ఏలూరు, న్యూస్‌లైన్ :
సమైక్యమే లక్ష్యంగా జిల్లాలో ప్రజలు సమర శంఖారావం పూరిస్తూనే ఉన్నారు. లక్ష్యం వైపు దీక్షగా విశ్రమించకుండా అడుగులు వేస్తున్నారు. శనివారం రాజధానిలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ విజయవంతం కావడంతో ఎన్జీవోలు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఉద్యమాన్ని మరింత పదునెక్కించేందుకు పరుగులు తీస్తున్నారు. నేడు వినాయకచవితి సందర్భంగా విఘ్నేశ్వరుడిని రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వేడుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 40వ రోజు దీక్షలు కొనసాగాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్‌సెంటర్ వద్ద దీక్ష లో కళాకారులు, ఉపాధ్యాయులు కూర్చున్నారు.
ఆర్టీసీ, జెడ్పీ , ఉపాధ్యాల సంఘాల దీక్షలూ కొనసాగాయి. భీమవరం ప్రకాశం చౌక్‌లో దీక్షలో ఎన్జీవోలు, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో ల్యాబ్‌టెక్నీషియన్స్ రిలే నిరహార దీక్షల్లో పాల్గొనగా ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి వారికి సంఘీభావం తెలిపారు. ఇక్కడ మూడు రోజులుగా ఆమరణ నిరహారదీక్ష చేస్తున్న గృహిణి యరశింగు శిరీష దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆచంట వేమవరంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కోదండరామ్, హరీష్‌రావు, కేసీఆర్‌లకు పిండ ప్రదానం చేశారు. పెనుగొండ దీక్షలో ఏఎంసీ పాలకవర్గం పాల్గొంది. తణుకు నిరాహారదీక్షలో ఐఎంఏ సభ్యులైన డాక్టర్లు పాల్గొన్నారు. అత్తిలిలో గంగిరెద్దులతో విన్యాసాలు చేయించారు. తాడేపల్లిగూడెం పాతూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిడదవోలులో ఎన్జీవోలు సమైక్యాంధ్ర పాటలు పాడారు.
భీమడోలు, గణపవరం ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరాలను ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మేల్యే కొండ్రెడ్డి విశ్వనాథం సందర్శించి మద్దతు పలికారు. గోపాలపురంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మానవహారం, ర్యాలీ నిర్వహించారు. నల్లజర్ల మండలం నబీపేటలో గ్రామస్తులు అమ్మవారికి పూజలు చేశారు. పోతవరం సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చే శారు. దూబచర్లలో రిలే దీక్షలో వికలాంగులు కూర్చున్నారు. బుట్టాయిగూడెంలో జేఏసీ దీక్షలో ఉపాధ్యాయులు పాల్గొ పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. కొయ్యలగూడెంలో జాతీయ నాయకుల విగ్రహాలను విద్యార్థులు శుభ్రం చేశారు. కొవ్వూరులో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో హోమాలు చేశారు. తాళ్లపూడిలో సమైక్యాంధ్రకు మద్దతుగా క్రైస్తవులు ప్రార్థనలు చేశారు.
నరసాపురం సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో రిలే దీక్షలో పట్టణ కృష్ణ యాదవ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు కర్రి నూకరాజు, జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బమ్మిడి అప్పారావు, వైఎస్సార్ సీపీ నేత రేకా ప్రసాద్ నాయకత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన ఆందోళనలో రంగినీడి శ్రీరామకృష్ణ అనే వ్యక్తి దేశభక్తి పాటలకు అనుగుణంగా రోడ్డుపై డాన్స్ చేశాడు.
వైఎస్ జగన్, షర్మిలకు మద్దతుగా దీక్షలు
సమైక్యాంధ్ర పరిరక్షణకు కంకణ బద్ధుైలైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే దీక్షలో ఆదివారం పెంటపాడు మండలం అలంపురం గ్రామానికి చెందిన పార్టీ శ్రేణు లు పాల్గొన్నారు. నరసాపురం బస్టాండ్ సెంటర్‌లో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం చిన్నారులు రిలే దీక్ష చేశారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆదివారం నాటి దీక్షలను ప్రారంభించారు
సమైక్యమే లక్ష్యం
Published Mon, Sep 9 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement