371-డిని సవరించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే తాను ముందు నుంచీ చెబుతున్నట్టు 371డి రాజ్యాంగ అధికరణను సవరించాల్సిందేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి చేరిన ముసాయిదా బిల్లులో ఇది స్పష్టంగా ఉందని చెప్పారు. రాజ్యాంగ సవరణకు లోక్‌సభలో మూడి ంట రెండొంతుల మెజారిటీతో పాటు దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుందన్నారు. శుక్రవారం శాసనమండలిలోని తన చాంబర్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠి గా మాట్లాడారు. విభజన రాజ్యాంగ నిబంధనల ప్రకారం జరగడం లేదని తాను తొలి నుంచీ చెబుతూనే ఉన్నానన్నారు. అయితే ఈ ప్రక్రియ నిబంధనలను అనుసరించి సాఫీగా జరగాలన్నదే తన అభిప్రాయమన్నారు.
‘‘371డి మాత్రమే గాక మరెన్నో క్లాజులు ఇలాగే ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజన సులభంగా జరగదు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తూ దానిపై అధికారాల విషయంలో పేర్కొన్న 371హెచ్ నిబంధన కూడా సరైనది కాదు. బిల్లులోని ప్రతి క్లాజ్‌పైనా అసెంబ్లీలో చర్చ, అభిప్రాయాల వెల్లడితో పాటు అంశాలవారీగా ఓటింగ్ కూడా ఉంటుంది. ఇలా అన్ని అంశాలపై అభిప్రాయ సేకరణకు ఎంత సమయం పడుతుందో, రాష్ట్రపతిని అదనంగా సమయం కోరాలో, వద్దో ఇప్పుడే చెప్పలేం. జనవరి 23 వరకు గడువిచ్చారు గనుక అంత సమయాన్నీ వినియోగించుకుంటాం. 371డి సవరణ అంశాన్ని కేంద్ర కేబినెట్ ఖరారు చేసిన ముసాయిదా బిల్లులో ఎక్కడా ప్రస్తావించలేదు.
కానీ రాష్ట్రపతి నుంచి వచ్చిన ముసాయిదా బిల్లులో ఆయనే దాన్ని స్వయంగా చేర్చినట్టున్నారు’’ అని చెప్పారు. విభజన బిల్లును త్వరగా సభలో ప్రవేశపెట్టి చర్చను ముగించాలని తెలంగాణ మంత్రులు తనను కోరారని, అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశానని కిరణ్ చెప్పారు. బిల్లును తెలుగు, ఉర్దూ భాషల్లోకి తర్జుమా చేయాల్సి ఉందని, అదిక్కడే చే యాలో, ఢిల్లీలోనే చేయించాలో స్పీకర్, మండలి చైర్మన్ నిర్ణయించాలని అన్నారు. ‘రాష్ట్రపతి సంతకంతో వచ్చిన ముసాయిదా బిల్లులో ఏమైనా తప్పులు దొర్లినా వాటిని సవరించాలంటే తిరిగి రాష్ట్రపతికే పంపాల్సి ఉంటుందేమో. తేడా వస్తే స్పీకర్, మండలి చైర్మనే బాధ్యత వహిస్తారేమో. రాష్ట్రపతి పంపిన బిల్లు అత్యంత రహస్యం. కాబట్టి దాన్ని అసెంబ్లీలో టేబుల్ ఐటమ్‌గా ప్రవేశపెడతారో, సభ్యులకు వ్యక్తిగతంగా అందిస్తారో సభాపతుల నిర్ణయం మేరకు ఉంటుంది’ అన్నారు.
ఇక న్యాయపరమైన ఇబ్బందులు మొదలు
బిల్లు అసెంబ్లీకి రావడమే విభజన ప్రక్రియలో తొలి అడుగని, ఇక నుంచి రాజ్యాంగపరమైన అనేక ప్రక్రియలు దాటాల్సి ఉంటుందని, న్యాయపరమైన ఇబ్బందులు ఇక్కడి నుంచే ఉంటాయని కిరణ్ తెలిపారు. దీనిపై న్యాయపరంగా ఏం చేయాలన్నా ఇక నుంచే ప్రారంభమవుతుందని వివరించారు. తెలంగాణ బిల్లును బీఎస్‌ఎఫ్ విమానంలో ప్రత్యేకంగా తీసుకువచ్చారని, తాను కూడా ఇస్రో ప్రయోగించిన మంగళయాన్ తరహాలో దాన్ని వెనక్కు పంపిస్తానని అన్నారు. అయితే మంగళయాన్ వాహకనౌక గమ్యాన్ని ఆరునెలలకు చేరుతుందో, అసలు చేరుతుందో లేదో తెలియదని తాను అన్నట్టు ప్రచారం సాగుతోందన్నారు.
కిరణ్‌తో సీమాంధ్ర మంత్రుల భేటీ
సీమాంధ్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి, పార్థసారథి, కాసు కృష్ణారెడ్డి తదితరులకు కూడా ఇవే అంశాలను అంతకుముందు కిరణ్ వివరించారు. ముసాయిదా బిల్లులోని అంశాలు న్యాయపరంగా చిక్కులు తెచ్చేవేనని, కోర్టులో సవాలు చేస్తే బిల్లు వీగిపోవడం ఖాయమని ఆయన చెప్పినట్టు సమాచారం. విభజన బిల్లుపై ప్రస్తుత సమావేశాల్లో చర్చ జరిగే పరిస్థితి లేదని మంత్రి పార్థసారథి చెప్పారు. బిల్లుపై చర్చ కోసం అసెంబ్లీని జనవరిలో ప్రత్యేకంగా సమావేశపరచవచ్చన్నారు. సాధారణ ఎన్నికల్లోగా తెలంగాణ ఏర్పాటయ్యే ఆస్కారమే లేదన్నారు.
ప్రొసీజర్ ప్రకారమేనన్న కిరణ్: అంతకుముందు టీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, చీఫ్ విప్ గండ్ర, విప్ అనిల్ లు కిరణ్‌ను కలిసి.. బిల్లును వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టించాలని కోరారు. అందుకు కొన్ని పద్ధతులుంటాయని, ఆ ప్రకారమే జరుగుతుందని కిరణ్ చెప్పడంతో అసంతృప్తితో బయటకు వచ్చేశారు.