'తెలంగాణ ఏర్పాటుపై సీమాంధ్రలో వ్యతిరేకత లేదు'
తెలంగాణ ఏర్పాటుపై సీమాంధ్రలో ఎలాంటి వ్యతిరేకత లేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తన అధికార, ధనబలంతోనే లేని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉసిగొల్పారని ఆయన ఆరోపించారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కావాలనే కిరణ్ రెచ్చగొట్టారన్నారు. తెలంగాణ ఏర్పాటును చివర వరకు అడ్డుకున్నారన్నారు.
తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలలో పాస్ కాగానే సీమాంధ్రకు చెందిన నేతలు తనకు శుభాకాంక్షలు తెలిపారన్న సంగతిని ఈ సందర్భంగా డీఎస్ గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఐక్యతకు కిరణ్ కుమార్ రెడ్డే పెద్ద అడ్డంకి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు సోనియా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సోనియా సాకారం చేశారన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు దేవత అని అభివర్ణించారు.