విద్యార్థి గర్జన
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 111వరోజూ సోమవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉధృతంగానే కొనసాగింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థిగర్జన పేరిట భారీబహిరంగసభ నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దొంటూ విద్యార్థులు చేసిన సమైక్యనినాదాలతో పట్టణం మార్మోగింది. సభలో విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవితేజ మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణకు ఏపోరాటానికైనా విద్యార్థులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, బ్రహ్మసముద్రంలో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు.
అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సోమవారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ మీట్‌కు సమైక్య సెగ తగిలింది. తెలంగాణ క్రీడాకారులను సమైక్యాంధ్ర ప్రదేశ్ విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు.కృష్ణాజిల్లా కలిదిండిలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి దిష్టిబొమ్మను జేఏసి నాయకులు దహనం చేసి సోనియా డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. నందిగామలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఏఎన్‌యూలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఆచార్య నాగార్జునుడి విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు, అధ్యాపక జేఏసీ నాయకులు డాక్టర్ జి.రోశయ్య, ఆచార్య పి. వరప్రసాదమూర్తి, ఉద్యోగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.