సాక్షి, చిత్తూరు/అనంతపురం: సమైక్యాంధ్ర అనేది ఓ నినాదం కాదు.. విధానమని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన వల్ల అన్ని ప్రాంతాలకూ నష్టమేనని, ప్రధానంగా తెలంగాణకు ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పారు. రచ్చబండలో భాగంగా ఆదివారం చిత్తూరు జిల్లా వి.కోట, అనంతపురం జిల్లా నార్పలలో జరిగిన సభల్లో సీఎం మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అది సీమాంధ్రకు ఎగువన ఉంటుందని, అప్పుడు కృష్ణా, గోదావరి మిగులు జలాలను వినియోగించుకునే హక్కు దానికి ఉండదని తెలిపారు. కృష్ణా మిగులు జలాల ఆధారంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో చేపట్టిన ప్రాజెక్టులు వృథా అవుతాయన్నారు. తాగునీరు, విద్యుచ్ఛక్తి విషయంలోనూ తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు.
తెలంగాణలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తే నాలుగు రెట్ల అదనపు విద్యుత్ అవసరమవుతుందని, అంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే శక్తి తెలంగాణకు లేదని అన్నారు. విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసినా.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడడం లేదని విమర్శించారు. విభజనకు అనుకూలంగా ఆనాడు చంద్రబాబు లేఖ రాయకుండా ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. 1956లో వేర్పాటువాదం తలెత్తివుంటే నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లను నిర్మించే పరిస్థితి ఉండేది కాదన్నారు. విభజన జరిగితే 2 లక్షల మందికిపైగా ఉద్యోగులు వారి సర్వీస్ ప్రయోజనాలు, పింఛన్లు, పదోన్నతుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. సీమాంధ్ర యువకులు హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు లేక తీవ్రంగా నష్టపోతారన్నారు.
తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ రాబడి రూ.49 వేల కోట్ల నుంచి రూ.75 వేల కోట్లకు పెరిగింద న్నారు. మూడో విడత రచ్చబండలో 50 లక్షల మందికి ఇళ్లు, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఐకేపీ రుణాలు అందజేస్తున్నామని వివరించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ తుపానులు, వరదలు, కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఈ ఏడాది ఇప్పటికే మూడు తుపానులు వచ్చాయని చెప్పారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రఘువీరారెడ్డి, శైలజానాథ్, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీలు శమంతకమణి, గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు కొట్రికే మధుసూదన్‌గుప్తా, కె.సుధాకర్ పాల్గొన్నారు.