ఇలా చేస్తాడని తెలిస్తే సోనియా ఆ సీట్లో కూర్చోబెట్టేది కాదు: డీఎస్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ముఖ్యమంత్రి వ్యవహారం చూస్తుంటేనే కేంద్రంలో తెలంగాణ పునాదులు ఎంత గట్టిగా అవుతున్నాయో అర్ధమవుతోందని.. అక్కడ పునాదులు గట్టిగా అవుతున్నకొద్దీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఇక్కడ పిచ్చి వ్యవహారాలు చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కిరణ్ ఈ విధంగా చేస్తాడని సోనియా ఊహించి ఉంటే ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టేది కాదన్నారు. ఆదివారం రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్-2014 డైరీ, క్యాలెండర్, వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘మన రాష్ట్రం మనకు వచ్చిందన్న విశ్వాసం ఇక్కడున్న ప్రతిఒక్కరి ముఖాల్లో కనిపిస్తుంటుంది. కిరణ్ శాసనసభలో ముసాయిదా బిల్లు అంటున్నాడు. బిల్లు వచ్చినప్పుడు అది ముసాయిదా బిల్లు అని ఎందుకు చెప్పలేకపోయాడో అర్థం కావడంలేదు.
పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నందున ఓటింగ్‌తో కూడా అవసరం లేకుండా.. కేవలం వాయిస్ ఓటింగ్‌తోనే తెలంగాణ రాష్ర్టం ఏర్పడుతుంది’’ అని చెప్పారు. ఫిబ్రవరి చివరన రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ, సీఎం రాజ్యాంగబద్ధంగా పనిచేయడంలేదని విమర్శించారు. ఉమ్మడి హైకోర్టు మంచిది కాదని, దానివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. సభాధ్యక్షుడు తప్పు చేస్తే ప్రతిపక్ష నాయకుడు అడ్డుకోవాలని, కానీ సభాధ్యక్షుడికి వంతపాడడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంవన్నీ పిచ్చి వ్యవహారాలు
Published Mon, Jan 27 2014 1:58 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement