సిద్దిపేట, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శనివారం నాటి ‘సేవ్ ఏపీ’ సభలో మెదక్ జిల్లా యువకుడు ‘తెలంగానం’ వినిపించాడు. వృత్తి రీత్యా కానిస్టేబుల్ అయినప్పటికీ తన భావ వ్యక్తీకరణతో యావత్ తెలంగాణ సమాజాన్ని ఆకర్శించాడు. అనేక మందిలో స్ఫూర్తిని నింపాడు. అదే సమయంలో తోటి కానిస్టేబుళ్లు, సీమాంధ్రుల చేతిలో చావుదెబ్బ తిన్నాడు. అతడి పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబ సభ్యులు, సహచరులు, తెలంగాణవాదులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అతని సాహసాన్ని జిల్లా వాసులు ప్రశంసిస్తున్నారు. ఒక్క రోజులోనే వెలిగిపోయిన కోహెడ శ్రీనివాస్‌గౌడ్(28) గురించి మరిన్ని వివరాలు ఇలా...
బందోబస్తుకు వెళ్లి..
కె.శ్రీనివాస్‌గౌడ్ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గణేశ్ ఉత్సవాల బందోబస్తు కోసం సిద్దిపేట ఆర్మ్‌డ్ రిజర్వు (ఏఆర్) క్వార్టర్ల నుంచి ఎస్‌ఐ ఆధ్వర్యంలో 18 మంది కానిస్టేబుళ్లు శుక్రవారం హైదరాబాద్ వెళ్లారు. వారిలో శ్రీనివాస్‌గౌడ్ కూడా ఉన్నారు. పనిలో పనిగా పోలీసు ఉన్నతాధికారులు ఈ ఏఆర్ బలగాలను ఎల్‌బీ స్టేడియానికి పంపించారు. అక్కడ సభ జరుగుతుండగా శ్రీనివాస్‌గౌడ్ చేతులు పెకైత్తి ‘జై తెలంగాణ’ అంటూ నినదించాడు. పక్కనే ఉన్న మిగతా పోలీసులు, సీమాంధ్రులు ఆయన్ను చితకబాదారు. ఈ సంఘటన టీవీల్లో రావడంతో అందరు చూశారు. ఈ విషయం నిమిషాల్లోనే జిల్లా మొత్తం తెలిపోయింది. తక్షణం అనేక మంది శ్రేయోభిలాషులు, స్నేహితులు స్పందించారు. శ్రీనివాస్‌గౌడ్‌ను కాపాడాలంటూ ప్రజాప్రతినిధులు, నాయకులకు పదే పదే ఫోన్లు చేశారు.
ఇతని స్వగ్రామం ఆకారం..
దుబ్బాక మండలం ఆకారం గ్రామవాసి అయిన కె.శ్రీనివాస్‌గౌడ్ పీజీ చేశాడు. ఏఆర్‌లో కానిస్టేబుల్(2442)గా 2009లో చేరాడు. బందోబస్తు, వీఐపీలకు భద్రత, ఇతర విధులు నిర్వర్తిస్తుంటాడు. దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డికి సుమారు 8 నెలలపాటు అంగరక్షకుడిగా పనిచేసి మూడు నెలల కిందటే తిరిగి ఏఆర్‌కు చేరుకున్నాడు. ఆయనకు తల్లి ఎల్లవ్వ, అన్న నర్సాగౌడ్ ఉన్నారు.
వివాహంలోనూ ఆదర్శం!
శ్రీనివాస్‌గౌడ్ తన స్వగ్రామానికి చెందిన సారిక అనే అమ్మాయిని ఏడాది కిందట ఆదర్శ వివాహం చేసుకున్నాడు. సిద్దిపేటలోని ఏఆర్ క్వార్టర్లలో కాకుండా మెదక్ రోడ్డులోని పాత పోస్టాఫీసు ఏరియాలో నివాసం ఉంటున్నాడు.
కిడ్నీలో రాళ్లతో సతమతం...
ఇతను మూడు నెలలుగా కిడ్నీలో రాళ్లతో సతమతమవుతున్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో డ్యూటీకి వెళ్లవద్దని ఎంత చెప్పినా... బందోబస్తుకు తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందని సముదాయించాడని అతని భార్య సారిక, అన్న నర్సాగౌడ్‌లు ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు.
‘ఫోన్ చేసి పరామర్శిస్తే... నాకు ఏమీ కాలేదని ఓదార్చాడని, మేమెక్కడ ఎక్కడ టెన్షన్ పడతామేమోనని అలా చెప్పి ఉంటాడని’ సారిక దిగులుగా చెప్పింది. ‘అయ్యో... నా బిడ్డను మస్తు కొట్టిండ్రు.. టీవీలో చూశాను...’ అంటూ తల్లి ఎల్లవ్వ కన్నీటి పర్యంతమైంది. తన సోదరుడు కూడా ఉద్యోగే కదా. అలాంటప్పుడు ఎందుకిలా దౌర్జన్యం చేశారో... అంటూ నర్సాగౌడ్ వాపోయాడు. ‘జై తెలంగాణ’ అంటేనే తంతారా..? అంటూ సిద్దిపేట వాసులు సీమాంధ్ర ఉద్యోగులు, అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.
సీమాంధ్ర సభలో తెలంగాణ గళం
Published Sun, Sep 8 2013 3:28 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement