సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రూ.6,756.92 కోట్ల విద్యుత్ బకాయిల వివాదంలో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 30 రోజుల్లోగా ఏపీకి రూ.6,756.92 కోట్లు (అసలు 3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) చెల్లించాలంటూ 2022, ఆగస్టు 29న కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నోటీసులను కొట్టివేసింది.
ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు.. అలాగే ఏపీ ప్రభుత్వం, విద్యుదుత్పత్తి సంస్థలు మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా ఈ అంశాన్ని పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది. చట్టప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాన్ని ఆశ్రయించే స్వే చ్ఛను ఇరు పక్షాలకు ఇస్తున్నామంది. తెలంగాణ వాదన కూడా వినకుండా కేంద్రం నోటీసులు జారీచేయడాన్ని తప్పుబట్టింది.
వివాదం ఏంటంటే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ జెన్‌కో/ట్రాన్స్‌కో/డిస్కమ్‌లు 2000 నుంచి 2013 వరకు పలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నాయి. ఇవి రాష్ట్ర విభజన తర్వాత 2019 వరకు కొనసాగాయి. విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు 2014 నుంచి 2017 వరకు తెలంగాణకు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ సరఫరా చేశాయి. దీనికైన మొత్తాన్ని చెల్లించాలని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కొన్నేళ్లుగా కోరుతున్నాయి.
ఈ వివాదం కేంద్రం వద్దకు చేరడంతో రూ.6,756.92 కోట్ల బకాయిలను ఏపీకి చెల్లించాలని తెలంగాణకు విభజన చట్టం సెక్షన్ 92 కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ డిస్కంలు, తెలంగాణ సర్కార్ 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అలాగే ఆర్‌బీఐలోనే తమ రాష్ట్ర ఖాతా నుంచి బకాయి మొత్తాన్ని మినహాయించుకొని ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించే ప్రయత్నం కేంద్రం చేస్తున్నట్లు తెలిసిందని.. దీనిపై నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలివ్వాలని తెలంగాణ సర్కార్ కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం రెండు వారాల క్రితం తీర్పును రిజర్వు చేసి.. గురువారం తుది ఉత్తర్వులు వెలువరించింది.
కేంద్రం వైఖరి సమంజసం కాదు: తెలంగాణ
తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలపై ముందుగా చర్చించాలని చెప్పారు. దీనిపై పూర్తిగా చర్చించకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పుడు, కేంద్రం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 92 ప్రకారం ఈ వివాదంలో జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి లేదన్నారు.
బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో డిస్కంలు: ఏపీ
తెలంగాణ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. మౌలిక వసతుల కల్పన కోసం ఏపీ డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాయన్నారు. విభజన తర్వాత విద్యుదుత్పత్తి, సరఫరా చేసినందుకు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనికీ.. పునర్వ్యవస్థీకరణ చట్టానికీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
కేంద్రం ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు ఏపీ డిస్కంలు విద్యుత్ సరఫరా చేస్తూనే ఉన్నాయన్నారు. బకాయిలు చెల్లించపోవడంతో బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, దీంతో తెలంగాణకు విద్యుత్ నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇరు రాష్ట్రాలు అంగీకరించిన తర్వాతే కేంద్రం నోటీసులు జారీ చేసిందన్నారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని పేర్కొన్నారు.
కేంద్రానికి అధికారం ఉంది: ఏఎస్‌జీ
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) సుందరేశన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని నివేదించారు. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులిచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. ఇరు రాష్ట్రాల కార్యదర్శులు హాజరై ఒప్పుకున్న తర్వాతే బకాయిలపై కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీ స్పెషల్ జీపీ గోవింద్‌రెడ్డి కూడా వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. నోటీసులు జారీచేసే అధికారం కేంద్రానికి ఉందా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం లేదంటూ కేంద్రం ఉత్తర్వులను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment