ఇదే పనిలో దించింది. బొత్స, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి తదితరులు కూడా సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మంత్రులతో మాట్లాడుతూ వారిని తమ వర్గంలోకి తెచ్చుకుంటున్నారు. సీఎం అనుకూల వర్గంగా ముద్రపడ్డ మంత్రి కొండ్రు మురళి కూడా ఆనం నివాసంలో జరిగిన సమావేశానికి హాజరవటం విశేషం. ఇక్కడ సమావేశం జరుగుతున్న సమయంలోనే మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో మరో భేటీ జరిగింది. గంటాతో పాటు మంత్రి శైలజానాథ్, ఎంపీ లగడపాటి ఇందులో పాల్గొన్నారు. దీంతో ఈ రెండు భేటీలపై సీఎం అనుకూల, వ్యతిరేక గ్రూపుల సమావేశంగా మీడియాలో ప్రచారమైంది. అయితే తాము అనుకోకుండా కలిశామని, లగడపాటి కూడా యథాలాపంగా అక్కడికి వచ్చారే తప్ప సమావేశం కావడానికి కానేకాదని ఒక మంత్రి పేర్కొన్నారు. -
తీర్పు ఎలా ఉన్నా.. సమ్మె మరింత ఉధృతం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సమ్మెపై సోమవారం హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా, సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించి తీరాలని ఏపీఎన్జీవోలు నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశం ఆదివారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగింది. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగర శాఖ నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల నాయకుల సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. హైకోర్టు తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా వచ్చినా, సమ్మె కొనసాగించాల్సిందేనని సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయడ్డారు. తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై సమావేశంలో చర్చించారు. ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో మాట్లాడేందుకు తమకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబును ఏపీఎన్జీవో జిల్లా నేతలు నిలదీశారు. నేడు జేఏసీ భేటీ కీలకం: ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’లో భాగస్వామ్య సంఘాలతో కూడిన జేఏసీ సమావేశం సోమవారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరగనుంది. సమ్మె కొనసాగింపుపై భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. సమ్మె కొనసాగిస్తాం: ఆర్టీసీ ఈయూ సీమాంధ్ర పోరాట కమిటీ నిరవధిక సమ్మెను కొనసాగించాలని ఆర్టీసీ ఈయూ సీమాంధ్ర పోరాట కమిటీ నిర్ణయించింది. కమిటీ కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. కమిటీ చైర్మన్ సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, కన్వీనర్లు దామోదరావు, రాజేంద్రప్రసాద్, 13 జిల్లాలకు చెందిన కార్యవర్గ సభ్యులు భేటీలో పాల్గొన్నారు. సోమవారం జరగనున్న ఉద్యోగులు, కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు: ఎన్ఎంయూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకొనే వరకు సమ్మె నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఎన్ఎంయూ సీమాంధ్ర నేతలు ప్రకటించారు. ఎన్ఎంయూ జోనల్ కార్యదర్శులు రమణారెడ్డి, చంద్రయ్య, మోహన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులకు ప్రస్తుతం ఉన్న అదనపు ప్రయోజనాలను కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీన ప్రతిపాదనపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సమైక్యమే లక్ష్యం
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యమే లక్ష్యంగా జిల్లాలో ప్రజలు సమర శంఖారావం పూరిస్తూనే ఉన్నారు. లక్ష్యం వైపు దీక్షగా విశ్రమించకుండా అడుగులు వేస్తున్నారు. శనివారం రాజధానిలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ విజయవంతం కావడంతో ఎన్జీవోలు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఉద్యమాన్ని మరింత పదునెక్కించేందుకు పరుగులు తీస్తున్నారు. నేడు వినాయకచవితి సందర్భంగా విఘ్నేశ్వరుడిని రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వేడుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 40వ రోజు దీక్షలు కొనసాగాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్‌సెంటర్ వద్ద దీక్ష లో కళాకారులు, ఉపాధ్యాయులు కూర్చున్నారు. ఆర్టీసీ, జెడ్పీ , ఉపాధ్యాల సంఘాల దీక్షలూ కొనసాగాయి. భీమవరం ప్రకాశం చౌక్‌లో దీక్షలో ఎన్జీవోలు, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో ల్యాబ్‌టెక్నీషియన్స్ రిలే నిరహార దీక్షల్లో పాల్గొనగా ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి వారికి సంఘీభావం తెలిపారు. ఇక్కడ మూడు రోజులుగా ఆమరణ నిరహారదీక్ష చేస్తున్న గృహిణి యరశింగు శిరీష దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆచంట వేమవరంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కోదండరామ్, హరీష్‌రావు, కేసీఆర్‌లకు పిండ ప్రదానం చేశారు. పెనుగొండ దీక్షలో ఏఎంసీ పాలకవర్గం పాల్గొంది. తణుకు నిరాహారదీక్షలో ఐఎంఏ సభ్యులైన డాక్టర్లు పాల్గొన్నారు. అత్తిలిలో గంగిరెద్దులతో విన్యాసాలు చేయించారు. తాడేపల్లిగూడెం పాతూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిడదవోలులో ఎన్జీవోలు సమైక్యాంధ్ర పాటలు పాడారు. భీమడోలు, గణపవరం ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరాలను ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మేల్యే కొండ్రెడ్డి విశ్వనాథం సందర్శించి మద్దతు పలికారు. గోపాలపురంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మానవహారం, ర్యాలీ నిర్వహించారు. నల్లజర్ల మండలం నబీపేటలో గ్రామస్తులు అమ్మవారికి పూజలు చేశారు. పోతవరం సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చే శారు. దూబచర్లలో రిలే దీక్షలో వికలాంగులు కూర్చున్నారు. బుట్టాయిగూడెంలో జేఏసీ దీక్షలో ఉపాధ్యాయులు పాల్గొ పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. కొయ్యలగూడెంలో జాతీయ నాయకుల విగ్రహాలను విద్యార్థులు శుభ్రం చేశారు. కొవ్వూరులో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో హోమాలు చేశారు. తాళ్లపూడిలో సమైక్యాంధ్రకు మద్దతుగా క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. నరసాపురం సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో రిలే దీక్షలో పట్టణ కృష్ణ యాదవ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు కర్రి నూకరాజు, జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బమ్మిడి అప్పారావు, వైఎస్సార్ సీపీ నేత రేకా ప్రసాద్ నాయకత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ఆందోళనలో రంగినీడి శ్రీరామకృష్ణ అనే వ్యక్తి దేశభక్తి పాటలకు అనుగుణంగా రోడ్డుపై డాన్స్ చేశాడు. వైఎస్ జగన్, షర్మిలకు మద్దతుగా దీక్షలు సమైక్యాంధ్ర పరిరక్షణకు కంకణ బద్ధుైలైన వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే దీక్షలో ఆదివారం పెంటపాడు మండలం అలంపురం గ్రామానికి చెందిన పార్టీ శ్రేణు లు పాల్గొన్నారు. నరసాపురం బస్టాండ్ సెంటర్లో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం చిన్నారులు రిలే దీక్ష చేశారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆదివారం నాటి దీక్షలను ప్రారంభించారు -
విభజనాగ్రహం
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు కదం తొక్కుతున్నారు. ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మెడలు వంచి... రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని స్పష్టీకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ విజయవంతం కావడంతో జిల్లాలోని సమైక్యవాదుల్లో నూతనోత్సాహం పెల్లుబుకుతోంది. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ చేశారు.జేఎన్టీయూ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక టవర్‌క్లాక్ వద్ద మానవహారం నిర్మించారు. జూనియర్ కళాశాలల అధ్యాపకులు హెల్మెట్లుధరించి వినూత్న నిరసన ప్రదర్శన, టవర్‌క్లాక్ వద్ద మానవహారం చేపట్టారు. లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గొంతుకు ఉరి తాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. ధర్మవరంలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ముదిగుబ్బలో ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. హిందూపురంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వివిధ వేషధారణలతో ప్రదర్శన, ఉపాధ్యాయుల ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి కళాశాల అధ్యాపకులు కాళ్లు కట్టేసుకుని గెంతుతూ నిరసన తెలిపారు. లేపాక్షి బంద్ విజయవంతమైంది. లేపాక్షిలో ఈ నెల 12న తలపెట్టిన ‘లేపాక్షి బసవన్న రంకె’ లక్ష జనగర్జన సభ ఏర్పాట్లను స్థానిక తహశీల్దార్, సీఐ, జేఏసీ కమిటీ సభ్యులు పరిశీలించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ నేత జక్కల ఆదిశేషు చేపట్టిన పాదయాత్ర కదిరిలో ముగిసింది. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేత వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లా నాయకులు హాజరయ్యారు. సమైక్య దళిత గర్జనతో కళ్యాణదుర్గం హోరెత్తింది. సీమాంధ్రుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మందకృష్ణ దిష్టిబొమ్మను ఎంఆర్పీఎస్ నాయకులు దహనం చేశారు. సీమాంధ్రలో అడుగుపెడితే తరిమి కొడతామని మందకృష్ణను హెచ్చరించారు. పెనుకొండలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు మద్దతుగా పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. రొద్దంలో వృద్ధులు రిలే దీక్షలు చేపట్టారు. గోరంట్లలో విశ్రాంత ఉద్యోగులు ర్యాలీ చేశారు. రాయదుర్గంలో జర్నలిస్టుల 48 గంటల దీక్ష కొనసాగుతోంది. ఉరవకొండలో ముస్లింలు భారీ ర్యాలీ, రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. రాష్ట్ర విభజనతో తీవ్ర వేదనకు లోనైన ధర్మవరం పట్టణానికి చెందిన కల్లిటి శ్రీనివాసులు (49) శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకునేవాడని, నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారని స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపారు. సీమాంధ్ర న్యాయవాదులపై దాడికి నిరసనగా భగ్గుమన్న ‘అనంత’ హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై దాడిని ఖండిస్తూ శనివారం జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు, సమైక్యవాదులు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ఉద్యోగులు రాస్తారోకో చేశారు. గుంతకల్లులో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కసాపురం రహదారిపై రాస్తారోకో చేపట్టారు. గుత్తిలోని 44వ జాతీయ రహదారిపై సమైక్యవాదులు నల్లజెండాలతో రాస్తారోకో నిర్వహించారు. న్యాయవాదులు హిందూపురంలో రాస్తారోకో చేపట్టి, తెలంగాణ న్యాయవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కదిరిలో మానవహారం నిర్మించారు. కళ్యాణదుర్గంలో రాస్తారోకో చేసి... స్థానిక అక్కమాంబ కొండపై సమైక్యాంధ్ర బెలూన్ను ఏర్పాటు చేశారు. మడకశిరలో మౌన ప్రదర్శన నిర్వహించారు. పెనుకొండలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. తాడిపత్రిలో సమైక్యవాదులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. -
ఓట్లేసింది విభ జనకు కాదు
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సులో అశోక్‌బాబు స్పష్టీకరణ రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించడం లేదు ఇది ఆరంభం మాత్రమే.. విభజనపై ముందుకు వెళ్తే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ విభజన జరిగితే నష్టపోయేది విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులే అడ్డుకుంటామన్నా తెలంగాణవాదుల వ్యాఖ్యలే సభను విజయవంతం చేశాయి సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజనను నాలుగైదు పార్టీలు కలిసి నిర్ణయించే పరిస్థితి వచ్చింది. అయినా రాజకీయ పార్టీలను, నాయకులను ఓట్లేసి ఎన్నుకునేది ప్రజలను పాలించడానికి కానీ, విభజించడానికి కాదు. విభజన చేయాల్సి వస్తే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే దానిని ప్రజలు ఆమోదించి ఉండేవారు. అలాకాకుండా రాజకీయ లబ్ధి కోసం, అధికారమే పరమావధిగా తీసుకున్నందునే ప్రజలు అంగీకరించడం లేదు. ఈ రాష్ట్రం ఇలానే ఉంటుంది... ఉండాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్‌లో సమైక్యవాదాన్ని వినిపించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభ ప్రారంభం మాత్రమే. విభజనపై కేంద్రం ముందుకెళితే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మిలియన్ మార్చ్ నిర్వహించి తీరుతాం. ఇది బెదిరింపో.. ఇంకోటో కాదు.. మా గళం చెప్పుకునేందుకే.’’ అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు ప్రసంగిస్తూ.... ‘‘రాష్ట్రం విడిపోవాలా.. కలిసుండాలా అనేది మా చేతుల్లోనే ఉంది. రాజకీయ నాయకుల చేతుల్లో లేదు. ప్రజల నిర్ణయాలను కాదంటే ప్రపంచంలో ఏ పార్టీ మనుగడ సాగించలేదు. ప్రజల ఆమోదం లేనిదే విభజనపై కేంద్రం వెనక్కు వెళ్లలేకపోయినా.. ముందుకు మాత్రం వెళ్లలేదు. రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యంగా మూడువర్గాలు నష్టపోతాయి. విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులే ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. వారి కోసమే ఈ సభను నిర్వహించాం తప్ప ఎవరికో వ్యతిరేకంగా కాదు. రాజకీయ లబ్ధి కోసం కానే కాదు. మాకు రాజకీయ నిర్ణయం తీసుకునే శక్తి ఉంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయ పార్టీలు కిందామీదా అవుతాయి. రాజకీయ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే హైదరాబాద్ నడిగడ్డపై సభ నిర్వహించాం. ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారు.. వేతనాలు లేవు. అయినా ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఈ సభకు హాజరయ్యారు. సభను అడ్డుకుంటాం... ఆపేస్తాం... తంతాం అని తెలంగాణవాదులు చేసిన వ్యాఖ్యలే ఈ సభ పెద్దయెత్తున విజయవంతం అవడానికి కారణమయ్యాయి. సమస్యను ఇరువర్గాలు కూర్చుని పరిష్కరించుకోవాలే తప్ప బెదిరిస్తే కుదరదు. ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఎప్పుడు ఆగిపోతుందో, ఎటు వెళుతుందనే దానిపై ఇప్పుడే చెప్పలేము. ఈనెల 16 తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో ఆరులక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. విడిపోయిన తర్వాత వారికి పింఛన్లు ఇచ్చే విషయంలో సరైన మార్గదర్శకాలు లేవు. విడిపోయిన రాష్ట్రాల్లో అనేక కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా అమల్లో ఉన్న జోనల్ వ్యవస్థను ఏం చేస్తారు? నీళ్లు, కరెంటు లాంటి అనేక సమస్యలు రాష్ట్ర విభజనతో వస్తాయి’’ అని పేర్కొన్నారు. సభ విజయవంతమైందని అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అశోక్‌బాబు చెప్పారు. సభను శాంతియుతంగా నిర్వహించి, తమ వాదన వినిపించడం ద్వారా లక్ష్యం నెరవేరిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ చెప్పిన మాటలను ఉటంకిస్తూ అశోక్‌బాబు చెప్పిన కథకు మంచి స్పందన వచ్చింది. ‘ గడుసు అబ్బాయికి, అమాయక అమ్మాయికి పెళ్లి చేస్తామని, ఏదైనా ఉపద్రవం వస్తే వీరు విడిపోవచ్చని నెహ్రూ ఆరోజు చెప్పిన మాట వాస్తవమే. ఆ దంపతులిద్దరూ 50 ఏళ్ల పాటు కాపురం చేశారు. వారికి హైదరాబాద్ మహానగరం అనే కొడుకు పుట్టాడు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి ఉద్యోగస్తుడు అయ్యాడు. ఇప్పుడు ఇద్దరికీ స్ఫర్థలొచ్చాయి. గతంలో ఇలాంటి స్ఫర్థలు వచ్చినప్పుడు అత్తగారు లాంటి ఇందిరాగాంధీ పిలిపించి కాపురం చేయాల్సిందేనని చెప్పారు. మీ హైదరాబాద్ అనే మంచి కొడుకు వృద్ధిలోనికి వస్తాడని చెప్పి పంపించారు. ఆ తర్వాత దంపతులిద్దరూ 1975 నుంచి 2003 వరకు హనీమూన్ చేసుకున్నారు.ఈరోజు తెలంగాణలో రాజకీయాలు ముదిరిన తర్వాత.. కాపురం చేయవద్దని చెపితే కేంద్రం కూడా ఆమోదించింది. ఇప్పుడు మీ కొడుకుని, ఆస్తులను తీసుకుని భార్యను వెళ్లిపొమ్మంటున్నారు. గతంలో కూడా విడిపోతాం అన్నారు కాబట్టి విడిపోవాలంటున్నారు. మరి ఇప్పుడు 50 ఏళ్లు కాపురం చేసిన తర్వాత అన్నీ తీసుకుని భార్య వెళ్లిపోతే ఆ ముసలి భర్త ఎక్కడికెళ్లాలి? దీనికి సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు అవుతాం: మురళీకృష్ణ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అవసరమైతే ప్రతి ఉద్యోగి ఒక పొట్టి శ్రీరాములుగా మారుతారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ స్పష్టం చేశారు. సీమాంధ్రలోని పలు ప్రాంతాలు ఒకప్పుడు హైదరాబాద్‌లో భాగమేనని, నిజాం పాలన తర్వాత అవి వేరుపడ్డాయన్నారు. సచివాలయంలో సీమాంధ్రులు అధికంగా ఉన్నారని, ఉద్యోగాలన్నీ వారు తన్నుకుపోయారని ఆరోపిస్తున్నారని, అయితే సచివాలయం, డెరైక్టరేట్లలోని ఉద్యోగాలు ఆరు సూత్రాలు పథకం, 610 జీవో పరిధిలోకి రావన్న సంగతి తెలిసి కూడా తెలంగాణవాదులు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. అవి రాష్ట్రవ్యాప్తంగా వచ్చే పోస్టులని, సీమాంధ్ర ప్రాంతంలోని వారు మొదటినుంచి విద్యాభివృద్దిలో ఉన్నారని, ఈ మధ్య తెలంగాణలోనూ విద్యావంతులు ఎక్కువయ్యారని వివరించారు. వెనుకబాటుతనం, ఉద్యోగాలు, అభివృద్ది, ఆత్మగౌరవం అన్ని నినాదాలు వదిలి ఇప్పుడు స్వయంపాలన అంటూ నినాదం ఎత్తుకున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఈ ప్రాంతం వారికే ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారని, రాష్ట్రం విడిపోతే ఇంకేమైనా ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్లుగా సాగుతోందని అబద్దం అడుతున్నారని 1968 సమయంలో ఐదేళ్లు, ఇప్పుడు 12 ఏళ్లు మాత్రమే ఉద్యమం నడిచిందన్నారు. విభజిస్తే రాష్ట్రం అంధకారమే : శ్రీనివాసరావు రాష్ట్ర విభజన దిశగా కేంద్రం ముందుకు వె ళ్తే రాష్ట్రం అంధకారమవుతుందని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 12 నుంచి తాము విధులకు హాజరుకాబోవడం లేదని, ఈ మేరకు ఇదివరకే నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లను ట్రిప్ చేయబోమని, విధులకు మాత్రం దూరంగా ఉంటామని చెప్పారు. సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణకే ఇస్తున్నామని వివరించారు. 54 శాతం విద్యుత్ తెలంగాణలో, 46 శాతం సీమాంధ్రలో వినియోగిస్తున్నారని, వ్యవసాయానికి 80 శాతం ఉచిత విద్యుత్ తెలంగాణలోనే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సమైక్య ప్రకటన వచ్చేదాకా సమ్మె: ప్రసాద్ ఆర్టీసీ కార్మికులు మొదటిసారి వ్యక్తిగత కారణాల కోసం కాకుండా రాష్ట్రాన్ని విభజించరాదన్న ఏకైక డిమాండుతో 13 జిల్లాల్లోని 123 డిపోల్లో పూర్తిస్థాయిలో సమ్మె చేస్తున్నారని ఎన్ఎంయూ నాయకుడు ప్రసాద్ తెలిపారు. వేతనాలు లేకపోయినా సరే.. రాష్ట్ర విభజన జరగదని ప్రకటన వచ్చే వరకు సమ్మెలో పాల్గొంటామని స్పష్టంచేశారు. విభజన జరిగితే పల్లెవెలుగులు మూతపడి ప్రైవేట్ యాజమాన్యాల దాష్టీకం పెరుగుతుందని వివరించారు. సీమాంధ్రలోని ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. రాజీనామాలు చేయని నేతలది ఏ జాతి: కృష్ణ సాక్షి, హైదరాబాద్: తాము హైదరాబాద్‌కు వస్తున్నప్పుడు రాళ్లు విసిరిన తెలంగాణ వారి మీద పోరాటం చేయడం లేదని, రాష్ట్రాన్ని చీలుస్తామంటున్న కేంద్రం మీదేనని విద్యార్థి నేత కృష్ణయాదవ్ చెప్పారు. 17 మంది ఎంపీలు డిమాండ్ చేస్తేనే తెలంగాణ వస్తుంటే, 25 మంది సీమాంధ్ర ఎంపీలు అడిగితే సమైక్య రాష్ట్రం కొనసాగదా? అని ప్రశ్నించారు. సమైక్య ఉద్యమంలో ఆడ, మగ, హిజ్రాలు పాల్గొంటున్నారని, మరి రాజీనామాలు చేయకుండా, ఉద్యమంలో పాల్గొనకుండా తప్పించుకుంటున్న రాజకీయ నాయకులది ఏ జాతి అని నిలదీశారు. -
సీమాంధ్ర సభలో తెలంగాణ గళం
సిద్దిపేట, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శనివారం నాటి ‘సేవ్ ఏపీ’ సభలో మెదక్ జిల్లా యువకుడు ‘తెలంగానం’ వినిపించాడు. వృత్తి రీత్యా కానిస్టేబుల్ అయినప్పటికీ తన భావ వ్యక్తీకరణతో యావత్ తెలంగాణ సమాజాన్ని ఆకర్శించాడు. అనేక మందిలో స్ఫూర్తిని నింపాడు. అదే సమయంలో తోటి కానిస్టేబుళ్లు, సీమాంధ్రుల చేతిలో చావుదెబ్బ తిన్నాడు. అతడి పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబ సభ్యులు, సహచరులు, తెలంగాణవాదులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అతని సాహసాన్ని జిల్లా వాసులు ప్రశంసిస్తున్నారు. ఒక్క రోజులోనే వెలిగిపోయిన కోహెడ శ్రీనివాస్‌గౌడ్(28) గురించి మరిన్ని వివరాలు ఇలా... బందోబస్తుకు వెళ్లి.. కె.శ్రీనివాస్‌గౌడ్ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గణేశ్ ఉత్సవాల బందోబస్తు కోసం సిద్దిపేట ఆర్మ్డ్ రిజర్వు (ఏఆర్) క్వార్టర్ల నుంచి ఎస్ఐ ఆధ్వర్యంలో 18 మంది కానిస్టేబుళ్లు శుక్రవారం హైదరాబాద్ వెళ్లారు. వారిలో శ్రీనివాస్‌గౌడ్ కూడా ఉన్నారు. పనిలో పనిగా పోలీసు ఉన్నతాధికారులు ఈ ఏఆర్ బలగాలను ఎల్బీ స్టేడియానికి పంపించారు. అక్కడ సభ జరుగుతుండగా శ్రీనివాస్‌గౌడ్ చేతులు పెకైత్తి ‘జై తెలంగాణ’ అంటూ నినదించాడు. పక్కనే ఉన్న మిగతా పోలీసులు, సీమాంధ్రులు ఆయన్ను చితకబాదారు. ఈ సంఘటన టీవీల్లో రావడంతో అందరు చూశారు. ఈ విషయం నిమిషాల్లోనే జిల్లా మొత్తం తెలిపోయింది. తక్షణం అనేక మంది శ్రేయోభిలాషులు, స్నేహితులు స్పందించారు. శ్రీనివాస్‌గౌడ్‌ను కాపాడాలంటూ ప్రజాప్రతినిధులు, నాయకులకు పదే పదే ఫోన్లు చేశారు. ఇతని స్వగ్రామం ఆకారం.. దుబ్బాక మండలం ఆకారం గ్రామవాసి అయిన కె.శ్రీనివాస్‌గౌడ్ పీజీ చేశాడు. ఏఆర్‌లో కానిస్టేబుల్(2442)గా 2009లో చేరాడు. బందోబస్తు, వీఐపీలకు భద్రత, ఇతర విధులు నిర్వర్తిస్తుంటాడు. దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డికి సుమారు 8 నెలలపాటు అంగరక్షకుడిగా పనిచేసి మూడు నెలల కిందటే తిరిగి ఏఆర్‌కు చేరుకున్నాడు. ఆయనకు తల్లి ఎల్లవ్వ, అన్న నర్సాగౌడ్ ఉన్నారు. వివాహంలోనూ ఆదర్శం! శ్రీనివాస్‌గౌడ్ తన స్వగ్రామానికి చెందిన సారిక అనే అమ్మాయిని ఏడాది కిందట ఆదర్శ వివాహం చేసుకున్నాడు. సిద్దిపేటలోని ఏఆర్ క్వార్టర్లలో కాకుండా మెదక్ రోడ్డులోని పాత పోస్టాఫీసు ఏరియాలో నివాసం ఉంటున్నాడు. కిడ్నీలో రాళ్లతో సతమతం... ఇతను మూడు నెలలుగా కిడ్నీలో రాళ్లతో సతమతమవుతున్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో డ్యూటీకి వెళ్లవద్దని ఎంత చెప్పినా... బందోబస్తుకు తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందని సముదాయించాడని అతని భార్య సారిక, అన్న నర్సాగౌడ్‌లు ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు. ‘ఫోన్ చేసి పరామర్శిస్తే... నాకు ఏమీ కాలేదని ఓదార్చాడని, మేమెక్కడ ఎక్కడ టెన్షన్ పడతామేమోనని అలా చెప్పి ఉంటాడని’ సారిక దిగులుగా చెప్పింది. ‘అయ్యో... నా బిడ్డను మస్తు కొట్టిండ్రు.. టీవీలో చూశాను...’ అంటూ తల్లి ఎల్లవ్వ కన్నీటి పర్యంతమైంది. తన సోదరుడు కూడా ఉద్యోగే కదా. అలాంటప్పుడు ఎందుకిలా దౌర్జన్యం చేశారో... అంటూ నర్సాగౌడ్ వాపోయాడు. ‘జై తెలంగాణ’ అంటేనే తంతారా..? అంటూ సిద్దిపేట వాసులు సీమాంధ్ర ఉద్యోగులు, అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. -
సమైక్యవాదాన్ని బలంగా వినిపించాం: ఏపీఎన్జీవోలు
హైదరాబాద్: ఏపిఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సమైక్య సభ విజయవంతం అయిందని ఏపీఎన్జీవోలు పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో తాము సమైక్యవాదాన్ని బలంగా వినిపించామని చెప్పారు. తాము ఏర్పాటుచేసిన ఈ సభ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. విభనపై గత కొన్నిరోజులుగా సాగుతున్న సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. విభజన విషయమై టీఎన్జీవోలతో చర్చలు జరిపేందుకు ఏపీఎన్జీవోలు సిద్ధమేనని చెప్పారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో సదస్సు నిర్వహిస్తే స్వాగతిస్తామని ఏపీఎన్జీవోలు స్పష్టం చేశారు. కాగా, ఏపి ఎన్జీఓల సమైక్య సభకు వ్యతిరేకంగా చేపట్టిన తెలంగాణ బంద్ కూడా విజయవంతమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావులేకుండా ఒక పక్క తెలంగాణ బంద్, మరో పక్క సమైక్యాంధ్ర బహిరంగ సభ ప్రశాంతంగా జరిగిపోయాయి. పోలీసులకు టెన్షన్ తగ్గింది. బహిరంగ సభ మూడు గంటల 20 నిమిషాల సేపు సాగింది. ఉదయం 10 గంటల నుంచి స్టేడియం దగ్గర సందడి మొదలైంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
'సేవ్ ఆంధ్రప్రదేశ్' కు భారీ స్పందన
-
హైదరాబాద్ పరిణామాలపై కేంద్రం కన్ను
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో ఏపీఎన్జీవోలు శనివారం హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో సమైక్య సభ నిర్వహిస్తుండటం.. మరోవైపు దానికి ప్రతిగా అన్నట్లు తెలంగాణ జేఏసీ అదే రోజు తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వటం వంటి పరిణామాల నేపథ్యంలో.. హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. శనివారం రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకోగల పరిణామాల ఆధారంగా కేంద్రం తదుపరి చర్యలు చేపట్టే అవకాశముందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. -
ఎన్జీవోల సభ అనుమతి రద్దుకు హైకోర్టు నో
తెలంగాణ న్యాయవాదుల పిటిషన్ తిరస్కృతి సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు పోలీసులు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలన్న తెలంగాణ న్యాయవాదుల పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది. ఆ మేరకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సభ నిర్వహకులను ఆదేశించింది. సభ నిర్వహణవల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎటువంటి నష్టం చేకూర్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్.బి.స్టేడియంలో 7వ తేదీన ఏపీఎన్జీవోలు నిర్వహించతలపెట్టిన సభకు అనుమతినిస్తూ పోలీసులు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ తెలంగాణ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి, శుక్రవారం ఉదయం ఉత్తర్వులు వెలువరించారు. ఏపీఎన్జీవోల సభను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది గండ్రమోహనరావు న్యాయమూర్తిని కోరగా నిరాకరించారు. అయితే ప్రత్యక్ష ప్రసారాల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్‌జోన్ డీసీపీకి వినతిపత్రం ఇవ్వాలని మోహన్‌రావుకు స్పష్టం చేశారు. ఈ వినతిపత్రంపై 7వ తేదీన ఎన్జీవోల సభ ప్రారంభానికి ముందు నిర్ణయం వెలువరించాల్సి ఉంటుందని డీసీపీని న్యాయమూర్తి ఆదేశించారు. -
పోలీసు పహరాలో హైవేలు
సాక్షి నెట్వర్క్: ఏపీఎన్జీఓలు శనివారం హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ జేఏసీ నాయకులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి 24 గంటల బంద్‌కు పిలుపునివ్వడంతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యేందుకు ఉద్యోగులు విజయవాడ , కర్నూలు, మహబూబ్‌నగర్ వైపుల నుంచి వాహనాల్లో వస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటు హైదరాబాద్‌లో అటు హైదరాబాద్‌కు వచ్చే జాతీయ రహదారుల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులను తెలంగాణవాదులు అడ్డుకోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం వంటి సుదూర నగరాలు, పట్టణాల నుంచి ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయలుదేరారు. వేల సంఖ్యలో ఉద్యోగులు రైళ్ల ద్వారా కూడా రాజధానికి చేరుకునే అవకాశాలున్న దృష్ట్యా బందోబస్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. రాష్ట్ర రాజధానిని ఆంధ్రా ప్రాంతంతో కలిపే జాతీయ రహదారితో పాటు, రెండు ప్రధాన రహదారులు నల్లగొండ జిల్లా గుండా వెళుతుండడంతో జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడ జాతీయ రహదారిపై ఏకంగా 64 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న ప్రతి గ్రామంలో ముగ్గురు పోలీసులతో పికెట్లు ఏర్పాటు చేశారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై వాడపల్లి కృష్ణా నది వంతెన వద్ద, హైదరాబాద్ -మాచర్ల రహదారిపై నాగార్జునసాగర్ కొత్త వంతెన వద్ద కూడా పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. విజయవాడ హైవేలో హయత్‌నగర్ సమీపంలోనూ పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉత్కంఠ..డీజీపీ సమీక్ష: ఏపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉత్కంఠ నెలకొంది. డీజీపీ వి.దినేశ్ రెడ్డి శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శుక్రవారం హైకోర్టు వద్ద తెలంగాణ, సీమాంధ్ర లాయర్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పరస్పర దాడులకు సైతం దారితీయడంతో పరిస్థితి మరింత సున్నితంగా మారిందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఉద్యోగుల బస్సుపై రాళ్ల దాడి : ఉద్యోగికి గాయాలు ఖమ్మం/పెనుబల్లి, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న సభకు ఆంధ్రప్రాంత ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సుపై శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాటు వద్ద రాళ్లదాడి జరిగింది. ఖమ్మంలో బాధితులు తెలిపిన వివరాలప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు బయలు దేరారు. సత్తుపల్లి, వి.ఎం.బంజర మధ్యలోని మండాలపాడు సమీపంలోని కల్వర్టు వద్ద రాత్రి 7 గంటల సమయంలో బస్సు నెమ్మదిగా వెళ్తుండగాముసుగులు వేసుకున్న గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బస్సు వెనుకభాగంలో అద్దం పగిలి పోయింది. చింతలపూడికి చెందిన ఉద్యోగి వెంకట్రావ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ బస్సు ఆపడంతో ఉద్యోగులు కిందకి దిగిచూసేసరికి దుండగులు పరారయ్యారు. దీనిపై ఉద్యోగులు వి.ఎం.బంజర పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో ఖమ్మం రోటరీనగర్ వద్ద బస్సులోని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు నాగేశ్వరరావు, రాజబాబు విలేకరులతో మాట్లాడారు. -
రాజధాని రూట్లో ఉద్యోగులు
సాక్షి నెట్వర్క్: రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో శనివారం జరగనున్న ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు హాజరయ్యేందుకు సీమాంధ్ర జిల్లాల నుంచి వేలాదిమంది ప్రభుత్వోద్యోగులు తరలివెళ్లారు. రోడ్డు, రైలు మార్గాల ద్వారా శనివారం ఉదయానికల్లా రాజధానికి చేరుకోనున్నారు. ఆర్టీసీ బస్సుల బంద్‌తో వందలాది ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్ వాహనాలను వారు అద్దెకు తీసుకున్నారు. ఇక సీమాంధ్ర జిల్లాల మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ చేరుకునే రైళ్లన్నీ శుక్రవారం ఉద్యోగులతో కిటకిటలాడాయి. కొంతమంది రెండురోజుల ముందుగానే హైదరాబాద్ చేరుకోగా, ఒక్క శుక్రవారం రోజునే వేలాదిమంది రాజధానికి బయలుదేరారు. ఒక్క గుంటూరుజిల్లా నుంచే పదివేల మందికి పైగా ఉద్యోగులు హాజరవుతున్నట్టు అంచనా. శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో జిల్లాకు చెందిన 500 మందికిపైగా ఉద్యోగులు సదస్సుకు బయల్దేరారు. గుంటూరు స్టేషన్ నుంచి రాత్రి 10.30 గంటలకు ప్రత్యేక రైలులో 2వేల మంది ప్రయాణమయ్యారు. ఇక శనివారం ఉదయం పిడుగురాళ్ల నుంచి సికింద్రాబాద్ వరకూ నడిచే ఎంఎంటీఎస్ రైల్లోనూ మరో 1200 మంది వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. విజయనగరం జిల్లా నుంచి గరీబ్థ్,్ర విశాఖ, ఫలక్‌నుమా, గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు నాలుగు బస్సుల ద్వారా సుమారు 2,500 మంది ఉద్యోగులు తరలి వెళ్లారు. విశాఖ జిల్లా నుంచి 3,750 మంది ఉద్యోగులు 28 ప్రత్యేక బస్సుల్లోనూ, మరో వెయ్యిమంది వివిధ రైళ్లలోనూ పయనమయ్యారు. ప్రకాశం నుంచి 3 వేల మంది, అనంతపురం నుంచి 5 వేల మంది, శ్రీకాకుళం జిల్లా నుంచి వేయి మంది, కృష్ణాజిల్లా నుంచి ఎనిమిది వేల మంది ఉద్యోగులు తరలివెళ్లినట్లు అంచనా. -
సేవ్ ఆంధ్రప్రదేశ్‌ను విజయవంతం చేస్తాం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సేవ్ ఆంధ్రప్రదేశ్. ఉద్యోగుల్లోనే కాదు.. రాష్ట్రంలోనే ఉత్కంఠ రేపుతున్న కార్యక్రమం. ఉద్యమానికి దిశ.. దశను నిర్దేశించే అంశం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే. ఎలాగైనా భగ్నం చేయాలని తెలంగాణ ప్రాంత నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుండగా.. సీమాంధ్ర ఉద్యోగులు ఎలాగైనా సమైక్యాంధ్ర వాణి వినిపించేందుకు కంకణబద్ధులయ్యారు. రాష్ట్ర సమైక్యత కోసం ప్రాణాలైనా అర్పిస్తామని.. తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయలు, కార్మికులు వేలాదిగా తరలుతున్నారు. తెలంగాణవాదులు బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు రహదారులను దిగ్బంధిస్తున్నా వెరవక రాష్ట్ర రాజధానికి చేరుకునేందుకు సన్నద్ధులయ్యారు. రాజకీయ పార్టీల సహకారం లేకుండా సమైక్యవాదాన్ని చాటేందుకు సదస్సులో పాల్గొని తీరాలనే పట్టుదల అందరిలో వ్యక్తమవుతుండటం విశేషం. ఆయా శాఖల వారీగా కొందరు ఉద్యోగులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు రైళ్లలో ప్రత్యేక బోగీలను బుక్ చేసుకోవడం వారిలోని సమైక్య బలిమికి నిదర్శనం. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి జిల్లా నుంచి కనీసం 50వేల మంది ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. అయితే ఇప్పటికే దాదాపు 25వేల కూపన్లు పంపిణీ చేశారు. ఒక్కో కూపన్ ధర రూ.20లుగా నిర్ణయించారు. సదస్సుకు హైకోర్టు అనుమతి పట్ల హర్షం వ్యక్తమవుతోంది. భయపడే ప్రసక్తే లేదు తెలంగాణ బంద్, రహదారుల దిగ్బంధం అంటూ ఆ ప్రాంతవాసులు ఆందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే భయపడే ప్రసక్తే లేదు. షరతులకు లోబడి నిర్వహిస్తున్న సదస్సును తప్పక విజయవంతం చేసుకుంటాం. ఇది 13 జిల్లాల సదస్సు కాదు.. 23 జిల్లాలకు సంబంధించినది. సమైక్యవాదులంతా ఇందులో భాగస్వాములే. సీమాంధ్ర ఉద్యోగులు తమ మనోభావాలను వెల్లడించేందుకు ఎంచుకున్న కార్యక్రమాన్ని అడ్డుకోవాలనుకోవడం సమంజసం కాదు. - క్రిష్టఫర్ దేవకుమార్, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు -
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతి రద్దు చేయాలి: తెలంగాణ న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నెల 7వ తేదీన ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతి రద్దు చేయాలని తెలంగాణ న్యాయవాదులు టి.శ్రీరంగారావు, ఎస్.శ్రీనివాస్‌లు హైకోర్టును కోరారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభకు అనుమతి మంజూరు చేస్తూ డీసీసీ కమలాసన్‌రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను వారు సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ నూతి రామ్మోహనరావు విచారించారు. పిటిషనర్ల తరఫున గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మాత్రమే నిర్ణయం తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనికీ, ఉద్యోగస్తులకు ఎటువంటి సంబంధం లేదని, అయినా ఏపీఎన్జీవోలు గత నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారని, ఇలా సమ్మె చేసే హక్కు వారికి లేదని అన్నారు. ఇక్కడ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వమని, విభజనకూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మె ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం ఎలా అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏపీఎన్జీవోలు ప్రత్యక్షంగా రాజకీయ కార్యకపాల్లో పాల్గొంటున్నారని, ఈ నెల 7న సభ కూడా నిర్వహిస్తున్నారని మోహన్‌రావు చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘30 ఏళ్ల తరువాత ప్రభుత్వ ఉద్యోగులెవరికీ ఎటువంటి పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించబోమని, కేవలం పనిచేసిన రోజులకు మాత్రమే జీతం ఇస్తానంటూ ఓ రాజకీయ పార్టీ తమ ఎజెండాలో భాగంగా ప్రకటన ఇచ్చిందనుకున్నాం. ఆ ప్రకటన ఇచ్చింది ఓ రాజకీయ పార్టీ కాబట్టి, దానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె, ఆందోళనలు కార్యక్రమాల్లో పాల్గొంటే అది చట్ట విరుద్ధం అవుతుందా..? భవిష్యత్తరాలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడున్న ఉద్యోగులు సమ్మె, ఆందోళనలు చేయడం సరికాదంటారా..? అది అన్యాయం అవుతుందా.?’ అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ వెంటనే తమ ఎజెండాలోని అంశాలను అమలు చేస్తుందని, ఇదే రీతిలో ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయడాన్ని అందరం చూశామంటూ వ్యాఖ్యానించారు. గతంలోనూ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం జరిగిందని, అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే తాము 7వ తేదీ సభకు అనుమతిని రద్దు చేయాలని కోరుతున్నామని మోహన్‌రావు చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ఈ మొత్తం వ్యవహారానికి అనవసర ప్రాముఖ్యతను ఇస్తున్నామని మీకు అనిపించడం లేదా..?’ అని ప్రశ్నించారు. మీరేమంటారని హోంశాఖ తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని అడిగారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే, ఏపీఎన్జీవోల సభకు అనుమతినిచ్చామని ఆయన తెలిపారు. సభకు వచ్చే ప్రతి ఉద్యోగి గుర్తింపు కార్డును పరిశీలించడం జరుగుతుందని, గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే సభకు అనుమతినిస్తారని, ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వివరించారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఓ స్పష్టమైన నియమావళి ఉంది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చిన దాంట్లో నుంచే వారికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయపరమైన సమావేశాలు, సభలు నిర్వహించవచ్చా..? రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చా..? సభకు ఉద్యోగులు మాత్రమే హాజరు కావాలని ఎందుకు స్పష్టమైన షరతు విధించలేదు.’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
‘సమైక్య సభ’ పై బంద్ బాణం
సీమాంధ్ర ప్రజల సహకారం లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యంకాదు. హైదరాబాద్‌లో సమైక్య సభను అడ్డుకుంటే.. మేం ఢిల్లీలో తెలంగాణను అడ్డుకుంటాం. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. మా వాదాన్ని వినిపించడానికే సభ నిర్వహిస్తున్నాం. ప్రత్యేకవాదంలో బలముంటే.. ఎలాంటి ఆటంకాలూ కల్పించొద్దు. - ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తమ హక్కుల కోసం తెలంగాణ ప్రజలు సభలు పెట్టుకుంటామంటే ఎప్పుడూ అనుమతించలేదు. అదే ఏపీఎన్జీవోలు సమైక్యసభను పెట్టుకుంటామంటే నాలుగు రోజుల ముందుగానే అనుమతినిచ్చారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణను ఎలాగైనా అడ్డుకునేందుకు సీఎం చేస్తున్న కుట్రలకు నిరసనగానే బంద్‌కు పిలుపు ఇస్తున్నాం. ఏం జరిగినా సీఎందే బాధ్యత. - టీ జేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో ఏపీఎన్జీవోలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభపై.. తెలంగాణ జేఏసీ ‘బంద్’ బాణం ప్రయోగించింది. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం (6వ తేదీ) అర్ధరాత్రి నుంచి శనివారం (7వ తేదీ) అర్ధరాత్రి దాకా 24 గంటల బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. బంద్‌లో భాగంగా విజయవాడ, కర్నూలు రహదారులను దిగ్బంధం చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. రహదారుల దిగ్బంధనంతో పాటు.. సీమాంధ్రులపై దాడులు చేసైనా సమైక్య సభను అడ్డుకుని తీరతామని తెలంగాణ, ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఎల్బీ స్టేడియం వరకూ యుద్ధభేరి పేరుతో ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. సీమాంధ్ర ప్రజల సహకారం లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని.. హైదరాబాద్‌లో సమైక్య సభను అడ్డుకుంటే ఢిల్లీలో తాము తెలంగాణను అడ్డుకుంటామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. తమ వాదాన్ని వినిపించడానికే సభ ఏర్పాటు చేస్తున్నామని, ఎవరికీ వ్యతిరేకంగా కాదని ఆయన హైదరాబాద్‌లో పునరుద్ఘాటించారు. ఎల్బీ స్టేడియంలో సభకు ఏవైనా ఆటంకాలు తలపెడితే స్టేడియం బయటే సభను నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీఎన్జీవోల సభకు పోలీసులు నాలుగంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో భారీగా ఇనుపకంచెలు, బారికేడ్లను ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి నిరసనకారులు నగరంలోకి రాకుండా శివార్లలో చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నారు. సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఉద్యోగుల వాహనాలను తెలంగాణవాదులు అడ్డుకోకుండా జాతీయ రహదారులపై పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. నగర పోలీసులతో పాటు 11 కంపెనీల పారా మిలటరీ బలగాలు, 45 ప్లటూన్ల ఏపీఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని.. ఏదైనా పరిణామం జరిగితే దాని తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆవేదన, నిరసన వ్యక్తంచేయటానికి హక్కు ఉందన్నారు. ఏపీఎన్జీవోల సభకు 19 షరతులతో అనుమతిచ్చామని.. సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా నిర్వాహకులదే బాధ్యతని స్పష్టంచేశారు. ‘ఈ సభను అడ్డుకుంటామని, జరగనివ్వబోమని అనేక ప్రకటనలు వెలువడుతున్నాయి. వారిని కోరేది ఒక్కటే.. ఎవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు’ అని ఆయన చెప్పారు. -
బంద్‌కు సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రి వరకు బంద్ నిర్వహించేందుకు టీ జేఏసీ జిల్లా నేతలు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీఓస్ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు అనుమతిని నిరసిస్తూ టీజేఏసీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లాలో బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా టీ జేఏసీ పశ్చిమ జిల్లా కమిటీ అధ్యక్షుడు వై. అశోక్ కుమార్, టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు టి. రాజేందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ వేర్వేరు ప్రకటనల్లో పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా వివిధ వర్గాల నుంచి మద్దతు కోరుతూ టీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ‘హైదరాబాద్‌లో సభ నిర్వహణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చేస్తున్న కుట్రలను ఎండగట్టేందుకు బంద్ కు పిలుపునిచ్చాం. రాష్ట్ర ఏర్పాటుపై కసరత్తు వేగవంతమవుతున్న తరుణంలో పోలీసు యంత్రాంగాన్ని, ఏపీ ఎన్జీఓలను అడ్డుపెట్టి కుట్రలకు పాల్పడుతున్నారు. సీఎం కుట్రలను తిప్పికొట్టే శక్తి టీజేఏసీ, తెలంగాణ సమాజానికి వుందని’ అశోక్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆందోళనకు దిగాల్సిందిగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో సీఎం కిరణ్ సభకు అనుమతి ఇచ్చి తెలంగాణవాదుల సహనాన్ని పరీక్షిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌లో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. -
సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు ఏర్పాట్లు
హైదరాబాద్: సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 7న ఎల్బి స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సభ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందనరాలేదన్నారు. సభకు అనుమతిపై రేపు పోలీసులు చెప్పకుంటే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సమైక్యరాష్ట్రంకోరుకునే ప్రతిఒక్కరూ ఈ సభకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాజకీయ అజెండా లేకుండావస్తే పార్టీ నేతలనూ ఆహ్వానిస్తామని అశోక్‌బాబు చెప్పారు. సమైక్యాంధ్ర డిమాండ్ చేస్తూ లక్ష మందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఏపీఎన్జీవోల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే రోజు తాము కూడా హైదరాబాద్‌లో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలంగాణ జేఏసీ నేతలు చెప్పారు. దీంతో సెప్టెంబరు 7న హైదరాబాద్‌లో ఏం జరుగుతుందా ? అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విభజన కొట్టవచ్చినట్లు కనపడుతోంది. పోటాపోటీగా ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యమాలు నడుపుతున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో బహిరంగ సభకు పోలీసులు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. -
సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు ఏర్పాట్లు