కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సేవ్ ఆంధ్రప్రదేశ్. ఉద్యోగుల్లోనే కాదు.. రాష్ట్రంలోనే ఉత్కంఠ రేపుతున్న కార్యక్రమం. ఉద్యమానికి దిశ.. దశను నిర్దేశించే అంశం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే. ఎలాగైనా భగ్నం చేయాలని తెలంగాణ ప్రాంత నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుండగా.. సీమాంధ్ర ఉద్యోగులు ఎలాగైనా సమైక్యాంధ్ర వాణి వినిపించేందుకు కంకణబద్ధులయ్యారు. రాష్ట్ర సమైక్యత కోసం ప్రాణాలైనా అర్పిస్తామని.. తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయలు, కార్మికులు వేలాదిగా తరలుతున్నారు.
తెలంగాణవాదులు బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు రహదారులను దిగ్బంధిస్తున్నా వెరవక రాష్ట్ర రాజధానికి చేరుకునేందుకు సన్నద్ధులయ్యారు. రాజకీయ పార్టీల సహకారం లేకుండా సమైక్యవాదాన్ని చాటేందుకు సదస్సులో పాల్గొని తీరాలనే పట్టుదల అందరిలో వ్యక్తమవుతుండటం విశేషం. ఆయా శాఖల వారీగా కొందరు ఉద్యోగులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు రైళ్లలో ప్రత్యేక బోగీలను బుక్ చేసుకోవడం వారిలోని సమైక్య బలిమికి నిదర్శనం. జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి జిల్లా నుంచి కనీసం 50వేల మంది ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. అయితే ఇప్పటికే దాదాపు 25వేల కూపన్లు పంపిణీ చేశారు. ఒక్కో కూపన్ ధర రూ.20లుగా నిర్ణయించారు. సదస్సుకు హైకోర్టు అనుమతి పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
భయపడే ప్రసక్తే లేదు
తెలంగాణ బంద్, రహదారుల దిగ్బంధం అంటూ ఆ ప్రాంతవాసులు ఆందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే భయపడే ప్రసక్తే లేదు. షరతులకు లోబడి నిర్వహిస్తున్న సదస్సును తప్పక విజయవంతం చేసుకుంటాం. ఇది 13 జిల్లాల సదస్సు కాదు.. 23 జిల్లాలకు సంబంధించినది. సమైక్యవాదులంతా ఇందులో భాగస్వాములే. సీమాంధ్ర ఉద్యోగులు తమ మనోభావాలను వెల్లడించేందుకు ఎంచుకున్న కార్యక్రమాన్ని అడ్డుకోవాలనుకోవడం సమంజసం కాదు.
- క్రిష్టఫర్ దేవకుమార్, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు
సేవ్ ఆంధ్రప్రదేశ్‌ను విజయవంతం చేస్తాం
Published Sat, Sep 7 2013 2:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement