మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు | High Court Of Hyderabad Heard IT Grid Employees Arguments | Sakshi
Sakshi News home page

మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు

Published Tue, Mar 5 2019 3:43 AM | Last Updated on Tue, Mar 5 2019 5:54 PM

High Court Of Hyderabad Heard IT Grid Employees Arguments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ కోసం యాప్‌ రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు నిర్బంధించారంటూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. తమను పోలీసులు నిర్బంధించలేదంటూ సంస్థ ఉద్యోగులు రేగొండ భాస్కర్, కడులూరి ఫణి, గురుడు చంద్రశేఖర్, రెబ్బాల విక్రమ్‌గౌడ్‌ స్వయంగా నివేదించడంతో ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు)

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసినట్లు ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటుండటం, తమ సంస్థలోని నలుగురు ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖ లు చేయడం తెలిసిందే. దీనిపై ఆదివారం విచారణ జరిపిన జస్టిస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం... నలుగురు ఉద్యోగులను సోమవారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుపరచాలని ఆదేశించడంతో పోలీసులు ఆ మేరకు వారిని సోమవారం హాజరుపరిచారు. అయితే ఆ నలుగురి కుటుంబ సభ్యుల్లో ముగ్గురే ప్రమాణపూర్వక అఫిడవిట్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలను ధర్మాసనం ఆలకించింది. (డేటా చోర్‌.. బాబు సర్కార్‌)

ఆ పిటిషన్‌లో వాస్తవం లేదు...
అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బి.ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ నలుగురు ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న పిటిషనర్‌ వాదనల్లో వాస్తవం లేదన్నారు. వారిని హాజరుపరచాలని ధర్మాసనం ఆదివారం ఆదేశించాక పోలీసులు మరోసారి ఆ నలుగురికీ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియచేశామని వివరించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ఉద్యోగులు కూడా పోలీసుల వద్దకు వచ్చారని, వారికి కోర్టు ఆదేశాల గురించి వివరించి కోర్టు ముందు హాజరుపరుస్తున్నామని తెలిపారు. (‘ఐటీ గ్రిడ్స్‌’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం)

వ్యక్తిగతంగా మాట్లాడిన న్యాయమూర్తులు
ఈ విషయాలను రూఢీ చేసుకునేందుకు ధర్మాసనం ఇన్‌ కెమెరా ప్రొసీడింగ్స్‌ చేపట్టింది. ఆ నలుగురు తప్ప, మిగిలిన వారందరినీ బయటకు పంపిన న్యాయమూర్తులు... వారితో వ్యకిగతంగా మాట్లాడారు. పోలీసులు బెదిరించారా నిర్బంధించారా వం టి వివరాలను వారి నుంచి ధర్మాసనం రాబట్టినట్లు తెలిసింది. తమను పోలీసులు అక్రమంగా నిర్బంధిం చలేదని ఆ నలుగురు ధర్మాసనానికి వివరించారు.

తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారు...
సంస్థ డైరెక్టర్‌ అశోక్‌ ఈ పిటిషన్‌ ఎందుకు దాఖలు చేశారో తమకు తెలియదని ఉద్యోగులు హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. తమ కుటుంబ సభ్యుల నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని వివరించారు. ఆ పిటిషన్‌లో ఏం రాశారో తమకు ఏమాత్రం తెలియదని ధర్మాసనానికి వారు వివరించినట్లు సమాచారం. తాము ఆఫీసు నుంచి నేరుగా ఇం టికి వెళ్లకుండా బయటకు వెళ్లడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. టీవీల్లో వార్తల ద్వారా పిటిషన్‌ దాఖలు, కోర్టు ఆదేశాల గురించి తెలుసుకొని కుటుంబసభ్యులతో మాట్లాడామని, వారు అప్పుడు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయాన్ని చెప్పారన్నారు. అనంతరం తాము పోలీసుల వద్దకు వచ్చామని ధర్మాసనానికి వివరించారు. (హైటెక్‌... దొంగలు)

అక్రమ నిర్బంధంగా పరిగణించడం సాధ్యం కాదు
పోలీసులు తమను నిర్బంధించలేదని ఉద్యో గులు చెబుతున్నారని, అందువల్ల దీన్ని అక్రమ నిర్బంధంగా పరిగణించడం సాధ్యం కాదని పిటిషనర్‌కు ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది కృష్ణ ప్రకాశ్‌ స్పందిస్తూ ఇటువంటి కేసుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో అందరికీ తెలుసునన్నారు. ఏం జరిగి ఉం టుందో సులభంగా అర్థం చేసుకోవచ్చునన్నారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ పోలీసులు నిర్బంధించలేదని స్వయంగా ఆ నలుగురే చెబుతున్నప్పుడు, మిగిలిన విషయాల అవసరం ఏముం టుందని ప్రశ్నించింది. వారు చెబుతున్న మాటలనే విశ్వసిస్తామని పేర్కొంది. ఆ నలుగురిని తమ ముందు పోలీసులు హాజరుపరిచిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. మాదాపూర్‌ ఎస్‌హెచ్‌ఓ నుంచి తీసుకున్న కేసు డైరీని తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌)ను ధర్మాసనం ఆదేశించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement