న్యాయవాదులపై హైకోర్టు కన్నెర్ర
సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఇటీవల నిర్వహించి న ఆందోళనల సందర్భంగా న్యాయవాదులపై హైకోర్టు కన్నెర్ర చేసింది. విధి నిర్వహణలో ఉన్న న్యాయాధికారులపై దాడులు చేయడం, కోర్టు ఆస్తుల విధ్వంసం, కోర్టు విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడిన అంశాన్ని సుమోటోగా తీసుకుంది. వారిపై కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు మంత్రి రవీందర్, భార్గవ్, వరంగల్ జిల్లాకు చెందిన ఎం.రంజిత్, అంబటి శ్రీనివాస్, అల్లం నాగరాజు, ఆండాలు, బి.జయకర్, ఎం.సహోదర్‌రెడ్డి, వి.శ్యాంకృష్ణాలతో పాటు మరికొందరికి నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కార చట్టం కింద వారిపై చర్యలెందుకు తీసుకోరాదో వివరించాలని కోరింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 23న చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా జడ్జీల నివేదికల మేరకు..
న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల కు వ్యతిరేకంగా న్యాయాధికారులు, న్యాయవాదు లు ఈ ఏడాది జూన్‌లో ఆందోళన చేపట్టారు. అన్ని జిల్లాల్లో కోర్టు కార్యకలాపాలు జరగకుండా అడ్డుకున్నారు. కోర్టు హాళ్లలో కుర్చీలను, టేబుళ్లను ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఆయా జిల్లా జడ్జీలు హైకోర్టుకు నివేదికలు పంపారు. వీటిని పరిశీలించిన హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ... సదరు న్యాయవాదులపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించే అంశాన్ని పరిశీలించాలని తీర్మానించింది. దీంతో అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే గత నెల 26న ఆదేశాలిచ్చారు. రంగారెడ్డి జిల్లా న్యాయవాదులకు సంబంధించి ఒక పిటిషన్, వరంగల్ జిల్లాకు చెందిన న్యాయవాదులకు సంబందించిన పిటిషన్‌ను కలిపి మంగళవా రం విచారణ జరిపిన ధర్మాసనం.. నోటీసులు జారీ చేసింది.