కేక్ కట్ చేసి సంబురాలు చేసుకుంటున్న తెలంగాణ న్యాయవాదులు
యాకుత్‌పురా: హైకోర్టును విభజించడంపై హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టులో గురువారం సంబురాలు జరుపుకున్నారు. కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ జీపీ ఎం.ఎస్.తిరుమల్‌రావు, బార్ అసోసియేషన్ కార్యదర్శి బి.జానకీరాములు, సీనియర్ న్యాయవాదులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జానకీరాములు మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టును విభజించడం శుభపరిణామమన్నారు. హైకోర్టు విభజనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణ, బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టులో సంబురాలు..
ఉమ్మడి హైకోర్టును విభజించడంతో హైకోర్టు వద్ద గురువారం తెలంగాణ న్యాయవాదుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. న్యాయవాదులు కోర్టు బయట టపాసులు పేలుస్తూ, స్వీట్లు పంచి పెడుతూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గండ్ర మోహన్ రావు, తెలంగాణ న్యాయవాదులు కొంతం గోవర్దన్‌రెడ్డి, వి.రవికుమార్, ఎ.అనిల్ కుమార్, చంద్రశేఖర్‌రావు, సి.కల్యాణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
విధులను బహిష్కరించిన ఏపీ న్యాయవాదులు
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ పనులు పూర్తికాక ముందే హైకోర్టును అమరావతికి తరలించడంపై ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గురువారం విధులను బహిష్కరించి హైకోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేశ్ కుమార్, కోశాధికారి బి.వి.అపర్ణలక్ష్మీ మాట్లాడుతూ.. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైకోర్టును పూర్తిస్థాయి భవన నిర్మాణ పనులు చేపటాకే కోర్టును తరలించాలన్నారు.అమరావతిలో నిర్మిస్తున్న సిటీ సివిల్ కోర్టు భవనంలోకి హైకోర్టును తరలిస్తున్నప్పటికీ అక్కడ ఇప్పటి వరకు 50శాతం కూడా నిర్మాణ పనులు పూర్తికాలేదన్నారు. తాత్కాలిక భవన నిర్మాణ పనులు సైతం పూర్తి కాకముందే తరలించడంతో న్యాయవాదులు ఇబ్బందులకు గురవుతారన్నారు. రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌కు అనుగుణంగా భవన నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం కోర్టును తరలిస్తే బాగుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment