జాతీయ రహదారిపై విద్యార్థుల రాస్తారోకో | Student rasta roko on national highway | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై విద్యార్థుల రాస్తారోకో

Published Fri, Feb 7 2014 2:53 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM

Student rasta roko on national highway

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలుకు దక్షిణం వైపుగల జాతీయ రహదారిపై ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు గురువారం రాస్తారోకో చేశారు. పది నిమిషాలకుపైగా రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

 ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకుడు ఆర్.జగదీశ్ మాట్లాడుతూ ఆరుకోట్ల మంది ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత జరిగిన కోర్ కమిటీ మీటింగ్‌లో కూడా ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలని కోరారు.

అసెంబ్లీ ఆమోదం లేకుండా ఎక్కడా రాష్ట్ర విభజన జరగలేదని గుర్తు చేశారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒంగోలు సెంటర్ పీడీ ఆసిఫ్ ఉద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే ఎక్కువ నష్టపోయేది విద్యార్థులేనన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవీంద్రకుమార్, పి.వెంకటరావు, జె.అరుణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement