సాక్షి, హైదరాబాద్: అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు తన బాధ్యతలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. అత్యంత కీలకమైన న్యాయాధికారుల విభజన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈనెల 10న జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఇరు రాష్ట్రాల్లో పనిచేస్తున్న న్యాయాధికారులను సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు చేసింది. ఈ మేరకు హైకోర్టు తరఫున రిజిష్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 901 మందిలో 539 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, మిగిలిన 362 మందిని తెలంగాణకు కేటాయించారు. జిల్లా జడ్జి కేడర్‌లో 110 మందిని ఏపీకి 90 మందిని తెలంగాణకు, సీనియర్ సివిల్ జడ్జీలలో 132 మందిని ఏపీకి, తెలంగాణకు 71 మందిని, జూనియర్ సివిల్ జడ్జీలలో 297 మందిని ఏపీకి, తెలంగాణకు 201 మందిని కేటాయించారు. న్యాయాధికారులను సీనియారిటీ ఆధారంగా కేటాయించేందుకు హైకోర్టు మొదట్లో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై తెలంగాణ న్యాయాధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగానే విభజన జరపాలని రోడ్డెక్కి ఆందోళన చేశారు. తర్వాత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయాధికారుల విభజన సీనియారిటీ ఆధారంగానే జరపాలని తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు సలహా కమిటీ సీనియారిటీ ఆధారంగా ఓ జాబితాను తయారు చేసి, దానిని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపగా ఈనెల 10న ఆమోదముద్ర పడింది. దీంతో సీనియారిటీని ప్రాతిపదికగా చేసుకుని న్యాయాధికారుల ఆప్షన్ల ఆధారంగా కేటాయింపులు చేస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
యుద్ధప్రాతిపదికన ఉద్యోగుల విభజన
ఇదిలా ఉంటే, హైకోర్టు ఉద్యోగుల విభజన ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు తమ తమ ఆప్షన్‌లతో ఇచ్చిన సీల్డ్ కవర్‌లను హైకోర్టు అధికారులు తెరిచి, ఓ జాబితాను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం పూర్తి చేసి, శుక్రవారం సాయంత్రం కల్లా కేటాయింపుల జాబితాకు ఆమోదం వేయాలన్న కృతనిశ్చయంతో హైకోర్టు ఉంది. ఉద్యోగుల కేటాయింపులు సీనియారిటీ ఆధారంగానే ఉంటాయి. ఉద్యోగుల విభజనకు సంబంధించి హైకోర్టు ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
హైకోర్టు విభజన పనులు వేగవంతం
Published Fri, Dec 28 2018 1:37 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment