ఎల్‌బీ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించి అందజేస్తాం: సీఎం రేవంత్
65 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేశాం.. విద్యా రంగానికి నిధులు పెంచాం
నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా బడులను కొనసాగిస్తామని వెల్లడి
డీఎస్సీ–2024 ఫలితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి
త్వరలోనే గ్రూప్–1 పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటన
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2024 కింద ఎంపికయ్యే ఉపాధ్యాయులకు అక్టోబర్ 9న ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దసరా నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ మేరకు 65 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేశామని.. విద్యను పేదవాడి ముంగిటకు చేర్చడ మే ధ్యేయంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తమ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. డీఎస్సీ రాసిన వారి మెరిట్ జాబితాల్లోంచి ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేస్తామని.. ఆ జాబితాలను జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)కి పంపుతామని సీఎం చెప్పారు. అక్కడ తుది ఎంపిక జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని.. అదీ 7,857 మంది టీచర్లనే నియమించిందని పేర్కొన్నారు. అదే తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. పది నెలల్లోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అడుగులు వేశామని చెప్పారు.
ఉపాధ్యాయులంటే.. ఓ భావోద్వేగం
ఉపాధ్యాయులు అంటే ఉద్యోగి కాదని, ఓ భావోద్వేగమని సీఎం అభివర్ణించారు. కీలకమైన ఈ రంగం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యా రంగానికి భవిష్యత్‌లో మరిన్ని నిధులు ఇస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రా«ధాన్యమిస్తామని ప్రకటించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, వివాదాలకు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించామని సీఎం తెలిపారు. గ్రూప్–1 పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్
రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఒకే చోట ఉంచి విద్యను అందించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతీ రెసిడెన్షియల్ స్కూల్‌ను 20 నుంచి 25 ఎకరాల్లో రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మధిర, కొడంగల్ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా వీటిని చేపడుతున్నామని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
గత పదేళ్లు ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ బడులను కొనసాగిస్తామని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. తాము జాతీయ నూతన విద్యా విధానం కన్నా.. రాష్ట్ర విద్యా విధానంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తు మ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేం దర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment