భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ఎన్‌వీఆర్ దాస్, చెరుకువాడ రంగసాయి అన్నారు. సమైక్య రాష్ట్రం కోరుతూ సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం చౌక్‌లో సోమవారం విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు, మానవహారం, ధర్నా నిర్వహించారు. ఉన్నత విద్యాసంస్థలు, ఐటీ, పరిశ్రమలను హైదరాబాద్‌లో మాత్రమే ఏర్పాటు చేసి మహానగరంగా అభివృద్ధి చేశారని, ఇప్పుడు రాష్ట్రం విడిపోతే విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతారని, ఉద్యోగ అవకాశాలు ఉండవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీవ్రంగా నష్టపోతామని విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
రాజకీయ స్వార్థం కోసం యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడటం దారుణమన్నారు. హైదరాబాద్ తరహాలో సీమాంధ్రలోని పలు ప్రాంతాలను అభివృద్ధి చేసిన తర్వాత, నీటి సమస్యలు పరిష్కరించిన తర్వాత మాత్రమే విభజనపై ఆలోచించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందుగా వీఎస్‌కే డిగ్రీ, పీజీ విద్యార్థులు కళాశాల నుంచి ప్రదర్శనగా వచ్చి ప్రకాశంచౌక్‌లో రిలే నిరాహారదీక్షలు చేశారు. నారాయణ స్కూల్ విద్యార్థులు ధర్నా, మానవహారం నిర్మించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు డాక్టర్ చీడే సత్యనారాయణ, వీఎస్‌కే కళాశాల కార్యదర్శి వబిలిశెట్టి పట్టాభిరామయ్య, కె.వెంకటేశ్వరరావు, వేణుగోపాలరాజు, వడ్డి సుబ్బారావు, గంటా సుందర కుమార్, జంపన ఫణి పాల్గొన్నారు.
విభజనతో భవిష్యత్ అంధకారం
Published Tue, Nov 5 2013 3:02 AM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM
Advertisement