Seemandhra Employees JAC
-
'అండగా ఉంటామనటం ఫ్యాషన్ అయిపోయింది'
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగుల హక్కుల గురించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగ జేఏసీ నేతలు మండిపడ్డారు. సీమాంధ్రకు కనీస న్యాయం చేయకుండా కాంగ్రెస్, బేజేపీలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని వారు ధ్వజమెత్తారు. తెలంగాణలో సెటిలైన సీమాంధ్రులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీమాంధ్రులకు అండగా ఉంటామంటూ తెలంగాణ నేతలు మాట్లాడటం ఒక ఫ్యాషన్‌గా మారిందని జేఏసీ నేతలు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులకు ప్రత్యేక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. -
పదవులు, ప్యాకేజీల కోసం రాష్ట్రానికి ద్రోహం
పదవుల కోసం, ప్యాకేజిల కోసం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. విభజన దిశగా కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తుండటం, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా అందుకు తందానా అంటుండటంతో తమ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోడానికి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నాయకులను ఓడించడమే లక్ష్యంగా తమ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని నాయకులు చెప్పారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటీ లాంటి అంశాలపై అంగీకరించడానికి సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఎవరు అధికారమిచ్చారని నిలదీశారు. తమ భవిష్యత్ కార్యచరణను సాయంత్రం ప్రకటిస్తామని అన్నారు. -
ఇక మెరుపు సమ్మె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన దిశగా, రాజ్యాంగ విరుద్ధంగా ముందుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ మెరుపు సమ్మె చేస్తామని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆదివారం హైదరాబాద్‌లో జేఏసీ సమావేశం అనంతరం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా పార్టీ విధానాలతో సంబంధం లేకుండా విభజనకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి బిల్లు వచ్చిన రోజు నుంచే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పది రోజులు ముందుగా ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి సమ్మె చేసే పరిస్థితి లేదని, ఈసారి మెరుపు సమ్మె చేపడతామని చెప్పారు. గతంలో 66 రోజులు సమ్మె చేసినప్పుడు కొన్ని వర్గాలు, వ్యవస్థలు సమ్మెలోకి రాలేదన్నారు. ఈసారి ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ విద్యాసంస్థలు సహా అన్ని వ్యవస్థలను సమ్మెలోకి తీసుకెళతామన్నారు. ఆఖరి అస్త్రంగానే సమ్మె చేస్తామని చెప్పారు. ప్రభుత్వాలను కదలించే రీతిలో రైల్‌రోకోలు, రాస్తారోకోలు, చలో హైదరాబాద్, చలో ఢిల్లీ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సీమాంధ్ర ఎంపీల వైఫల్యం వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకెళుతోందన్నారు. ఎంపీలను నమ్ముకోవడం కంటే జాతీయ పార్టీలను నమ్ముకోవడం ఉత్తమమని వ్యాఖ్యానించారు. పార్టీల ఎజెండాలను పక్కనబెట్టి రాజకీయ నాయకులంతా ఉద్యమంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ముగిసే డిసెంబర్ 20వ తేదీ వరకు ప్రతి రోజూ ఎంతో కీలకమని చెప్పారు. నిత్యం పరిస్థితిని సమీక్షించి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా అన్ని సంఘాలతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. స్టీరింగ్ కమిటీ సభ్యులను త్వరలో ప్రకటిస్తామన్నారు. కేంద్ర మంత్రులకు ఆ అర్హత లేదు: బొప్పరాజు ఎన్నో త్యాగాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన ఉద్యోగుల గురించి కేంద్ర మంత్రి జేడీ శీలం చులకనగా మాట్లాడటం బాధ కలిగించిందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత సీమాంధ్ర రాజకీయ నేతలకు లేదని స్పష్టం చేశారు. వారికి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
సమ్మెను విరమింపచేసేందుకు ముఖ్యమంత్రి ఒత్తిడి!
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గత 70 రోజులుగా సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు చేపట్టిన సమ్మెను విరమింప చేసేందుకు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టినట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. సోమవారం నాడు జరిగిన రాష్ట్ర కేబినెట్ ఉప సంఘ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలకు, రాష్ట్ర మంత్రులకు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే సమ్మె చేస్తున్న నేతలపై మంత్రి కొండ్రు మురళి చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డ సంగతి తెలిసిందే. కేబినెట్ ఉపసంఘం సమావేశం తర్వాత అశోక్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లయితే తాము సమ్మె విరమణపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మె విరమణకు ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి అన్నివర్గాల్లో నెలకొంది. -
సేవ్ ఆంధ్రప్రదేశ్‌ను విజయవంతం చేస్తాం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సేవ్ ఆంధ్రప్రదేశ్. ఉద్యోగుల్లోనే కాదు.. రాష్ట్రంలోనే ఉత్కంఠ రేపుతున్న కార్యక్రమం. ఉద్యమానికి దిశ.. దశను నిర్దేశించే అంశం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే. ఎలాగైనా భగ్నం చేయాలని తెలంగాణ ప్రాంత నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుండగా.. సీమాంధ్ర ఉద్యోగులు ఎలాగైనా సమైక్యాంధ్ర వాణి వినిపించేందుకు కంకణబద్ధులయ్యారు. రాష్ట్ర సమైక్యత కోసం ప్రాణాలైనా అర్పిస్తామని.. తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయలు, కార్మికులు వేలాదిగా తరలుతున్నారు. తెలంగాణవాదులు బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు రహదారులను దిగ్బంధిస్తున్నా వెరవక రాష్ట్ర రాజధానికి చేరుకునేందుకు సన్నద్ధులయ్యారు. రాజకీయ పార్టీల సహకారం లేకుండా సమైక్యవాదాన్ని చాటేందుకు సదస్సులో పాల్గొని తీరాలనే పట్టుదల అందరిలో వ్యక్తమవుతుండటం విశేషం. ఆయా శాఖల వారీగా కొందరు ఉద్యోగులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు రైళ్లలో ప్రత్యేక బోగీలను బుక్ చేసుకోవడం వారిలోని సమైక్య బలిమికి నిదర్శనం. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి జిల్లా నుంచి కనీసం 50వేల మంది ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. అయితే ఇప్పటికే దాదాపు 25వేల కూపన్లు పంపిణీ చేశారు. ఒక్కో కూపన్ ధర రూ.20లుగా నిర్ణయించారు. సదస్సుకు హైకోర్టు అనుమతి పట్ల హర్షం వ్యక్తమవుతోంది. భయపడే ప్రసక్తే లేదు తెలంగాణ బంద్, రహదారుల దిగ్బంధం అంటూ ఆ ప్రాంతవాసులు ఆందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే భయపడే ప్రసక్తే లేదు. షరతులకు లోబడి నిర్వహిస్తున్న సదస్సును తప్పక విజయవంతం చేసుకుంటాం. ఇది 13 జిల్లాల సదస్సు కాదు.. 23 జిల్లాలకు సంబంధించినది. సమైక్యవాదులంతా ఇందులో భాగస్వాములే. సీమాంధ్ర ఉద్యోగులు తమ మనోభావాలను వెల్లడించేందుకు ఎంచుకున్న కార్యక్రమాన్ని అడ్డుకోవాలనుకోవడం సమంజసం కాదు. - క్రిష్టఫర్ దేవకుమార్, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు -
ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళతా: సీఎం కిరణ్
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు సీఎం హామీ సాక్షి, హైదరాబాద్: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధి బృందాన్ని తన నేతృత్వంలో ఢిల్లీకి తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు. ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ నేతృత్వంలో డి.మురళీమోహన్, వెంకటసుబ్బయ్య, కృష్ణయ్య, ఏడుకొండలు, రవీందర్, బెన్సన్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసింది. ఉద్యోగుల అంశాన్ని కనీసం పరిగణనలోనికి కూడా తీసుకోకపోవడం వల్లే తమకు బాధ కలిగిందని ఉద్యోగులు ఆయనకు వివరించారు. తమ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, తమ బాధను, సీమాంధ్రుల వాణిని ఢిల్లీ పెద్దలకు వివరిస్తామని కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఢిల్లీకి వెళ్లే ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించడానికీ సమ్మతించారు. త్వరలో తేదీ నిర్ణయించి తెలియజేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.