సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన దిశగా, రాజ్యాంగ విరుద్ధంగా ముందుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ మెరుపు సమ్మె చేస్తామని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆదివారం హైదరాబాద్‌లో జేఏసీ సమావేశం అనంతరం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా పార్టీ విధానాలతో సంబంధం లేకుండా విభజనకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి బిల్లు వచ్చిన రోజు నుంచే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పది రోజులు ముందుగా ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి సమ్మె చేసే పరిస్థితి లేదని, ఈసారి మెరుపు సమ్మె చేపడతామని చెప్పారు.
గతంలో 66 రోజులు సమ్మె చేసినప్పుడు కొన్ని వర్గాలు, వ్యవస్థలు సమ్మెలోకి రాలేదన్నారు. ఈసారి ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ విద్యాసంస్థలు సహా అన్ని వ్యవస్థలను సమ్మెలోకి తీసుకెళతామన్నారు. ఆఖరి అస్త్రంగానే సమ్మె చేస్తామని చెప్పారు. ప్రభుత్వాలను కదలించే రీతిలో రైల్‌రోకోలు, రాస్తారోకోలు, చలో హైదరాబాద్, చలో ఢిల్లీ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సీమాంధ్ర ఎంపీల వైఫల్యం వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకెళుతోందన్నారు. ఎంపీలను నమ్ముకోవడం కంటే జాతీయ పార్టీలను నమ్ముకోవడం ఉత్తమమని వ్యాఖ్యానించారు. పార్టీల ఎజెండాలను పక్కనబెట్టి రాజకీయ నాయకులంతా ఉద్యమంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ముగిసే డిసెంబర్ 20వ తేదీ వరకు ప్రతి రోజూ ఎంతో కీలకమని చెప్పారు. నిత్యం పరిస్థితిని సమీక్షించి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా అన్ని సంఘాలతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. స్టీరింగ్ కమిటీ సభ్యులను త్వరలో ప్రకటిస్తామన్నారు.
కేంద్ర మంత్రులకు ఆ అర్హత లేదు: బొప్పరాజు
ఎన్నో త్యాగాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన ఉద్యోగుల గురించి కేంద్ర మంత్రి జేడీ శీలం చులకనగా మాట్లాడటం బాధ కలిగించిందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత సీమాంధ్ర రాజకీయ నేతలకు లేదని స్పష్టం చేశారు. వారికి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.