సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదంలో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ ఏపీ.. దీనిపై ఇప్పటికే ఇచ్చిన స్టేను పొడించాలంటూ తెలంగాణ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. హైకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి తమకు తెలంగాణ నుంచి రూ.6,756.92 కోట్లు (అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) రావాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది.
దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఏపీకి 30 రోజుల్లోగా రూ.6,756.92 కోట్లు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బకాయిల విషయంలో తెలంగాణ సర్కార్‌పై ఒత్తిడి తేవొద్దని స్టే ఇచ్చింది.
ఈ వ్యవహారం ఇలా కోర్టులో ఉండగానే.. విద్యుత్ బకాయిలు తప్పకుండా చెల్లించాలని ఆదేశించినా తెలంగాణ ఇవ్వడం లేదని.. అందువల్ల రిజర్వు బ్యాంకులోని తెలంగాణ ఖాతా నుంచి సొమ్మును మినహాయించుకుని ఏపీకి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది. దీనితో కేంద్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని, చెల్లింపులపై స్టేను పొడిగించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులోని ప్రధాన పిటిషన్‌లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది.
బకాయిల వల్ల ఇబ్బందుల్లో ఏపీ డిస్కమ్‌లు
తెలంగాణ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ విద్యుత్ డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వచ్చిందని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పునర్విభజన తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ఈ బకాయిలకు, పునర్విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు కూడా ఏపీ డిస్కమ్‌లు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాయన్నారు.
బకాయిలు చెల్లించక బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, తెలంగాణకు విద్యుత్ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని గుర్తు చేశారు. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని, బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉందని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం తీర్పు రిజర్వు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment