telangana DSC
-
ఉర్దూ టీచర్.. ఈ తెలుగమ్మాయి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పుట్టింది హిందూ తెలుగు కుటుంబంలో.. అయితేనేం.. ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఉర్దూ ఉపాధ్యాయిని ఉద్యోగం సాధించింది. ఆమె కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామానికి చెందిన పొనగంటి జయశ్రీ. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకున్న జయశ్రీ.. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు బాన్సువాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ అక్కడి జెడ్పీహైస్కూల్లో చదువుకుంది.ఇంటర్ బాన్సువాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకుని డిగ్రీ బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అభ్యసించింది. డిగ్రీ అయ్యాక బోధన్‌లోని ఆజాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ పూర్తి చేసింది. గతేడాది టెట్ రాసి ఎంపికైంది. 2024–డీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) ఉద్యోగం సాధించి బుధవారం నియామక పత్రం అందుకుంది. తొలి ప్రయత్నంలోనే టెట్, డీఎస్సీలో మంచి ప్రతిభ కనబరచడం విశేషం. మాస్టారైన గొర్రెల కాపరి.. భిక్కనూరు: కష్టాలు ఎదురైతే..ఆగిపోకుండా సాగితే విజయాలు సాధ్యమని నిరూపించాడీ యువకుడు.. చదువు మానేసి గొర్రెలు కాయడానికి వెళ్లాడు.. చదువుపై ఇష్టం, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ చదువుకొని ప్రస్తుతం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఆ విజేత భిక్కనూరుకు చెందిన కోరే కుమార్. గ్రామానికి చెందిన కోరే కమల–బీరయ్య దంపతులకు ఒక కొడుకు కుమార్, కుమార్తె ఉన్నారు.పేద కుటుంబం కావడంతో నాలుగో తరగతిలోనే తల్లిదండ్రులు కుమార్ చదువు మాన్పించారు. దీంతో ఆయన గొర్రెలు కాయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో చదువుపై మక్కువతో 2014లో ఓపెన్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన కుమార్ పాసయ్యాడు. భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో సీఈసీ, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. నిజా మాబాద్‌లోని సారంగపూర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి సోషల్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.చదవండి: మీరే మా వారధులు: డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ సభలో సీఎం రేవంత్ పట్టుపట్టి.. కొలువు కొట్టి రేగోడ్(మెదక్): ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఓ గిరిజన బిడ్డ. మండలంలోని కాకంచ తండాకు చెందిన రవికుమార్ స్కూల్ అసిస్టెంట్‌గా జిల్లా మొదటి ర్యాంకు సాధించి బుధవారం నియామకపత్రం అందుకున్నాడు. ఈసందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. తన పన్నెండేళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని ఎన్నో కలలు కన్నానని చెప్పాడు. తన ఇంట్లో పలువురు ఉన్నత ఉద్యోగాల్లో ఉండగా.. మరికొందరు ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు. నాన్నకు ప్రేమతో.. రేగోడ్(మెదక్): నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడుగా కావాలన్న కల నెరవేరిందని స్కూల్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందుకున్న జిల్లా మొదటి ర్యాంకు ఉపాధ్యాయుడు రేగోడ్ గ్రామానికి చెందిన మహేశ్ తెలిపారు. 2018లో ఉద్యోగం రాలేదని, పట్టు వదలకుండా చదివి ప్రస్తుతం సాధించానని ఆనందం వ్యక్తం చేశాడు. -
9న టీచర్ నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2024 కింద ఎంపికయ్యే ఉపాధ్యాయులకు అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దసరా నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ మేరకు 65 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేశామని.. విద్యను పేదవాడి ముంగిటకు చేర్చడ మే ధ్యేయంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.తమ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. డీఎస్సీ రాసిన వారి మెరిట్ జాబితాల్లోంచి ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేస్తామని.. ఆ జాబితాలను జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)కి పంపుతామని సీఎం చెప్పారు. అక్కడ తుది ఎంపిక జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని.. అదీ 7,857 మంది టీచర్లనే నియమించిందని పేర్కొన్నారు. అదే తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. పది నెలల్లోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అడుగులు వేశామని చెప్పారు. ఉపాధ్యాయులంటే.. ఓ భావోద్వేగం ఉపాధ్యాయులు అంటే ఉద్యోగి కాదని, ఓ భావోద్వేగమని సీఎం అభివర్ణించారు. కీలకమైన ఈ రంగం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యా రంగానికి భవిష్యత్‌లో మరిన్ని నిధులు ఇస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రా«ధాన్యమిస్తామని ప్రకటించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, వివాదాలకు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించామని సీఎం తెలిపారు. గ్రూప్–1 పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఒకే చోట ఉంచి విద్యను అందించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతీ రెసిడెన్షియల్ స్కూల్‌ను 20 నుంచి 25 ఎకరాల్లో రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మధిర, కొడంగల్ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా వీటిని చేపడుతున్నామని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.గత పదేళ్లు ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ బడులను కొనసాగిస్తామని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. తాము జాతీయ నూతన విద్యా విధానం కన్నా.. రాష్ట్ర విద్యా విధానంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తు మ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేం దర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు. -
తెలంగాణ డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు (డీఎస్సీ) ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 5 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2,79,957 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు గడువు పొడిగించడంతో ఇటీవల టెట్ అర్హత పొందిన 48 వేల మంది కూడా వీరిలో ఉన్నారు.స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షకు 1.60 లక్షల మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ (ఎస్జీటీ) పోస్టుల కోసం 80 వేల మంది దరఖాస్తు చేశారు. మిగతా వారిలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులున్నారు. తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ (ఆన్లైన్)గా జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా..ఒక్క గ్రేటర్ హైదరాబా ద్ పరిధిలోనే 27 కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.అభ్యర్థులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి రోజూ రెండు షిఫ్టులుగా పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ ఒక విడత, సాయంత్రం 2 నుంచి 4.30 గంటల వరకు మరో విడత ఉంటుంది.జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో పరీక్ష ఉండదు. ఎస్ఏ పరీక్షను జూలై 18, 20, 22, 24, 25, 30, 31, ఆగస్టు 1, 2 తేదీల్లో చేపడతారు. పీఈటీ పరీక్షను జూలై 18, 26 తేదీల్లో నిర్వహిస్తున్నారు. భాషా పండితులకు జూలై 26, ఆగస్టు 2, 5 తేదీల్లో డీఎస్సీ ఉంటుంది. పీఈటీలకు ఆగస్టు 5న, ఎస్జీటీలకు జూలై 19, 22, 23, 26, ఆగస్టు 1వ తేదీన పరీక్ష ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్‌కు జూలై 20న నిర్వహిస్తారు. -
డీఎస్సీ జాప్యంతో నిరుద్యోగుల ఆత్మహత్య
సీఎం కేసీఆర్‌కి ఆర్.కృష్ణయ్య లేఖ సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ నోటిఫికేషన్ జాప్యం కారణంగా ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రని, దీనిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కి బహిరంగ లేఖ రాశారు. నోటిఫి కేషన్ జాప్యం కారణంగా ఇటీవలే నారా యణఖేడ్లో మన్నేపు రామకృష్ణ అనే నిరు ద్యోగి, అంతకు ముందు మరో నలుగురు మరణించినట్లు పేర్కొన్నారు. టెట్ ఫలి తాల తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని 15 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి ప్రకటించినా చేయలేదన్నారు. మూడేళ్లుగా ఆరు సార్లు టీచర్ పోస్టుల భర్తీ వాయిదా వేశారని, సెప్టెంబర్ 12లోగా టీచర్ పోస్టు ల భర్తీ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతిని గుర్తు చేశారు. -
త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్: చక్రపాణి
► వైద్యశాఖలో 400 పోస్టులు ► వ్యవసాయ శాఖలో 10,150 ఏఈవోల భర్తీ ఖమ్మం: రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామని టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం అష్ణగుర్తి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే 5వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టామని, త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదలవుతాయని అన్నారు. 15వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని, నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తిస్థాయిలో నియామకాలు జరుగుతాయన్నారు. 12 ఏళ్లుగా వివాదంలో ఉన్న గ్రూప్-1 పోస్టుల భర్తీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం నుంచి జీవో వస్తే వెంటనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, మొత్తం 8వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవుతాయన్నారు. రెండు మూడు రోజుల్లోనే ఫారెస్ట్ బీట్, రేంజ్ అధికారుల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఈ పోస్టులకు ఇంటర్ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజావైద్యం పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని, ఆ శాఖలో కూడా ఖాళీల భర్తీకి మరో 400 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని, ప్రధానంగా పారామెడికల్ స్టాఫ్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. వ్యవసాయ శాఖలో 10,150 ఏఈవోలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
'ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే'
గండీడ్ (రంగారెడ్డి): తెలంగాణలో ఇప్పట్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆయన ఆదివారం రంగారెడ్డి జిల్లా గండీడ్ లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం టీచర్ల పదోన్నతులు, బదిలీలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తోన్న వారిపై తెలంగాణ ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది.