సాక్షి నెట్‌వర్క్: ఏపీఎన్‌జీఓలు శనివారం హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ జేఏసీ నాయకులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి 24 గంటల బంద్‌కు పిలుపునివ్వడంతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యేందుకు ఉద్యోగులు విజయవాడ , కర్నూలు, మహబూబ్‌నగర్ వైపుల నుంచి వాహనాల్లో వస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటు హైదరాబాద్‌లో అటు హైదరాబాద్‌కు వచ్చే జాతీయ రహదారుల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులను తెలంగాణవాదులు అడ్డుకోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
విశాఖపట్నం వంటి సుదూర నగరాలు, పట్టణాల నుంచి ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయలుదేరారు. వేల సంఖ్యలో ఉద్యోగులు రైళ్ల ద్వారా కూడా రాజధానికి చేరుకునే అవకాశాలున్న దృష్ట్యా బందోబస్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. రాష్ట్ర రాజధానిని ఆంధ్రా ప్రాంతంతో కలిపే జాతీయ రహదారితో పాటు, రెండు ప్రధాన రహదారులు నల్లగొండ జిల్లా గుండా వెళుతుండడంతో జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడ జాతీయ రహదారిపై ఏకంగా 64 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న ప్రతి గ్రామంలో ముగ్గురు పోలీసులతో పికెట్లు ఏర్పాటు చేశారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై వాడపల్లి కృష్ణా నది వంతెన వద్ద, హైదరాబాద్ -మాచర్ల రహదారిపై నాగార్జునసాగర్ కొత్త వంతెన వద్ద కూడా పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. విజయవాడ హైవేలో హయత్‌నగర్ సమీపంలోనూ పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఉత్కంఠ..డీజీపీ సమీక్ష: ఏపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉత్కంఠ నెలకొంది. డీజీపీ వి.దినేశ్ రెడ్డి శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శుక్రవారం హైకోర్టు వద్ద తెలంగాణ, సీమాంధ్ర లాయర్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పరస్పర దాడులకు సైతం దారితీయడంతో పరిస్థితి మరింత సున్నితంగా మారిందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఉద్యోగుల బస్సుపై రాళ్ల దాడి : ఉద్యోగికి గాయాలు
ఖమ్మం/పెనుబల్లి, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న సభకు ఆంధ్రప్రాంత ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సుపై శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాటు వద్ద రాళ్లదాడి జరిగింది. ఖమ్మంలో బాధితులు తెలిపిన వివరాలప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు బయలు దేరారు. సత్తుపల్లి, వి.ఎం.బంజర మధ్యలోని మండాలపాడు సమీపంలోని కల్వర్టు వద్ద రాత్రి 7 గంటల సమయంలో బస్సు నెమ్మదిగా వెళ్తుండగాముసుగులు వేసుకున్న గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బస్సు వెనుకభాగంలో అద్దం పగిలి పోయింది. చింతలపూడికి చెందిన ఉద్యోగి వెంకట్రావ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ బస్సు ఆపడంతో ఉద్యోగులు కిందకి దిగిచూసేసరికి దుండగులు పరారయ్యారు. దీనిపై ఉద్యోగులు వి.ఎం.బంజర పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో ఖమ్మం రోటరీనగర్ వద్ద బస్సులోని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు నాగేశ్వరరావు, రాజబాబు విలేకరులతో మాట్లాడారు.
పోలీసు పహరాలో హైవేలు
Published Sat, Sep 7 2013 2:32 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement