ఏలూరు, న్యూస్‌లైన్ :
జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం మరింతగా బలపడుతూ తుఫాన్‌లా కొనసాగుతోంది. 44వ రోజైన గురువారం ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. అన్నివర్గాల ప్రజలు పోరాటంలో మమేకమై వినూత్నంగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ప్రజలు ఉద్యమ పిడికిళ్లు మరింత బిగిసేలా ఎన్జీవోలు రెండోరోజు కూడా పల్లెబాట పట్టారు. అన్ని వర్గాలను మరింత చైతన్యం చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పదవికి రాజీనామా చేయాలంటూ ఎన్జీవో, జేఏసీ నాయకులు పాలకొల్లు ఎమ్మెల్యే బంగా రు ఉషారాణి ఇంటిని ముట్టడించారు. తణుకు, అత్తిలిలో సమైక్యవాదులు గురువారం ఇచ్చిన బంద్ పిలుపులో రెండుచోట్లా బంద్ విజయవంతమైంది.
పెనుగొండ జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్ పిలుపులో భాగంగా మొదటిరోజైన గురువారం బంద్ సంపూర్ణంగా జరిగింది. భీమవరం జేఏసీ పిలుపుమేరకు చేపట్టిన 72 గంటల బంద్ రెండో రోజూ విజయవంతమైంది. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో రిలే దీక్ష శిబిరం వద్ద న్యాయవాదులు, ఉద్యోగులు మ్యూజికల్ చైర్స్ ఆడారు. ఆకివీడులో ఉద్యోగ సంఘాల సభ్యులు, వ్యాపారులు రిలే దీక్షలో కూర్చున్నారు. ఆకివీడులో 20 మంది యువకులు విజభనను నిరసిస్తూ రక్తదానం చేశారు. నరసాపురంలో ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో ఉపాధ్యాయినులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలి పారు. ఉపాధ్యాయ, ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో రిలే దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు. టి.నరసాపురం ప్రధాన కూడలిలో యువత కోలాటమాడి, రోప్ స్కిప్పింగ్ చేశారు.
జంగారెడ్డిగూడెంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రదర్శన, రాస్తారోకో చేశారు. బోసుబొమ్మ సెంటర్‌లో మానవహారం ఏర్పాటుచేసి, గంగిరెద్దుతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఉంగుటూరులో ఉపాధ్యాయులు జలదీక్ష చేశారు. అనంతరం రోడ్డుపై కబడ్డీ ఆడారు. చేబ్రోలుకు చెందిన దళితులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. తాడేపల్లిగూడెంలో సెయింట్ ఆన్స్ విద్యార్థులు, పైబోయిన వెంకట్రామయ్య యూత్ సభ్యులు భారీ ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలతో పాటు, విభజన జరిగితే ఉపాధి అవకాశాలు ఎలా దెబ్బతింటాయనే విషయంపై విద్యార్థులు లఘునాటికల ద్వారా చూపిం చారు. రాష్ట్ర విభజన జరిగితే ఆకులు, అలములు తిని బతకాలని తెలియజేస్తూ ఉండిలో అడవి మనుషుల వేషధారణలో ఉపాధ్యాయులు వినూత్న ప్రదర్శన చేశారు. ఇరగవరం, దువ్వ, తూర్పువిప్పర్రులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
ఆచంటలో సమైక్యాంధ్రకు మద్దతుగా రైతులు దీక్షలో పాల్గొన్నారు. మండలంలోని వల్లూరు, ఎ.వేమవరం పెనుమంట్ర మండలం మార్టేరు, పెనుమంట్రలో దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుగొండ దీక్షలో రజకు లు పాల్గొన్నారు. కొవ్వూరులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జూనియర్ కళాశాల వద్ద ఉపాధ్యాయ జేఏసీ దీక్షా శిబిరాన్ని ప్రజా గాయకుడు పూడి లక్ష్మణ్ సందర్శించి సమైక్యాంధ్ర పాటల సీడీని అందజేశారు. చాగల్లు మండలంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు బస్సు యాత్ర చేపట్టారు. గౌరిపల్లి నుంచి ఎస్.ముప్పవరం వరకు యాత్ర నిర్వహించి గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాళ్లపూడి మండలంలో మలకపల్లి నుంచి తాళ్లపూడి వరకు ఉపాధ్యాయులు, ఏపీఎన్జీవోలు, పాఠశాల విద్యార్థులు పాదయాత్ర చేశారు. డ్వాక్రా మహిళలు రిలే దీక్ష చేపట్టారు.
ఉద్యమ వీచిక
Published Fri, Sep 13 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement