తెలంగాణ న్యాయవాదుల పిటిషన్ తిరస్కృతి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్‌జీవోలు నిర్వహించ తలపెట్టిన‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు పోలీసులు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలన్న తెలంగాణ న్యాయవాదుల పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది. ఆ మేరకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సభ నిర్వహకులను ఆదేశించింది. సభ నిర్వహణవల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎటువంటి నష్టం చేకూర్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్.బి.స్టేడియంలో 7వ తేదీన ఏపీఎన్‌జీవోలు నిర్వహించతలపెట్టిన సభకు అనుమతినిస్తూ పోలీసులు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ తెలంగాణ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి, శుక్రవారం ఉదయం ఉత్తర్వులు వెలువరించారు. ఏపీఎన్‌జీవోల సభను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది గండ్రమోహనరావు న్యాయమూర్తిని కోరగా నిరాకరించారు. అయితే ప్రత్యక్ష ప్రసారాల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్‌జోన్ డీసీపీకి వినతిపత్రం ఇవ్వాలని మోహన్‌రావుకు స్పష్టం చేశారు. ఈ వినతిపత్రంపై 7వ తేదీన ఎన్‌జీవోల సభ ప్రారంభానికి ముందు నిర్ణయం వెలువరించాల్సి ఉంటుందని డీసీపీని న్యాయమూర్తి ఆదేశించారు.
ఎన్‌జీవోల సభ అనుమతి రద్దుకు హైకోర్టు నో
Published Sat, Sep 7 2013 4:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement