సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు (డీఎస్సీ) ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 5 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2,79,957 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు గడువు పొడిగించడంతో ఇటీవల టెట్ అర్హత పొందిన 48 వేల మంది కూడా వీరిలో ఉన్నారు.
స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పరీక్షకు 1.60 లక్షల మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ (ఎస్జీటీ) పోస్టుల కోసం 80 వేల మంది దరఖాస్తు చేశారు. మిగతా వారిలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులున్నారు. తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ (ఆన్‌లైన్)గా జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా..ఒక్క గ్రేటర్ హైదరాబా ద్ పరిధిలోనే 27 కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అభ్యర్థులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి రోజూ రెండు షిఫ్టులుగా పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ ఒక విడత, సాయంత్రం 2 నుంచి 4.30 గంటల వరకు మరో విడత ఉంటుంది.
జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో పరీక్ష ఉండదు. ఎస్‌ఏ పరీక్షను జూలై 18, 20, 22, 24, 25, 30, 31, ఆగస్టు 1, 2 తేదీల్లో చేపడతారు. పీఈటీ పరీక్షను జూలై 18, 26 తేదీల్లో నిర్వహిస్తున్నారు. భాషా పండితులకు జూలై 26, ఆగస్టు 2, 5 తేదీల్లో డీఎస్సీ ఉంటుంది. పీఈటీలకు ఆగస్టు 5న, ఎస్‌జీటీలకు జూలై 19, 22, 23, 26, ఆగస్టు 1వ తేదీన పరీక్ష ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్‌కు జూలై 20న నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment