‘సమైక్య సభ’ పై బంద్ బాణం
‘సమైక్య సభ’ పై బంద్ బాణం
Published Fri, Sep 6 2013 1:55 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
సీమాంధ్ర ప్రజల సహకారం లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యంకాదు. హైదరాబాద్‌లో సమైక్య సభను అడ్డుకుంటే.. మేం ఢిల్లీలో తెలంగాణను అడ్డుకుంటాం. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. మా వాదాన్ని వినిపించడానికే సభ నిర్వహిస్తున్నాం. ప్రత్యేకవాదంలో బలముంటే.. ఎలాంటి ఆటంకాలూ కల్పించొద్దు.
- ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు
తమ హక్కుల కోసం తెలంగాణ ప్రజలు సభలు పెట్టుకుంటామంటే ఎప్పుడూ అనుమతించలేదు. అదే ఏపీఎన్జీవోలు సమైక్యసభను పెట్టుకుంటామంటే నాలుగు రోజుల ముందుగానే అనుమతినిచ్చారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణను ఎలాగైనా అడ్డుకునేందుకు సీఎం చేస్తున్న కుట్రలకు నిరసనగానే బంద్‌కు పిలుపు ఇస్తున్నాం. ఏం జరిగినా సీఎందే బాధ్యత.
- టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో ఏపీఎన్‌జీవోలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభపై.. తెలంగాణ జేఏసీ ‘బంద్’ బాణం ప్రయోగించింది. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం (6వ తేదీ) అర్ధరాత్రి నుంచి శనివారం (7వ తేదీ) అర్ధరాత్రి దాకా 24 గంటల బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. బంద్‌లో భాగంగా విజయవాడ, కర్నూలు రహదారులను దిగ్బంధం చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. రహదారుల దిగ్బంధనంతో పాటు.. సీమాంధ్రులపై దాడులు చేసైనా సమైక్య సభను అడ్డుకుని తీరతామని తెలంగాణ, ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.
ఎల్‌బీ స్టేడియం వరకూ యుద్ధభేరి పేరుతో ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. సీమాంధ్ర ప్రజల సహకారం లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని.. హైదరాబాద్‌లో సమైక్య సభను అడ్డుకుంటే ఢిల్లీలో తాము తెలంగాణను అడ్డుకుంటామని ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. తమ వాదాన్ని వినిపించడానికే సభ ఏర్పాటు చేస్తున్నామని, ఎవరికీ వ్యతిరేకంగా కాదని ఆయన హైదరాబాద్‌లో పునరుద్ఘాటించారు. ఎల్‌బీ స్టేడియంలో సభకు ఏవైనా ఆటంకాలు తలపెడితే స్టేడియం బయటే సభను నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీఎన్‌జీవోల సభకు పోలీసులు నాలుగంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో భారీగా ఇనుపకంచెలు, బారికేడ్లను ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి నిరసనకారులు నగరంలోకి రాకుండా శివార్లలో చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నారు.
సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఉద్యోగుల వాహనాలను తెలంగాణవాదులు అడ్డుకోకుండా జాతీయ రహదారులపై పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. నగర పోలీసులతో పాటు 11 కంపెనీల పారా మిలటరీ బలగాలు, 45 ప్లటూన్ల ఏపీఎస్‌పీ, ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని.. ఏదైనా పరిణామం జరిగితే దాని తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆవేదన, నిరసన వ్యక్తంచేయటానికి హక్కు ఉందన్నారు. ఏపీఎన్‌జీవోల సభకు 19 షరతులతో అనుమతిచ్చామని.. సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా నిర్వాహకులదే బాధ్యతని స్పష్టంచేశారు. ‘ఈ సభను అడ్డుకుంటామని, జరగనివ్వబోమని అనేక ప్రకటనలు వెలువడుతున్నాయి. వారిని కోరేది ఒక్కటే.. ఎవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు’ అని ఆయన చెప్పారు.
Advertisement
Advertisement