ప్రభుత్వ టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్
ప్రతి ప్రభుత్వ స్కూల్‌కు ఉచిత విద్యుత్ అందిస్తాం..
హామీల కారణంగా విద్యా రంగానికి 10 శాతం నిధులివ్వలేకపోయాం
టీచర్లు తేనెతుట్టెలాంటి వారు.. అపకారం చేస్తే ఎదురుదాడి చేస్తారని వ్యాఖ్య
పేరుకే ముఖాముఖి.. మమ్మల్ని మాట్లాడనివ్వరా..?: టీచర్ల అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భవిష్యత్ టీచర్ల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. ఉపాధ్యాయులు తేనెతుట్టె వంటి వారని.. వారికి ఎవరైనా అపకారం చేస్తే తేనెటీగల్లా ఎదురుదాడి చేస్తారని వ్యాఖ్యానించా రు. తమ ప్రభుత్వానికి ఉపాధ్యాయులే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో శుక్రవారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో సీఎం ఆతీ్మయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే క్రమంలో ముందుంటాం. 15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 30వేల మంది టీచర్ల పదోన్నతులు చేపట్టడం గర్వకారణం. బడ్జెట్‌లో విద్యారంగానికి 10% కేటాయించాలనుకున్నా.. హామీల అమలు దృష్ట్యా 7.3% నిధులే ఇవ్వగలిగాం.
స్కూళ్లలో దారుణ పరిస్థితులు..
గురుకులాలతో కలిపి రాష్ట్రంలో 30వేల ప్రభుత్వ స్కూళ్లుంటే వాటిలో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే ప్రైవేటు స్కూళ్లు 10వేలు ఉంటే వాటిలో 33 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రైవేటు స్కూళ్లలో గొప్ప టీచర్లున్నారా? టెన్త్, ఇంటర్ ఫెయిలైన వాళ్లతో పాఠాలు చెప్పిస్తున్నారు. ఎక్కడో లోపం ఉంది. దీనికి ప్రభుత్వ విధానాలూ కారణమే. మౌలిక వసతులు లేక విద్యార్థులు ప్రైవేటుబాట పడుతున్నారు.
మహిళా టీచర్లు పనిచేసే ప్రాంతాల్లో కూడా టాయిలెట్లు లేవు. కొన్నిచోట్ల స్కూళ్లలో పశువులను కట్టేసే పరిస్థితి. మేం పాఠశాలలను మెరుగుపరిచే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించాం. ప్రతీ ప్రభుత్వ స్కూల్‌కు ఉచిత విద్యుత్ అందిస్తాం. పారిశుధ్య కారి్మకులను నియమిస్తాం.
మీరే అంబాసిడర్లు..
తెలంగాణ సాధనలో టీచర్ల పాత్ర కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకునే వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిచ్చాం. టీచర్లతో పెట్టుకోవద్దని చాలామంది నాకు సలహా ఇచ్చారు. కానీ వారిలో విశ్వాసం నింపుతాననే నమ్మకం నాకు ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేదల భవిత టీచర్ల చేతుల్లోనే ఉంది. గత ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు 2 లక్షల మేర తగ్గాయి. అందువల్ల టీచర్లు ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపడం ఆత్మగౌరవంగా భావించే పరిస్థితి తేవాలి..’’అని సీఎం రేవంత్ కోరారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
పేరుకేనా ముఖాముఖి: టీచర్ల అసంతృప్తి
ప్రమోషన్లు పొందిన వారితో సీఎం ముఖాముఖి అని చెప్పి అధికారులు తమను తీసుకొచ్చారని.. కానీ ఒక్కరికైనా మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని సమావేశం అనంతరం టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి విద్యాశాఖ అధికారులు వారం రోజుల నుంచే ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఉపాధ్యాయులను తరలించేందుకు ప్రతీ జిల్లా నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ఏర్పాటు చేశారు. దీంతో టీచర్లు ఏమేం మాట్లాడాలో ముందే సిద్ధం చేసుకున్నారు.
కనీసం జిల్లాకు ఒకరినైనా సీఎంతో మాట్లాడిస్తారని భావించామని.. కానీ సమావేశం కేవలం ప్రసంగాలకే పరిమితమైందని టీచర్లు పేర్కొన్నారు. గతంలో చెప్పినవే ఇప్పుడూ చెప్పారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా విద్యా రంగ సమస్యల పరిష్కారానికి హామీ ఇచి్చన సీఎంకు పీఆరీ్టయూటీఎస్ నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment